మాడు మూసుకుపోయిన చిన్నారికి అరుదైన శ‌స్త్రచికిత్స‌ | Rare Surgery Suturectomy To Three Months Old Done By Kamineni Doctors | Sakshi
Sakshi News home page

మాడు మూసుకుపోయిన చిన్నారికి అరుదైన శ‌స్త్రచికిత్స‌

Dec 17 2024 3:42 PM | Updated on Dec 17 2024 5:07 PM

Rare Surgery Suturectomy To Three Months Old Done By Kamineni Doctors
  • ఎండోస్కొపిక్ సూచ‌రెక్ట‌మీ, అనంత‌రం హెల్మెట్ థెర‌పీ
  • కామినేని ఆస్పత్రి వైద్యుల చొర‌వ‌తో చిన్నారికి త‌ప్పిన ఆపద

హైద‌రాబాద్: పిల్ల‌లు పుట్టిన త‌ర్వాత కొంత కాలం పాటు వారికి మాడు భాగం (త‌ల‌లో పైభాగం) మెత్త‌గా ఉంటుంది. మిగిలిన క‌పాలం మొత్తం ఏర్ప‌డినా, అక్క‌డ మాత్రం కొంత ఖాళీ ఉంటుంది. మెద‌డు త‌గినంత‌గా ఎదిగేందుకు ఇది దోహ‌దం చేస్తుంది. కానీ, కొంత‌మంది పిల్ల‌ల్లో మాత్రం జ‌న్యుప‌ర‌మైన కార‌ణాల వ‌ల్ల అత్యంత అరుదుగా ఆ భాగం కూడా మూసుకుపోయి ఉంటుంది. దానివ‌ల్ల మెద‌డులో ఒత్తిడి (ప్రెష‌ర్‌) పెరిగిపోవ‌డం, త‌ల భాగం అస్త‌వ్య‌స్తంగా పెర‌గ‌డం, కంటిచూపు తేడా రావ‌డం లాంటి అనేకానేక స‌మ‌స్య‌లు వ‌స్తాయి. 

వీలైనంత త్వ‌ర‌గా గుర్తించి శ‌స్త్రచికిత్స చేయిస్తే కొద్ది కాలంలోనే ఇది న‌య‌మ‌వుతుంది. ఆల‌స్యం చేసేకొద్దీ స‌మ‌స్య మ‌రింత తీవ్రంగా మారుతుంది. ఇలాంటి అరుదైన కేసును స‌మ‌యానికి గుర్తించి, అరుదైన శ‌స్త్రచికిత్స చేసిన ఎల్బీన‌గ‌ర్ కామినేని ఆస్ప‌త్రి వైద్యులు.. ఓ చిన్నారికి ప్రాణ‌దానం చేశారు. ఇందుకు సంబంధించిన వివ‌రాల‌ను ఆస్ప‌త్రికి చెందిన కన్సల్టెంట్ న్యూరో సర్జన్, మినిమల్ యాక్సెస్ బ్రెయిన్ & స్పైన్ సర్జన్  డాక్ట‌ర్‌. ఎస్ రమేష్ తెలిపారు.

“వ‌రంగ‌ల్‌లో 3డి ప్రింటింగ్ చేసే వ్య‌క్తికి శిశువు పుట్టిన త‌ర్వాత సుమారు మూడు నెల‌ల వ‌య‌సులో ఉండ‌గా సాధార‌ణంగానే పిల్ల‌ల వైద్యుల‌కు చూపించారు. కానీ, ఖాళీగా ఉండాల్సిన మాడు ప్రాంతం కూడా బాగా గ‌ట్టిగా ఉండి, అక్క‌డ సైతం క‌పాలం ఏర్ప‌డ‌డాన్ని ఆయ‌న గుర్తించి.. అందుకు తగిన శ‌స్త్రచికిత్స చేయాల‌ని కామినేని ఆస్ప‌త్రికి రిఫ‌ర్ చేశారు. ఇక్క‌డ చిన్నారికి అవ‌స‌ర‌మైన అన్ని ర‌కాల ప‌రీక్ష‌లు చేసిన త‌ర్వాత‌.. ఎండోస్కొపిక్ విధానంలోనే సూచ‌రెక్ట‌మీ అనే శ‌స్త్రచికిత్స చేశాం. ఈ విధానంలో మూసుకుపోయిన మాడు ప్రాంతాన్ని మ‌ళ్లీ తెరిచి, మెద‌డు త‌గినంత‌గా ఎదిగేందుకు కావ‌ల్సిన వాతావ‌ర‌ణాన్ని కల్పించాం. ఇలాంటి కేసులు చాలా అరుదుగా ఉంటాయి. జ‌న్యుప‌ర‌మైన కార‌ణాల వ‌ల్లే చాలావ‌ర‌కు ఇలాంటి స‌మ‌స్య త‌లెత్తుతుంది. ప్ర‌తి మూడువేల మంది శిశువుల్లో ఒక‌రికి మాత్ర‌మే ఇలా జరుగుతుంది.

ఈ శ‌స్త్రచికిత్స చేసిన త‌ర్వాత హెల్మెట్ థెర‌పీ కూడా చాలా ముఖ్యం. దాదాపు 12 నుంచి 15 నెల‌ల పాటు ప్ర‌తిరోజూ సుమారు 22-23 గంట‌లు శిశువుకు ఇది పెట్టి ఉంచాలి. దానివ‌ల్ల ఎక్క‌డ మెద‌డు ఎక్కువ‌గా పెర‌గ‌కూడ‌దో అక్క‌డ నియంత్రించ‌డం, ఎక్క‌డ ఎదుగుద‌ల అవ‌స‌ర‌మో అక్క‌డ ఫ్రీగా ఉంచ‌డం సాధ్య‌మ‌వుతుంది. ఈ హెల్మెట్ కూడా ఇక్క‌డ అందుబాటులో ఉండదు. అందుకే ప్ర‌త్యేకంగా బెంగ‌ళూరు నుంచి తెప్పించాం. ఇందులోని కుష‌న్ అనేక పొర‌లుగా ఉంటుంది. శిశువు ఎదిగేకొద్దీ మెద‌డు కూడా ఎదుగుతుంది కాబ‌ట్టి.. అందుకు త‌గిన‌ట్లుగా కొన్ని పొర‌ల‌ను తొల‌గిస్తూ వెళ్తాం. ఇప్పుడు ఈ శిశువు పూర్తి ఆరోగ్యంతో ఉంది.  మ‌రికొన్నాళ్ల పాటు ఫాలో అప్ కోసం వ‌స్తూ, హెల్మెట్ మాత్రం త‌ప్ప‌నిస‌రిగా ధ‌రింప‌జేస్తూ ఉండాల‌ని త‌ల్లిదండ్రుల‌కు సూచించాం” అని డాక్ట‌ర్‌. రమేష్ తెలిపారు.

ఈ శ‌స్త్రచికిత్స విజయవంతం కావడంలో కామినేని హాస్పిటల్స్‌లో ఉన్న అత్యాధునిక వైద్య సదుపాయాలు, ముఖ్యంగా అనస్తేషియా విభాగం, అనుభవజ్ఞులైన సిబ్బంది, నర్సింగ్ సిబ్బంది కారణమని తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement