అభిమాన సంద్రం
స్వాగత హోర్డింగ్‌లు.. ప్లకార్డుల ప్రదర్శన
బంజారాహిల్స్ రోడ్ నెం. 12లోని లోటస్‌పాండ్‌లోని తన నివాసానికి వచ్చేముందు జగన్‌కు అభిమానుల నుంచి అపూర్వ స్వాగతం లభించింది. ప్రధాన చౌరస్తాల్లో స్వాగత హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారు. వేలాదిగా వచ్చిన జనంతో జగన్ నివాసిత ప్రాంతం కిక్కిరిసిపోయింది. సీఎం జగన్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సుమారు గంటన్నర పాటు ఆయన లోటస్‌పాండ్‌లో ఉండగా అభిమానులు, కార్యకర్తలు కూడా అంతసేపు అక్కడే ఉండిపోయారు. ఇంటి నుంచి జగన్ తిరిగి ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లే క్రమంలో కూడా బంజారాహిల్స్ నుంచి జూబ్లీహిల్స్ వరకు వేలాదిగా కార్యకర్తలు బారులుతీరారు. అభిమానులకు ఆయన అభివాదం చేస్తూ ముందుకు సాగారు. సనత్‌నగర్/నాంపల్లి/బంజారాహిల్స్
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి తెలంగాణ గడ్డపై అపూర్వ స్వాగతం లభించింది. ఆయనను కనులారా చూసేందుకు గురువారం వేలాదిగా తరలివచ్చిన వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, అభిమానులతో బేగంపేట్ ఎయిర్‌పోర్ట్‌తో పాటు నాంపల్లిలోని సీబీఐ కోర్టు పరిసరాలు, బంజారాహిల్స్ రోడ్ నెం.12లోని రహదారులు కిక్కిరిసిపోయాయి. జై జగన్.. జైజై జగన్.. సీఎం..సీఎం.. అనే నినాదాలు, ప్లకార్డుల ప్రదర్శనతో దద్దరిల్లాయి.
జగన్‌మోహన్‌రెడ్డిని చూసేందుకు పోలీసుల తాళ్ల కంచెను సైతం దాటుకుంటూ వెళ్లిపోయారు. భారీగా తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానులను అదుపు చేయడం పోలీసులకు కష్టసాధ్యంగా మారింది. ఈ క్రమంలో పోలీసులకు, అభిమానులకు మధ్య తోపులాటలు చోటుచేసుకున్నాయి. దీంతో పోలీసులు తమ లాఠీలతో కార్యకర్తలను, అభిమానులను అడ్డుకునే ప్రయత్నాలు చేసినా అభిమానం ముందు నిలబడలేదు. దీంతో అశేషంగా తరలివచ్చిన జనం తోసుకుంటూ రావడంతో పోలీసులు సైతం చేతులెత్తేశారు. మరోవైపు పెద్ద సంఖ్యలో అభిమానులు బైక్ ర్యాలీలతో ఎయిర్‌పోర్ట్‌కు తరలివచ్చారు. జై జగన్ నినాదాలు చేయడంతో బేగంపేట్ రహదారులు హోరెత్తాయి.
ఉదయం నుంచే అభిమానుల ఎదురుచూపులు..
సీబీఐ కోర్టుకు హాజరైన వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని చూసేందుకు అభిమానులు, నేతలు భారీగా తరలివచ్చారు. నాంపల్లి కోర్టుకు జగన్ వస్తున్నారన్న విషయాన్ని తెలుసుకున్న అభిమానులు, కార్యకర్తలు, నేతలు ఉదయాన్నే నాంపల్లికి చేరుకున్నారు. అభిమాన నాయకుడు రాకకోసం నాంపల్లి రోడ్లపై ఎదురు చూశారు. జగన్ నాంపల్లి సీబీఐ కోర్టుకు వస్తున్నారన్న కారణంగా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. ట్రాఫిక్‌ను మళ్లించారు. అడుగడుగునా బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో పోలీసులు అడుగడుగునా అత్యుత్సాహం ప్రదర్శించారు. నాంపల్లి కోర్టుకు అరకిలో మీటరు దూరంలో చుట్టూ బారికేడ్లను, ముళ్ల కంచెను ఉంచారు. కోర్టుకు వచ్చే దారులన్నింటిని మూసివేశారు. సమీపంలోని వ్యాపార సముదాయాలను సైతం బలవంతంగా మూసివేయించారు.
ఉదయం బారికేడ్లను తెరుచుకుని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కాన్వాయ్ కోర్టు ఆవరణలోకి ప్రవేశించింది. భారీగా మోహరించిన అభిమానులకు కాన్వాయ్‌లోంచి జగన్ అభివాదం చేశారు. అనంతరం తెలంగాణ ఉద్యానవన శాఖ కార్యాలయం పక్కన ఉన్న గేటు వైపు నుంచి రెడ్‌హిల్స్, లక్డీకాపూల్ మీదుగా జగన్ కాన్వాయ్ తిరిగి వెళ్లింది.
బేగంపేట్ విమానాశ్రయానికి తరలివచ్చిన ప్రజావాహిని
బైక్ ర్యాలీలతో హోరెత్తిన రహదారులు
అదనపు పోలీసు బలగాలతో భారీ బందోబస్తు
నాంపల్లి సీబీఐ కోర్టు వద్ద పెల్లుబికిన ప్రజాభిమానం
లోటస్‌పాండ్‌లోని నివాసం వద్దా అదే ఉత్సాహం
అడుగడుగునా పోలీసుల అత్యుత్సాహం
లాఠీచార్జ్‌తో అభిమానులను భయపెట్టే యత్నం
అభిమాన సంద్రం


