రాయితీని రూ. 4 లక్షల నుంచి రూ. లక్షకు కుదిస్తూ ప్రభుత్వం నిర్ణయం
సుమారు 15 లక్షల మంది నిరుద్యోగ
దరఖాస్తుదారులకు నిరాశ.. రూ. వెయ్యి కోట్ల మేర రాయితీ నిధులు అందించే అవకాశం
సాక్షి, హైదరాబాద్: రాజీవ్ యువ వికాసం పథకం కింద దరఖాస్తు చేసుకున్న అత్యధిక శాతం మంది నిరుద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తీవ్ర నిరాశకు గురిచేసింది. కేవలం రూ. లక్ష వరకు ఉన్న యూనిట్లకు మాత్రమే రాయితీ ఇస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఇటీవల అధికారులతో నిర్వహించిన ఓ సమావేశంలో స్పష్టం చేశారు. ఈ మేరకు దరఖాస్తులను విభజించి అర్హతలు, దరఖాస్తుల సంఖ్య, నిధుల ఆవశ్యకత తదితర అంశాలతో కూడిన ప్రతిపాదనలను సమర్పించాలని అధికారులను ఆయన ఆదేశించడంతో... వివిధ కార్పొరేషన్ల ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించారు.
నవంబర్ 19 నుంచి లబ్ధిదారులకు రాయితీ అందిస్తామని భట్టి ప్రకటించడంతో అర్హుల జాబితాలను సిద్ధం చేసేందుకు క్షేత్రస్థాయి యంత్రాంగం సైతం సిద్ధమవుతోంది. అయితే ప్రభుత్వం నిర్ణయించిన విధంగా దరఖాస్తులను విభజిస్తే మొత్తం దరఖాస్తుల్లో అతితక్కువ మందికే లబ్ధి కలిగే అవకాశం ఉంది. మొత్తం దరఖాస్తుల్లో కనీసం 10 శాతం మందికి కూడా అర్హత లభించే పరిస్థితి లేకపోవడంతో ఆర్జీదారుల్లో దాదాపు 90 శాతం మంది తీవ్ర నిరాశకు గురవుతున్నారు.
మొత్తం దరఖాస్తులు 16.23లక్షలు...
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకం కింద గతేడాది మార్చిలో ప్రభుత్వం దరఖాస్తుల స్వీకరణ చేపట్టింది. మూడు వారాలపాటు గడువు ఇవ్వడంతో మొత్తం 16,23,764 మంది దరఖాస్తులు సమరి్పంచారు. ఈ దరఖాస్తులను నాలుగు కేటగిరీల్లో ప్రభుత్వం స్వీకరించింది. రూ. 50 వేలలోపు ఉన్న యూనిట్‌ను కేటగిరీ–1గా, రూ. లక్ష లోపు ఉంటే కేటగిరీ–2, రూ. 2 లక్షల లోపు కేటగిరీ–3, రూ. 4 లక్షల్లోపు ఉన్న యూనిట్లను కేటగిరీ–4గా విభజించింది.
స్వయం ఉపాధి కింద కొత్తగా యూనిట్లు ఏర్పాటుచేయాలంటే కనీసం రూ.లక్షన్నర నుంచి రూ. 4 లక్షలు అవసరమనేది నిరుద్యోగుల అంచనా. దీంతో కేటగిరీ–3, కేటగిరీ–4లోనే పెద్ద సంఖ్యలో నిరుద్యోగులు దరఖాస్తులు సమర్పించారు. కానీ ఇప్పుడు కేవలం కేటగిరీ–1, కేటగిరీ–2 దరఖాస్తులకే రాయితీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ఆయా కేటగిరీల దరఖాస్తులను పరిశీలించి అర్హతలు నిర్ధారించాలని కలెక్టర్లకు ఉపముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. కేటగిరీ–1, కేటగిరీ–2లో 1.32 లక్షల దరఖాస్తులు ఉండగా కేటగిరీ–3, కేటగిరీ–4లో ఏకంగా 14.91 లక్షల దరఖాస్తులున్నాయి.
రాయితీ రూ. వెయ్యి కోట్లు...
ప్రభుత్వం నిర్ణయించిన కేటగిరీల్లో దరఖాస్తులను పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు మండల, మున్సిపల్ స్థాయిలో అధికారులు బృందాలుగా ఏర్పడి క్షేత్రస్థాయి పరిశీలనకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, దివ్యాంగుల కార్పొరేషన్లు కేటగిరీలవారీగా వచి్చన దరఖాస్తులు, అర్హతలపై అంచనాలు, అవసరమైన నిధులకు సంబంధించి ప్రతిపాదనలు రూపొందిస్తున్నాయి.
ఇప్పటికే ఎస్సీ కార్పొరేషన్ ప్రాథమికంగా ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి సమరి్పంచింది. ఒకట్రెండు రోజుల్లో మిగిలిన కార్పొరేషన్లు కూడా ప్రతిపాదనలు ప్రభుత్వానికి సమరి్పంచేందుకు ఉన్నతాధికారులు చర్యలు వేగవంతం చేశారు. మొత్తంగా రెండు కేటగిరీల్లో రాయితీలు ఇస్తే రూ. వెయ్యి కోట్లు అవసరమని అధికారులు అంచనా వేస్తున్నారు.
కేటగిరీ - దరఖాస్తులు
రూ. 50 వేల లోపు - 39,401
రూ. 50 వేలు– రూ.లక్ష - 93,233
రూ. లక్ష– రూ. 2 లక్షలు 2,49,434
రూ. 2 లక్షలు– రూ. 4 లక్షలు - 12,41,696
మొత్తం - 16,23,764


