బీజేపీ కార్పొరేటర్ల బైఠాయింపు పోలీసులతో తరలింపు
సాక్షి, సిటీబ్యూరో: కేవలం అధికార పార్టీ, స్టాండింగ్ కమిటీ సభ్యులకే కాకుండా జీహెచ్‌ఎంసీలోని అన్ని డివిజన్ల కార్పొరేటర్లకు నిధులు కేటాయించాలి. కేంద్ర ప్రభుత్వం విపత్తు నిర్వహణ కింద విడుదల చేసిన రూ.113 కోట్లతో 38 చెరువులు పునరుద్ధరించాల్సి ఉన్నా.. పనులెందుకు చేయడం లేదని ప్రశ్నిస్తూ బీజేపీ కార్పొరేటర్లు స్టాండింగ్‌కమిటీ సమావేశానికి ముందు సమావేశ హాల్ ఎదుట బైఠాయించారు. సంవత్సరాలుగా పేరుకుపోయిన పలు సమస్యలపై కార్పొరేటర్లు ఇచ్చిన వినతిపత్రాలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తమ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని వారు పట్టబట్టడంతో, భారీ సంఖ్యలో అక్కడకు చేరుకున్న పోలీసులు వారిని చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కనీసం తమ ప్రశ్నలకు సమాధానాలిస్తే తాము వెళ్లిపోతామని చెప్పినా మేయర్ వినిపించుకోలేదని, దాదాపు వందమంది పోలీసులతో కాంగ్రెస్ పార్టీ పాశవికంగా దాడి చేయించిందని మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రవణ్ ఆరోపించారు. కార్యక్రమంలో సరూర్ నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి, మూసాపేట్ కార్పొరేటర్ మహేందర్, గోషా మహల్ కార్పొరేటర్ లాల్ సింగ్ బీజేపీ సీనియర్ నాయకులు గౌలికర్ ఆనంద్, ప్రభు గుప్తా, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.


