
రాష్ట్రంలో ఈసారి రికార్డు స్థాయిలో పంటల సాగు
అంచనాను 100 శాతం చేరుకున్న వ్యవసాయ శాఖ... అత్యధికంగా 67.30 లక్షల ఎకరాల్లో వరి సాగు
తరువాత స్థానంలో పత్తి, మొక్కజొన్న
వరి, పత్తి పంటల సాగే కోటీ 13 లక్షల ఎకరాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈ వానాకాలం సీజన్‌లో వ్యవసాయ శాఖ అంచనాలకు అనుగుణంగా రికార్డు స్థాయిలో వివిధ రకాల పంటలు 100 శాతానికి పైగా సాగయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈసారి 1.32 కోట్ల ఎకరాల్లో వివిధ రకాల పంటలను సాగు చేయాలని వ్యవసాయ శాఖ ప్రణాళిక రూపొందించగా, అంతకన్నా ఎక్కువగా 1.33 కోట్ల ఎకరాల్లో పంటలు సాగవడం గమనార్హం. గత సంవత్సరం వానాకాలం సీజన్‌లో 1.28 కోట్ల ఎకరాల్లో పంటలను వేయగా, ఈసారి సుమారు 5 లక్షల ఎకరాల్లో అధికంగా సాగు చేశారు.
ఇందులో అత్యధికంగా వరి అంచనాల కన్నా 5 లక్షల ఎకరాల్లో అధికంగా సాగైంది. 62.47 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుందని వ్యవసాయ శాఖ ప్రణాళిక రూపొందించగా, అందుకు భిన్నంగా ఏకంగా 67.30 లక్షల ఎకరాల్లో (107 శాతం) వరి సాగైంది. వరి తరువాత అత్యధికంగా పత్తి 46 లక్షల ఎకరాల్లో సాగవడం గమనార్హం. అంటే ఈ రెండు పంటల విస్తీర్ణమే ఏకంగా 1.13 కోట్ల ఎకరాలు. మిగతా అన్ని పంటలు కలిపి మరో 20 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి.
పెరిగిన మొక్కజొన్న సాగు విస్తీర్ణం
రాష్ట్రంలో ఈసారి మొక్కజొన్న కూడా అంచనాను మించి సాగైంది. రాష్ట్రంలో 5.21 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగవుతుందని అంచనా వేయగా, 6.44 లక్షల ఎకరాల్లో ఈ పంటను సాగు చేశారు. ఆరుతడి పంటగా మెట్ట ప్రాంతాల్లోనే కాకుండా సాగునీరు లభ్యత ఉన్న చోట కూడా ఈసారి మొక్కజొన్నను సాగు చేయడం గమనార్హం. గత సంవత్సరం 5.23 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న వేయగా, ఈసారి 1.20 లక్షల ఎకరాల్లో అధికంగా సాగు చేశారు.
మొక్కజొన్న తరువాత అధికంగా కందులు 4.91 లక్షల ఎకరాల్లో సాగు చేసినట్లు వ్యవసాయ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, సంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో సోయాబీన్ కూడా ఈసారి అధికంగానే సాగైంది. ఇవి కాకుండా వేరుశనగ, పెసర, జొన్న, మినుములు వంటి పంటలను కూడా సాగు చేసినప్పటికీ విస్తీర్ణం కొన్ని వేల ఎకరాల్లోనే ఉంది. కాగా ఈసారి చెరుకు పంట గత సంవత్సరం కన్నా దాదాపు రెండింతలు 35,641 ఎకరాల్లో సాగవడం విశేషం. నిజామాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల్లో చెరుకును సాగు చేసినట్లు తెలుస్తోంది.