రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయంలో రాష్ట్రపతికి గవర్నర్ జిష్ణదేవ్ శర్మ, సీఎం రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి ప్రధాన కార్యదర్శి రామరామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందనలతో హైదరాబాద్ సీపీ సజ్జనార్ తదితరులు పాల్గొన్నారు.
శీతాకాల విడిదిలో భాగంగా హైదరాబాద్ పర్యటనకు వచ్చిన రాష్ట్రపతి మధ్యాహ్నం రాజ్‌భవన్‌లో బస చేస్తారు. అక్కడి నుండి 3.50 గంటలకు బొల్లారంలోని రాష్ట్రపతి శీతాకాల విడిది గృహానికి చేరుకుంటారు. సాయంత్రం 4 గంటలకు రాష్ట్రపతి నిలయం వేదికగా నిర్వహించే భారతీయ కళా మహోత్సవాన్ని ముర్ము ప్రారంభిస్తారు. తిరిగి సాయంత్రం 6.15 గంటలకు రాజ్ భవన్ చేరుకుంటారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా మధ్యాహ్నం 2.30 గంటలనుంచి సాయంత్రం 4 గంటల వరకూ రాజ్ భవన్, వీవీ స్టాట్యూ, మెట్రో రెసిడెన్సీ, పంజాగుట్ట, తదితర ప్రాంతాలలో ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని పోలీసులు పేర్కొన్నారు.
అదేవిధంగా సాయంత్రం 5.30 గంటల నుంచి రాత్రి 6.45 గంటల వరకూ బైసన్ సిగ్నల్ నుంచి రాజ్ భవన్ వరకూ ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని తెలిపారు. రేపు ఉదయం 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకూ రాజ్‌భవన్, వీవీ స్టాట్యూ, మెట్రో రెసిడెన్సీ, గ్రీన్ ల్యాండ్స్, బేగంపేట్ ఫ్లై ఓవర్ , రసూల్ పూర, సీటీఓ వరకూ ఆంక్షలు ఉంటాయని ట్రాఫిక్ పోలీసులు పేర్కొన్నారు.


