నా చావుతోనైనా అధికారుల్లో మార్పు వస్తుందేమో!
చెరువులో దూకి మల్కాజిగిరి కార్పొరేటర్ ఆత్మహత్యాయత్నం
మల్కాజిగిరి: ఎన్నిసార్లు చెప్పినా ఇంజినీరింగ్ అధికారులు పట్టించుకోవడం లేదు.. మేయర్, ఉన్నతాధికారులు వచ్చి ఆదేశాలిచ్చినా అధికారులు అమలు చేయడంలేదంటూ గురువారం మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రవణ్ సఫిల్‌గూడ చెరువులో దూకి ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. చెరువులోకి దూకిన ఆయనను స్థానికులు, మున్సిపల్ సిబ్బంది బయటికి తీసుకొచ్చారు. కార్పొరేటర్ శ్రవణ్ చెప్పిన వివరాల ప్రకారం.. ‘సఫిల్‌గూడ చెరువును అభివృద్ధి చేయాలంటూ తాను గత కొన్ని నెలలుగా అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాను. హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ, జలమండలి అధికారులు స్వయంగా వచ్చి చెరువును పరిశీలించారు. దీంతో చెరువు అభివృద్ధికి దాదాపు రూ.2 కోట్లు మంజూరయ్యాయి. పనుల్లో తీవ్ర జాప్యం ఏర్పడుతోంది. ఈ క్రమంలో మల్కాజిగిరి సర్కిల్ ఇంజినీరింగ్ విభాగం అధికారుల తీరు అధ్వానంగా మారింది. నాలుగేళ్లుగా ఈఈ ఇక్కడే తిష్ట వేశారు. పలు ఆరోపణలు ఉన్న డీఈ మహేష్‌ను బదిలీ చేయాలని అడిగినా పట్టించుకోవడంలేదు. అధికారుల మధ్య సమన్వయం లేదని, తన చావుతోనైనా సమస్య పరిష్కారమవుతుందని.. ఆత్మహత్యా యత్నం చేశాను’ అని శ్రవణ్ పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే అభివృద్ధి పనుల్ని అడ్డుకోవడం తగదని హితవు పలికారు. పనులను ఎమ్మెల్యే అడ్డుకున్నా విధి నిర్వహణ చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు.


