పటాన్‌చెరులో అక్రమ మైనింగ్‌కు పాల్పడిన కేసులో ఈడీ చర్యలు
సాక్షి, హైదరాబాద్: మెదక్ జిల్లా పటాన్‌చెరులో జరిగిన అక్రమ మైనింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు ముమ్మరం చేసింది. అక్రమ మైనింగ్‌తో ప్రభుత్వాన్ని మోసం చేసినట్లు ఆధారాలు లభించడంతో పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి సోదరుడు, సంతోశ్ శాండ్ అండ్ గ్రానైట్ సప్లై యజమాని గూడెం మధుసూదన్‌రెడ్డి సహా పలువురికి చెందిన రూ. 80.05 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఈ మేరకు ఈడీ హైదరాబాద్ జోనల్ కార్యాలయం సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది.
పటాన్‌చెరు పోలీసుల ఎఫ్‌ఐఆర్‌తో రంగంలోకి ఈడీ
పటాన్‌చెరు పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. సంతోష్ శాండ్ అండ్ గ్రానైట్ సప్లై సంస్థ యజమాని గూడెం మధుసూదన్‌రెడ్డి, ఇతరులు ప్రభుత్వాన్ని మోసం చేశారని.. కేటాయించిన క్వారీ ప్రాంతంలో అధిక మైనింగ్ చేపట్టడంతోపాటు కేటాయించని ప్రభుత్వ భూముల్లో అక్రమంగా గనులు తవ్వారని ఆరోపణలు ఉన్నాయి. దీంతో ప్రభుత్వానికి రూ. 39.08 కోట్ల నష్టం వాటిల్లగా నిందితులు అక్రమ మైనింగ్ ద్వారా సుమారు రూ. 300 కోట్లు సొమ్ము చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అక్రమ మైనింగ్‌కు సంబంధించి నమోదైన పలు ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా ఈడీ దర్యాప్తు చేపట్టింది. ప్రభుత్వం సంతోశ్ శాండ్ అండ్ గ్రానైట్ సప్లై సంస్థకు మైనింగ్ లైసెన్స్‌ను మంజూరు చేయగా ఆ సంస్థ గూడెం మధుసూదన్‌రెడ్డి, జి. విక్రమ్‌రెడ్డి భాగస్వాములుగా ఉన్న జీవీఆర్ ఎంటర్‌ప్రైజెస్‌కు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చినట్లు ఈడీ దర్యాప్తులో వెల్లడైంది.
లీజుపరంగా ఈ సబ్ కాంట్రాక్టింగ్‌కు అనుమతి లేనప్పటికీ అక్రమంగా మైనింగ్ చేపట్టి దాన్ని నగదు రూపంలో విక్రయించారు. దర్యాప్తులో భాగంగా సంతోశ్ శాండ్ అండ్ గ్రానైట్ సప్లై, జీవీఆర్ ఎంటర్‌ప్రైజెస్‌తోపాటు గూడెం మధుసూధన్‌రెడ్డి, విక్రమ్‌రెడ్డి సహా ఇతర భాగస్వాముల ఇళ్లలో ఈడీ గతంలో సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో మధుసూదన్‌రెడ్డి నుంచి అనేక ఆస్తుల పత్రాలు స్వా«దీనం చేసుకుంది. ఈ ఆస్తులు వివిధ వ్యక్తుల పేరిట ఉన్నా వాటి నిజమైన లబ్ధిదారు మధుసూదన్‌రెడ్డేనని, ఆ పేర్లలో ఉన్న వారు కేవలం బినామీలేనని ఈడీ దర్యాప్తులో తేలింది. ఈ క్రమంలో రూ. 78.93 కోట్ల విలువైన 81 స్థిరాస్తులతోపాటు అదనంగా, అక్రమంగా తవి్వన ఇసుక, గ్రానైట్‌ను కొన్న వ్యక్తులు ఇంకా చెల్లించాల్సిన రూ. 1.12 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లతో కలిపి మొత్తం రూ. 80.05 కోట్ల ఆస్తులను అటాచ్ చేసినట్లు ఈడీ వెల్లడించింది.


