పది రోజులపాటు కూతురి ఇంట్లో గడిపిన తండ్రి
హైదరాబాద్: పదిరోజులు కూతురు వద్ద సంతోషంగా గడిపారు.. ఇక తిరిగి తమ స్వగ్రామానికి పయనమయ్యారు.. కూతురు, అల్లుడికి బైబై మంచిగా ఉండండి బిడ్డా.. అంటూ నుండి బయలుదేరారు. ఇంటికి చేరగానే ఫోన్ చేస్తామని అన్నారు. పది నిమిషాల్లోనే పిడుగులాంటి వార్త.. మీ అమ్మ, నాన్నలకు యాక్సిడెంట్ అయ్యిందని.. ఈ హృదయవిదారక సంఘటన జీడిమెట్ల పీఎస్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది.
టాటా మినీట్రక్ డీకొట్టిన ఈ ఘటనలో భర్త అక్కడికిఅక్కడే మృతిచెందగా బార్య తీవ్రంగా గాయపడింది. ఇన్స్‌పెక్టర్ గడ్డం మల్లేష్ తెలిపిన మేరకు.. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం బుజునూరు గ్రామానికి చెందిన కటంగూరి వెంకటరామిరెడ్డి(56), లత(52) భార్యభర్తలు. పదిరోజుల క్రితం దంపతులిద్దరూ చింతల్ శ్రీసాయి నగర్‌లో ఉండే చిన్నకుమార్తె దీపిక వద్దకు వచ్చారు. కూతురి వద్ద ఆనందంగా గడిపిన వారు సోమవారం ఉదయం 6 గంటలకు వారి స్వంత గ్రామానికి బయలుదేరారు. సికింద్రాబాద్ వెళ్లేందుకు చింతల్ గణే‹Ùనగర్ బస్టాప్ వద్ద రోడ్డు దాటుతున్నారు.
ఈక్రమంలో బాలానగర్ నుండి జీడిమెట్ల వైపు వెళ్తున్న టాటా మినీ ట్రక్ అతివేగంగా వచ్చి దంపతులను డీకొట్టింది. ఈఘటనలో తీవ్రగాయాలతో వెంకటరామిరెడ్డి అక్కడికిఅక్కడే మృతిచెందగా లత తీవ్రంగా గాయపడింది. లతను చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్ అస్పత్రిలో చేరి్పంచగా ఆమె పరిస్థితి విషమంగా ఉంది. వెంకట రామిరెడ్డి మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టమ్ నిమిత్తం గాంధీ అస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


