సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియో, రామానాయుడు స్టూడియోలకు జీహెచ్‌ఎంసీ అధికారులు నోటీసులు పంపించారు. పూర్తి స్థాయిలో ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లించాలి అంటూ అధికారులు నోటీసులు జారీ చేశారు.
వివరాల ప్రకారం.. నగరంలోని అన్నపూర్ణ, రామానాయుడు స్టూడియోలు ట్రేడ్ లైసెన్స్ ఫీజు తక్కువ చెల్లిస్తున్నట్టు జీహెచ్‌ఎంసీ సర్కిల్ 18 అధికారులు గుర్తించారు. వ్యాపార విస్తీర్ణం తక్కువ చూపిస్తూ భారీగా పన్నుల ఎగవేసినట్టు వెల్లడైంది. దీనికి సంబంధించి అన్నపూర్ణ స్టూడియో 11.52 లక్షలు ఫీజు చెల్లించాల్సి ఉండగా కేవలం రూ. 49వేలు మాత్రమే చెల్లిస్తోంది. అలాగే, రామానాయుడు స్డూడియో 1.92 లక్షలు చెల్లించాల్సి ఉండగా.. కేవలం 1900 మాత్రమే చెల్లిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లించాలి అంటూ నోటీసులు జారీ చేశారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు తరువాత సినీ పరిశ్రమను ప్రోత్సహించే లక్ష్యంతో ప్రభుత్వం అన్నపూర్ణ స్టూడియోకు 1976లో భూమి కేటాయించిన విషయం తెలిసిందే. బంజారాహిల్స్ ప్రాంతంలో సుమారు 22 ఎకరాల భూమిని కేటాయించారు. తరువాతి కాలంలో పద్మాలయ స్టూడియోకు, 1989లో రామానాయుడు స్టూడియోకు 7.5 ఎకరాలూ కేటాయిస్తూ ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి.


