సాక్షి, సిద్ధిపేట: కోటి ఆశలతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన జంటను రోడ్డు ప్రమాదం బలిగొంది. ఘటనలో నవ వధువు మృతి చెందగా.. భర్త తీవ్రగాయాల పాలై ఆస్పత్రిలో చికిత్స చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
సిద్దిపేటకు చెందిన ప్రణతి(24), సాయికుమార్‌లకు ఈ మధ్యే వివాహం జరిగింది. లీవ్స్ ముగిసిపోవడంతో జాబ్ నిమిత్తం సోమవారం హైదరాబాద్‌కు తిరుగు పయనం అయ్యారు. అయితే.. మిరుదొడ్డి మండలం పెద్ద చెప్యాల శివారుకు చేరుకోగానే ఓ ట్రాక్టర్ వీళ్ల బైక్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరికీ గాయాలయ్యాయి.
స్థానికులు అంబులెన్సులో గజ్వేల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా.. ప్రణతి దారిలోనే మృతి చెందింది. సాయికుమార్‌కు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ట్రాక్టర్ అదుపు తప్పి బైక్‌ను ఢీ కొట్టడంతోనే ప్రమాదం జరిగిందని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన రెండు కుటుంబాల్లో కాదు.. స్థానికంగానూ తీవ్ర విషాదాన్ని నింపింది.
ఇదీ చదవండి: పెళ్లి కోసం వేసిన టెంట్ కిందే అంతిమ సంస్కారాలు


