నాచుపల్లి జేఎన్‌టీయూలో ర్యాగింగ్ కలకలం
వీడియోలు సోషల్ మీడియాలో వైరల్
కొడిమ్యాల: జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నాచుపల్లిలోని జేఎన్‌టీయూలో పాలన గాడి తప్పింది. సెక్యూరిటీ సిబ్బందితో విద్యార్థులు ఘర్షణ పడిన విషయం మరవకముందే, సీనియర్ విద్యార్థులు జూనియర్లను ర్యాగింగ్ చేసిన అంశం తెరపైకి వచి్చంది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
పరిచయాల పేరుతో పరేషాన్.. ఆపై ర్యాగింగ్
రెండురోజుల క్రితం కళాశాలలో ఫ్రెషర్స్ డే నిర్వహించారు. కార్యక్రమానికి ఎస్పీ అశోక్ కుమార్ ముఖ్య అతి థిగా హాజరయ్యారు. ర్యాగింగ్, ఇతరత్రా అంశాలపై విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. అయితే వేడుకలకు సరిగ్గా రెండు రోజుల ముందు బాయ్స్ హాస్టల్లో కొందరు జూనియర్లపై ర్యాగింగ్‌కు పాల్పడినట్టు వీడియో లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ఫస్టియర్ చదు వుతున్న ఇద్దరు అబ్బాయిలతో హాస్టల్‌లో ఒకరినొకరు పెళ్లి చేసుకున్నట్టు తంతు నిర్వహించారు. అక్కడే ఉన్న కొందరు విద్యార్థులు ఈ తతంగాన్ని వీడియో తీశారు.
సెక్యూరిటీ ఇన్‌చార్జితో ఘర్షణ...సస్పెన్షన్
రెండురోజుల క్రితం సెక్యూరిటీ ఇన్‌చార్జ్ రాజిరెడ్డికి, విద్యార్థులకు మధ్య జరిగిన ఘర్షణ పరిస్థితిని మరింత వేడెక్కించింది. మద్యం సేవించి హాస్టల్లోకి వస్తున్న రాజిరెడ్డి.. తమను బూతులు తిడుతూ అడ్డగోలుగా ప్రవర్తిస్తున్నాడంటూ విద్యార్థులు నిరసన చేపట్టారు.ఈ ఘటనపై విచారణ జరిపిన అధికారులు సెక్యూరిటీ ఇన్‌చార్జి రాజిరెడ్డిని సస్పెండ్ చేశారు.
ర్యాగింగ్ జరగలేదు
జేఎన్‌టీయూ క్యాంపస్‌లో ర్యాగింగ్ జరిగిందని వస్తున్న వార్తల్లో నిజం లేదు. ఇంటరాక్షన్‌లో భాగంగా సీనియర్లు, జూనియర్ల మధ్య ఒక ఫన్నీ గేమ్ ఘటనను గుర్తించాం. సంబంధిత విద్యార్థులను పిలిపించి విచారించాం. సీనియర్ల నుంచి ఎలాంటి ఒత్తిడి లేదని, సరదా కోసం మాత్రమే వివాహ సన్నివేశంలో పాల్గొన్నామని విద్యార్థులు చెప్పారు. – నరసింహ, జేఎన్‌టీయూ కళాశాల ప్రిన్సిపాల్


