దేశవ్యాప్తంగా ఐసీఎంఆర్ చేపట్టిన అధ్యయనంలో వెల్లడి
ఏప్రిల్–జూన్ మధ్య 2,26,095 నమూనాలకుగాను 26,055 నమూనాల్లో పాజిటివ్‌గా గుర్తింపు
గత త్రైమాసికంతో పోలిస్తే 0.8 శాతం పాయింట్లు పెరుగుదల
సాంక్రమిక వ్యాధుల ధోరణులపై మరింత నిఘా అవసరమంటున్న వైద్య నిపుణులు
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా అంటువ్యాధులకు దారితీసే కారకాలు పెరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. తాజాగా ఏప్రిల్–జూన్ మధ్య 2,26,095 మందిలో పరీక్షించిన నమూనాల్లో 26,055 (11.5 శాతం) మందిలో ఇన్ఫెక్షన్ కారకాలను గుర్తించారు. భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) ఆధ్వర్యంలో నిర్వహించిన దేశవ్యాప్త విశ్లేషణలో భాగంగా పరీక్షలు జరిపిన ప్రతి 9 మందిలో ఒకరు ఈ లక్షణాలు కలిగి ఉన్నట్లు వెల్లడైంది. ఐసీఎంఆర్‌కు చెందిన వైరస్ పరిశోధన, డయాగ్నొస్టిక్ లేబోరేటరీస్ (వీఆర్‌డీఎల్) నెట్‌వర్క్ ద్వారా ప్రజారోగ్యానికి సంబంధించిన వైరల్ ఇన్ఫెక్షన్లను ట్రాక్ చేయడం లక్ష్యంగా ఈ అధ్యయనం నిర్వహించారు. దేశంలో పెరుగుతున్న అంటువ్యాధుల క్రమాన్ని ఇది ఎత్తిచూపుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇదీ అధ్యయనం...
దేశంలో ఐదు రకాల సాధారణ వ్యాధికారకాలను (పాథోజెన్‌లను) గుర్తించారు. శ్వాసకోశ సంబంధిత ఇన్ఫెక్షన్లకు ఇన్‌ఫ్లుయెంజా–ఎ, జ్వరం కేసుల్లో డెంగీ, పచ్చకామెర్ల విషయంలో హెపటైటిస్–ఎ, డయేరియా కేసుల పెరుగుదలకు నోరో వైరస్, ఎన్‌సెఫలైటిస్ కేసుల్లో హెర్పిస్ సింప్లెక్స్ వైరస్‌లను గుర్తించారు. వాటికి సంబంధించి మరింత విస్తారంగా పరిశోధించగా తీవ్ర శ్వాసకోశ ఇన్ఫెక్షన్లలో (ఏఆర్‌ఐ, ఎస్‌ఏఆర్‌ఐ) ఇన్‌ఫ్లుయెంజా–ఎ, తీవ్ర జ్వరం, రక్తస్రావం, జ్వరం కేసుల్లో డెంగీ వైరస్, కామెర్ల కేసుల్లో హెపటైటిస్–ఎ, తీవ్ర డయేరియా (ఏడీడీ) వ్యాప్తిలో నోరోవైరస్, తీవ్ర ఎన్‌సెఫలైటిస్ సిండ్రోమ్ (ఏఈఎస్) కేసుల్లో హెర్పిస్ సింప్లెక్స్ వైరస్ (హెచ్‌ఎస్‌వీ) ఉన్నట్లు గుర్తించారు.
2025 తొలి త్రైమాసికంలో (జనవరి–మార్చి) 10.7%గా ఉన్న ఇన్ఫెక్షన్ రేటు రెండో త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) 11.5%కి పెరిగిందని ఈ నివేదిక పేర్కొంది. తొలి త్రైమాసికంలో పరీక్షించిన 2,28,856 నమూనాలకుగాను 24,502 నమూనాల్లో వ్యాధికారక కారకాలు ఉన్నట్లు తేలింది. ఆ తర్వాతి త్రైమాసికంలో 2,26,095 సేకరించిన నమూనాలకుగాను 26,055 నమూనాల్లో పాజిటివ్‌గా తేలింది. ఇది 0.8 శాతం పాయింట్ల పెరుగుదలను సూచించింది. ఈ పెరుగుదల స్వల్పంగా కనిపించినప్పటికీ ఇది కాలానుగుణ వ్యాప్తికి లేదా కొత్తగా వచ్చే ఇన్ఫెక్షన్లకు ముందస్తు సంకేతం కావచ్చని ఐసీఎంఆర్ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
నిరంతర నిఘా ప్రాముఖ్యతను ఇది నొక్కి చెబుతుందని చెబుతున్నారు. ‘ఇన్ఫెక్షన్ రేటులో స్వల్పమార్పులు కూడా సంభావ్య అంటువ్యాధులకు ముందస్తు హెచ్చరికగా ఉపయోగపడతాయి. వీఆర్‌డీఎల్ నెట్‌వర్క్ భారత్‌లో ముందస్తు గుర్తింపు వ్యవస్థగా కీలక పాత్ర పోషిస్తుంది’ అని నిపుణులు చెబుతున్నారు.
ముఖ్యాంశాలు...
⇒ ఈ ఏడాది ఏప్రిల్–జూన్ మధ్య 191 వ్యాధి సమూహాలను పరిశోధించారు.
⇒ గవదబిళ్లలు, మీజిల్స్, రుబెల్లా, డెంగీ, చికున్‌గున్యా, రోటావైరస్, నోరోవైరస్, వరిసెల్లా జోస్టర్ వైరస్, ఈబీవీ, ఆస్ట్రోవైరస్ వంటి ఇన్ఫెక్షన్‌లను గుర్తించారు.
⇒ జనవరి–మార్చి మధ్య 389 సమూహాలను పరిశీలించి హెపటైటిస్, ఇన్‌ఫ్లుయెంజా, లెప్టోస్పిరా, లైంగికంగా సంక్రమించే అంటువ్యాధుల వంటి సారూప్య వ్యాధికారకాలను కనుగొన్నారు.
⇒ 2014 నుంచి 2024 వరకు వీఆర్‌డీఎల్ నెట్‌వర్క్ 40 లక్షలకుపైగా నమూనాలను పరీక్షించింది. వాటిలో 18.8%లో వ్యాధికారకాలను గుర్తించింది.
⇒ 2014లో 27 ప్రయోగశాలల నుంచి 2025 నాటికి 31 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 165 ప్రయోగశాలలకు దేశవ్యాప్తంగా 2,534 వ్యాధి సమూహాలను ట్రాక్ చేశారు.
మరింత పర్యవేక్షణ ఆవశ్యకత...
ప్రజారోగ్య ప్రాముఖ్యతగల వైరల్ ఇన్ఫెక్షన్లను గుర్తించే ప్రయత్నాల్లో భాగంగా చేపట్టిన ఈ అధ్యయనం సంక్రమణ ధోరణులను మరింతగా పర్యవేక్షించాల్సిన అవసరాన్ని చాటిచెబుతోందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అలాగే ఈ అధ్యయనం కాలానుగుణ వ్యాధులు, కొత్తగా వచ్చే ఇన్ఫెక్షన్లకు హెచ్చరికగా ఉపయోగపడుతుందని వారు అంటున్నారు. ఇన్ఫెక్షన్ రేట్లలో త్రైమాసిక మార్పులను ట్రాక్ చేస్తుంటే భవిష్యత్తులో వచ్చే అంటువ్యాధులను సకాలంలో నివారించవచ్చని సూచిస్తున్నారు.


