సాక్షి, హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ ప్రస్తుత పాలకమండలి చివరి సమావేశంగా భావిస్తున్న సాధారణ సర్వసభ్య సమావేశం మంగళవారం జరగనుంది. సమావేశంలో అనుసరించాల్సిన తీరుపై పార్టీలు వేటికవిగా వ్యూహాలు సిద్ధం చేసుకున్నాయి. ఈ అంశంపై పార్టీల ముఖ్యనేతలు కార్పొరేటర్లకు దిశానిర్దేశం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలుపు, ఓటములపై కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ల మధ్య రసాభాస జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంతో పాటు, ఇటీవలి స్టాండింగ్ కమిటీ సమావేశం సందర్భంగా తమకు ఎదురైన అనుభవంతో బీజేపీ సభ్యులు అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. జరగబోయే పరిణామాల్ని దృష్టిలో ఉంచుకొని అధికార యంత్రాంగం భారీ పోలీసు బందోబస్తు ఏర్పాట్లు చేసింది. మొత్తానికి సమావేశం ఎప్పటిలాగే రసాభాసలు, జగడ.. రగడల మధ్య వాడివేడిగా జరిగే అవకాశాలు కని్పస్తున్నాయి.
కేటీఆర్ మార్గదర్శనం
తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తమ పార్టీ కార్పొరేటర్లకు దిశానిర్దేశం చేశారు. నగరంలో భూముల అమ్మకం..ముఖ్యంగా పారిశ్రామిక భూముల అమ్మకంపై ప్రభుత్వాన్ని నిలదీయాలని పిలుపునిచ్చారు. రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు రెడీగా ఉండాలని సూచించారు. పార్టీ వెన్నంటే ఉన్న కార్యకర్తలకు భవిష్యత్తులో మరిన్ని పదవులొస్తాయన్నారు. మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన వంటి అంశాల నేపథ్యంలో మంచి భవిష్యత్ ఉంటుందని, ప్రతి ఒక్కరి గెలుపును పార్టీ తమ ఎన్నికగా భావించి గెలిపించుకుంటుందని భరోసా ఇచ్చారు. పార్టీ అధికారంలో ఉన్న పదేళ్లు బాగా పనిచేశారని, కరోనా వంటి సంక్షోభంలోనూ అద్భుత సేవలందించారని ప్రశంసించారు.
పార్టీ ప్రతిపక్షంలోకి వెళ్లాక నగరంలోని కార్పొరేటర్లు ఎప్పటికప్పుడు ప్రజాసమస్యలపై పోరాడారని అభినందించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలోనూ బాధ్యతాయుతంగా పోరాడటాన్ని ప్రస్తావించారు. పాలకమండలికి బహుశా ఇదే చివరి సమావేశమని, మీ పరిధిలోని సమస్యలపై నగరంలోని రోడ్లు, చెత్త, తదితర సమస్యలపై నిలదీయాలన్నారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు తదితర అంశాల్లో ప్రభుత్వ వైఫల్యాలపై గురించి కూడా లేవనెత్తాలన్నారు. ఈ నెల 29న దీక్షా దివస్‌ను ఘనంగా నిర్వహించాలని కోరారు. దీక్షాదివస్‌కు సంబంధించి నగరంలో చేయనున్న ఏర్పాట్లపై సమావేశంలో పాల్గొన్న మాజీమంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ మాట్లాడారు. మాజీమంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తదితర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ముందుగా ‘వందేమాతరం’ కోసం డిమాండ్
సభ ప్రారంభానికి ముందే.. నూటా యాభయ్యేళ్ల సందర్భాన్ని పురస్కరించుకొని వందేమాతరం గీతం పాడాకే సమావేశం మొదలు పెట్టాలని డిమాండ్ చేయనున్నారు. బీజేపీ సిటీ కార్యాలయంలో పార్టీ ఫ్లోర్‌లీడర్ శంకర్‌యాదవ్ ఆధ్వర్యంలో కార్పొరేటర్లతో సమావేశం నిర్వహించారు. పార్టీ రాష్ట్రప్ర«దాన కార్యదర్శి గౌతమ్‌రావు ప్రజాసమస్యలపై గట్టిగా చర్చించాలని దిశానిర్దేశం చేశారు. జీహెచ్‌ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కొప్పుల నరసింహారెడ్డి, తదితరులు మాట్లాడుతూ, వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో ప్రజల కెదురవుతున్న ఇబ్బందులు, ఎంఐఎం కార్పొరేటర్ల డివిజన్లకు మాత్రం నిధులు మంజూరు చేస్తున్న
అంశాల్ని ప్రస్తావించారు. వీటితోపాటు పలు సమస్యలపై నిలదీసేలా కార్యాచరణ రూపొందించుకున్నారు.
సినిమా చూపించనున్న బీజేపీ
‘ప్రజాసమస్యలపై ప్రశ్నిస్తే సంకెళ్లా?’అనే ప్రదర్శనలతో బీజేపీ తీవ్ర నిరసన వ్యక్తం చేసేందుకు రంగం సిద్ధం చేసింది. జీహెచ్‌ఎంసీలో టాక్స్‌ల వసూళ్లు తప్ప పనులు జరగడం లేవని, చెత్త, వీధిదీపాలు, మురుగునీరు,రోడ్లు తదితర సమస్యలతో ప్రజలు సతమతమవుతున్నారని నిలదీసేందుకు సిద్ధమయ్యారు. పైన పటారం..లోన లొటారంలా బల్దియా పరిస్థితి ఉందని సభలో ప్రస్తావించనున్నారు. వీటిపై ఫ్లెక్సీలతో, సభ్యులు వేషధారణలతో ప్రదర్శనలు నిర్వహించనున్నారు.
కాంగ్రెస్..ఎంఐఎం సైతం..
ఇక కాంగ్రెస్, ఎంఐఎంలు సైతం తమ పార్టీల తరపున ఎలా వ్యవహరించాలో ఆయా కార్పొరేటర్లకు సూచించాయి. ప్రతిపక్ష పార్టీల ఎత్తులకు పై ఎత్తులు వేయాలని, వారికి ధీటుగా సమాధానాలు ఇవ్వాలని వ్యూహరచన చేసినట్లు తెలుస్తోంది. ఈ విధంగా పార్టీల ప్రణాళికలు చూస్తే.. బల్దియా చివరి సమావేశం రసాభాస, తీవ్ర గందరగోళాల మధ్య జరిగే పరిస్థితులే కనిపిస్తున్నాయి.


