జవాబు పత్రాల్లోని ఫస్ట్, థర్డ్ పేపర్‌లో మూడు జవాబులు కొట్టివేసినట్లు గుర్తింపు
కాళోజీ వైద్య విశ్వవిద్యాలయంలో సంచలనం
దిద్దని జవాబులను దిద్ది ఓ విద్యార్థినికి న్యాయం చేశాం: వీసీ డాక్టర్ నందకుమార్ రెడ్డి
వర్సిటీలో విజిలెన్స్ అధికారుల విచారణ
సాక్షి, హైదరాబాద్: కాళోజీ నారా యణరావు వైద్య విశ్వవిద్యాలయంలో ఓ పీజీ విద్యార్థినిని పాస్ చేసిన అంశం వివాదాస్పదమైంది. ఈనెల 4న వెలువడిన పీజీ పరీక్ష ఫలితాల్లో ఫెయిలైన విద్యార్థికి ఈనెల 21న విశ్వవిద్యాల యం పాస్ మెమో ఇవ్వడం చర్చనీయాంశమైంది. ఫెయిలైన ఐదుగురు విద్యార్థులకు మార్కులు కలిపి పాస్ చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. అయితే ఈ అంశంపై కాళోజీ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ డాక్టర్ నందకుమార్ రెడ్డి స్పందిస్తూ ఒక విద్యార్థి రెండు పరీక్షలకు సంబంధించిన జవాబుపత్రాలలో జరిగిన తప్పును సరిచేసినట్లు ‘సాక్షి’కి తెలిపారు.
వివరాల్లోకి వెళితే... హైదరాబాద్‌కు సమీపంలోని ఓ ప్రైవేటు వైద్య కళాశాలలో పీజీ జనరల్ మెడిసిన్ విద్యార్థిని గత నెలలో ఫైనల్ ఇయర్ పరీక్ష రాసింది. ఫెయిల్ కావడంతో ఆ విద్యార్థిని వర్సిటీ వీసీని కలిసింది. తాను ఫెయిల య్యే అవకాశం లేదని, అన్ని జవాబులు రాసినట్లు తెలపడంతోపాటు తన జవాబు పత్రాలను పరిశీలించాలని కోరింది. దీంతో అధికారుల సమక్షంలో ఆ విద్యార్థిని రాసిన జనరల్ మెడిసిన్ జవాబు పత్రాలను పరిశీలించగా, పేపర్–1, పేపర్–3కు సంబంధించిన జవాబుల్లో మూడు జవాబులను దిద్దకుండా, ఆ జవాబులపైనే ‘ఇంటూ’మార్కు పెట్టినట్లు గుర్తించారు. దాంతో వీసీ, ఇతర అధికారులు ఆ పరీక్షపత్రాలను దిద్దిన ఇన్విజిలేటర్‌లను గుర్తించి, పిలిపించారు. దీంతో గతంలో మూల్యాంకనం చేసిన ఇని్వజిలేటర్‌లతోనే విద్యార్థిని పేపర్లను తిరిగి దిద్దించి, మార్కులను సరిచేశారు. ఆ విద్యార్థినిని పాస్ అయినట్లు తేల్చారు. ప్రతిష్టాత్మకమైన వర్సిటీ నిర్వహించిన పీజీ మెడికల్ పరీక్షల్లో అవకతవకలకు అవకాశం ఎంతవరకు ఉందనే కోణంలో విచారణ జరుగుతున్నట్లు తెలిసింది.
పీజీ రీకౌంటింగ్ ఫలితాలపై విచారణ
ఎంజీఎం: వరంగల్ కాళోజీ ఆరోగ్య వర్సిటీలో నవంబర్ 4న విడుదలైన పీజీ ఫలితాల్లో 205 మంది ఫెయిల్ కాగా, ఇందులో నలుగురు విద్యార్థులు రీకౌంటింగ్ లో అడ్డదారిలో ఉత్తీర్ణత సాధించారనే ఆరోపణల మేరకు విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఉదయం 11 గంటలకు అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు, డీఎస్పీ మల్లయ్య ఆధ్వర్యంలో విజిలెన్స్ అధికారులు వర్సిటీ కార్యాలయానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. ఎగ్జామినేషన్ కంట్రోలర్‌గా కొనసాగుతున్న డాక్టర్ మల్లీశ్వర్‌ను కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్యఅనిల్, రిజి్రస్టార్ డాక్టర్ నాగార్జున రెడ్డి సమక్షంలో 3 గంటలపాటు విచారించారు. ఈ సందర్భంగా రీకౌంటింగ్‌కు నమోదు చేసుకున్న 155 మంది విద్యార్థుల పత్రాలను పరిశీలించినట్లు తెలిసింది. కాగా, 155 మంది రీకౌంటింగ్‌కు దరఖాస్తు చేసుకుంటే ఒక్కరూ పాస్ కాలేదని రిజి్రస్టార్ నాగార్జునరెడ్డి చెప్పారు. పీజీ ఫలితాల్లో అవకతవకలు ఉంటే విచారణలో వెలుగుచూస్తాయన్నారు.


