ఎకరాకు రూ.10 వేలు | Sakshi
Sakshi News home page

ఎకరాకు రూ.10 వేలు

Published Wed, Mar 20 2024 1:27 AM

In principle decision of the State Government on crop damage compensation - Sakshi

పంటనష్టపరిహారంపై రాష్ట్ర ప్రభుత్వ సూత్రప్రాయ నిర్ణయం 

50 వేల ఎకరాల్లో నష్టం... ఇంకా నష్టం అంచనా వేస్తున్న అధికారులు  

ఎన్నికల కమిషన్‌ అనుమతితో పరిహారం ప్రకటించే అవకాశం 

సాక్షి, హైదరాబాద్‌: అకాల వర్షాలు, వడగళ్ల కారణంగా పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఎకరాకు రూ.10 వేలు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు పంటనష్టం అంచనా వేయాలని వ్యవసాయశాఖను ఆదేశించింది. వచ్చే రెండుమూడు రోజులు కూడా వర్షాలు పడే అవకాశమున్న నేపథ్యంలో అప్పటివరకు జరిగే మొత్తం నష్టాన్ని అంచనా వేసి రైతులకు పరిహారం ఇస్తామ ని వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి.

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో గతేడాది ఒకసారి తీవ్రమైన వర్షాలతో పంటలకు నష్టం జరిగినప్పుడు ఎకరాకు రూ.10 వేలు పరిహారం ఇచ్చిన సంగతి తెలిసిందే. అదే తరహాలో ఇప్పుడు కూడా పరిహారం ఇచ్చే అవకాశముందని అధికారులు తెలిపారు. అయితే ఎన్నికల కోడ్‌ ఉన్నందున ఈసీ అనుమతి తీసుకొని పరిహారం ప్రకటించొచ్చని అంటున్నారు.  

50 వేల ఎకరాల్లో పంటల నష్టం  
అకాల వర్షాలు, వడగళ్లు, ఈదురుగాలులకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 50 వేల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లిందని వ్యవసాయశాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. వరి, మొక్కజొన్న, జొన్న, పొగా కు, వేరుశనగ, మిర్చి, కూరగాయలు, బొప్పాయి, ఉల్లి పంటలు దెబ్బతిన్నాయి. వరి పొలాలకు నీరు లేక ఎండిపోయి దెబ్బతినటంతోపాటు ఈ వర్షాల వల్ల ఉన్న కాస్త ధాన్యం రాలిపోయింది.

నిజామాబాద్, నిర్మల్, సిరిసిల్ల, సంగారెడ్డి, ఆదిలాబాద్, సిద్దిపేట జిల్లాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్టు వ్యవసాయశాఖ నిర్థారించింది. మిగిలిన జిల్లాల్లోనూ పంటలకు ఏమైనా నష్టం జరిగిందా లేదా అన్న వివరాలు పంపించాలని జిల్లా వ్యవసాయ అధికారులను ఆదేశించింది.

ఎక్కడికక్కడ పంట న ష్టం అంచనాలు వేయడంపై దృష్టి సారించినట్టు అధికారులు తెలిపారు. అయితే తీవ్రమైన ఎండల వల్ల ఇటీవల పలు జిల్లాల్లో పంటలు దెబ్బతిన్నా యి. వాటి విషయంలో మాత్రం తాము నష్టాలను అంచనా వేయడం లేదని అధికారులు తెలిపారు.  

ఎకరాకు రూ. 25 వేలు ఇవ్వాలి: పశ్య పద్మ 
దెబ్బతిన్న పంటలన్నింటినీ సర్వే చేసి నష్టం అంచనా వేయాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ ప్రభుత్వాన్ని కోరారు. నష్టం జరిగిన పంటలకు ఎకరాకు రూ.25 వేలు రైతులకు పరిహారం ఇవ్వాలని కోరారు. సిరిసిల్ల జిల్లాలో విద్యుత్‌ స్తంభం, చెట్టు విరిగిపడి రైతు మరణించారని, చనిపోయిన రైతు కుటుంబాన్ని ఆదుకోవడానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం చేయాలని ఆమె ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.  

రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి: మంత్రి తుమ్మల
రాష్ట్రంలో రెండు మూడు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో అక్కడక్కడా కొన్ని ప్రాంతాల్లో పంట నష్టం సంభవించినట్టు తెలుస్తోందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. మరో రెండు మూడు రోజులు కూడా అకాల వర్షాలు సంభవించే అవకాశముందన్నారు. రైతులంతా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

వ్యవసాయ, ఉద్యాన, మార్కెటింగ్‌ అధికారులు రైతులకు అందుబాటులో ఉండి తగు సూచనలు ఇవ్వాలని ఆదేశించారు. మార్కెట్‌కు తీసుకొచ్చిన ధాన్యం, మిర్చి సహా ఇతర పంటలు దెబ్బతినకుండా అన్ని జాగ్రత్తలు చేపట్టాల్సిందిగా  ఆదేశాలు జారీ చేశారు. కల్లాల్లోగానీ, ఇతర ప్రాంతాల్లో ఆరబోసిన ధాన్యంగానీ దెబ్బతినకుండా రైతులకు తగు సూచనలు ఇవ్వాలన్నారు.   

Advertisement
 
Advertisement