కౌలు రైతులకు బీమా, రుణాలు

Rahul Gandhi Promised To Provide Insurance Loan Facility To Tenant Farmers In Telangana - Sakshi

‘ధరణి’స్థానంలో అన్ని వర్గాలకు మెరుగైన విధానం తెస్తాం 

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ హామీ 

ఎన్నికల మేనిఫెస్టోలో రైతు సమస్యలకు పరిష్కారం చూపుతామని వెల్లడి 

ఆదిలాబాద్, పరిగి అన్నదాతలతో 45 నిమిషాలపాటు భేటీ 

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: తెలంగాణలో కౌలు రైతులకు బీమా, రుణ సౌకర్యం కల్పిస్తామని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ హామీ ఇచ్చారు. ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన పంటలకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పరిహారం ఇవ్వడం లేదని.. తాము అధికారంలోకి వస్తే రైతులందరికీ నష్టపరిహారం అందిస్తామన్నారు. అలాగే ధరణి పోర్టల్‌ వల్ల సన్న, చిన్నకారు రైతులు, సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా తాము అంతకంటే మెరుగైన విధానాన్ని తీసుకొచ్చి అన్ని వర్గాలకు మేలు చేసేలా చూస్తామని స్పష్టం చేశారు.

భారత్‌ జోడో యాత్రలో భాగంగా గురువారం మక్తల్‌ మండలం బొందలకుంట లో మధ్యాహ్న భోజన సమయంలో రాహుల్‌గాంధీ రైతులు, రైతు స్వరాజ్య వేదిక ప్రతినిధులతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆదిలాబాద్, పరిగికి చెందిన అన్నదాతలతో సుమారు 45 నిమిషాలపాటు ముచ్చటించారు. మహిళా రైతుల ఆవేదన విని చలించిన రాహుల్‌.. వారి పిల్లలను ఆప్యాయంగా పలకరించారు. 

ఎన్నికల మేనిఫెస్టోలో..
అప్పుల బాధతో తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని పరిగికి చెందిన మహిళా కౌలు రైతు మంజుల చెబుతున్న క్రమంలో రాహుల్‌ చలించిపోయారు. ఎంత మంది పిల్లలు.. ఎలా జీవిస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. తనకు ముగ్గురు పిల్లలని.. ఇంకా రూ. 7 లక్షల అప్పు ఉందని ఆమె చెప్పారు. ఆమె బాధలు విని కొద్దిసేపు మౌనంగా ఉన్న రాహుల్‌... కౌలు రైతుల సమస్యలకు ఎలాంటి పరిష్కారాలు చూపితే బాగుంటుందో రైతు స్వరాజ్య వేదిక నేతలతో చర్చించారు.

ఆ తర్వాత రైతాంగ సమస్యలు, పరిష్కార మార్గాలను ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చాలని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మధుయాష్కీగౌడ్‌కు సూచిందచారు. ఈ మేరకు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ వివరాలను వారు వెల్లడించారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ ఎంపీలు బలరాం నాయక్, అద్దంకి దయాకర్, పొన్నం ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు. కాగా, శుక్రవారం చేనేత, పోడు భూములను సేద్యం చేసుకుంటున్న వారి సమస్యలను రాహుల్‌ తెలుసుకోనున్నారు. 

మా వద్ద మ్యాజిక్‌ బుల్లెట్లు లేవు
రైతు సమస్యల పరిష్కారానికి మా వద్ద మ్యా జిక్‌ బుల్లెట్లు ఏమీ లేవు. వారి సమస్యల పరి ష్కారానికి సమగ్ర విధానం రూపొందిస్తాం. రైతు పక్షపాత విధానాలతో వారి సంక్షేమం కో సం చిత్తశుద్ధితో పనిచేస్తాం.     
– రాహుల్‌ గాంధీ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top