కమ్మర్‌పల్లి (భీమ్‌గల్): వేధింపులు తాళ లేక ఇద్దరు భార్యలు కలిసి భర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించి హతమార్చారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలం దేవక్కపేట్‌లో చోటుచేసుకుంది. దేవక్కపేట్ గ్రామానికి చెందిన మాలవత్ మోహన్ అలియాస్ బ్యాండ్ మోహన్ (35)కు ఇద్దరు భార్యలు. పెద్ద భార్య కవిత, చిన్న భార్య సంగీత కాగా, వీరికి ఐదుగురు ఆడ సంతానం. మోహన్ బ్యాండ్ మేళం వాయిస్తూ వచ్చే ఆదాయంతో కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
అయితే మద్యానికి బానిసైన మోహన్ రోజూ ఇద్దరు భార్యలను కొడుతూ, బూతులు తిడుతూ వేధించేవాడు. ఈ క్రమంలోనే సోమవారం ఉదయం మద్యం సేవించి ఇంటికి వచి్చన మోహన్ భార్యలను తిడుతూ, వేదనకు గురిచేశాడు. దీంతో ఆగ్రహానికి గురైన చిన్న భార్య సంగీత భర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. ఈ సమయంలో అక్కడే ఉన్న పెద్ద భార్య కవిత, సంగీతను ప్రోత్సహించినట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


