మహా జలమండలికి గ్రీన్ సిగ్నల్
● ప్రస్తుత పరిధి 1450.2 చదరపు కిలోమీటర్లు
● మరో 603 చదరపు మీటర్లలో విస్తరణ
● తాగునీరు, డ్రైనేజీ నెట్‌వర్క్ కోసం ప్రణాళిక
● త్వరలో డీపీఆర్ రూపకల్పనకు టెండర్లు
ఓఆర్‌ఆర్ వెలుపల పైపులైన్ నెట్‌వర్క్ విస్తరణ
సాక్షి, సిటీబ్యూరో: ‘తెలంగాంణ కోర్ అర్బన్ రీజియన్’ ఏర్పాటు కసరత్తులో భాగంగా తాగునీటి, సీవరేజీ నెట్‌వర్క్ విస్తరణ ప్రణాళిక రూపకల్పన కోసం ప్రభుత్వం నుంచి జలమండలికి గ్రీన్ సిగ్నల్ లభించింది. ఇప్పటి వరకు అవుటర్ రింగ్‌రోడ్డు (ఓఆర్‌ఆర్) లోపలి ప్రాంతాల వరకు మాత్రమే విస్తరించి ఉన్న నెట్‌వర్క్‌ను.. ఓఆర్‌ఆర్ వెలుపల కూడా విస్తరించేందుకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) రూపకల్పన కోసం జలమండలి కసరత్తు చేస్తోంది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమావేశంలో నలు దిక్కులా విస్తరిస్తున్న నగర భవిష్యత్ అవసరాలను దృష్టి పెట్టుకొని పెరగనున్న జనాభా అనుగుణంగా సీవరేజీ, వాటర్ వ్యవస్థను విస్తరించేందుకు నివేదిక రూపకల్పన కోసం అధికారులను ఆదేశించారు. తక్షణమే జలమండలి ప్రాథమిక నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి ప్రతిపాదించగా.. మూడు నెలల్లోగా సమగ్ర ప్రాజెక్టు నివేదిక రూపొందించి సమర్పించాలని ఆదేశించింది. దీంతో డీపీఆర్ రూపకల్పన కోసం టెండర్ పిలిచేందుకు జలమండలి చర్యలకు ఉప్రకమించింది.
నెట్‌వర్క్ విస్తరణ ఇలా...
జలమండలి తాగునీటి, డ్రైనేజీ వ్యవస్థ ప్రస్తుతం సుమారు 1450.2 చదరపు కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది. దీనిని 2053.2 చదరపు కిలోమీటర్ల వరకు విస్తరించే విధంగా జలమండలి కసరత్తు చేస్తోంది. నగర శివారలోని మున్సిపాలిటీలోని కొన్ని ప్రాంతాలు ఓఆర్‌ఆర్ లోపల ఉండగా, మరికొన్ని ప్రాంతాలు వెలుపల ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో అవతల ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు, 18 మున్సిపాలిటీలు, 24 గ్రామ పంచాయితీల పరిధిలోని 190 గ్రామాలకు తాగునీటి పైప్‌లైన్ వ్యవస్థ విస్తరించి ఉంది. ఓఆర్‌ఆర్ లోపల ప్రాంతాలకు మాత్రమే తాగునీటి, డ్రైనేజీ వ్యవస్థ విస్తరించి ఉండగా.. తాజాగా ప్రభుత్వ ఆదేశాలతో వెలుపల ప్రాంతాలను సైతం పరిధిలోకి రానున్నాయి. మహా విస్తరణలో భాగంగా వాటర్, సీవరేజ్ పైపులైన్లతో పాటు ఎస్టీపీల నిర్మాణాల కోసం సమగ్ర ప్రాజెక్టు నివేదిక రూపకల్పన కోసం జలమండలి చర్యలు చేపట్టింది.
ప్రస్తుతం పరిధి..
ప్రస్తుతం ఓఆర్‌ఆర్ పరిధిలోని బోడుప్పల్, పీర్జాదిగూడ, జవహర్ నగర్, మీర్‌పేట్, బడంగ్‌పేట్, నిజాంపేట్, బండ్లగూడ కార్పొరేషన్లు, పోచారం, దమ్మాయిగూడ, నాగారం, తుమ్ముకుంట, గుండ్లపోచంపల్లి, జల్‌పల్లి, తుక్కుగూడ, తుర్కయంజల్, పెద్దంబర్‌పేట్, ఆదిబట్ల, అమ్మీన్‌పూర్, తెల్లాపూర్, బొల్లారం, దుండిగల్, కొంపల్లి, మణికొండ, నార్సింగ్, శంషాబాద్ మున్సిపాలిటీలు, చౌదరిగూడ, కోరెముల, వెంకటాపూర్, కంచవాణిసింగారం, ప్రతాపసింగారం, గోధుమకుంట, తిమ్మాయిపల్లి, నర్సంపల్లి, చేర్యాల్, కరీంగూడ, జాఫర్‌గూడ , ఆర్‌సిపురం పటాన్‌చెరువు, ఐలాపూర్, ఐలాపూర్, ఐలాపుర్ తండా, గండిగూడెం,సుల్తాన్‌పూర్, కిష్టారెడ్డిపేట్, పటేల్‌గూడ, శంషాబాద్, బహదుర్‌గూడ, చిన్నగోల్కొండ, హమీదుల్లానగర్, రషీద్‌గూడ కుత్బుల్లాపూర్, గౌరెల్లి గ్రామపంచాయతీలు జలమండలి పరిధిలో ఉన్నాయి.
కోర్ సిటీ 169.3
చుట్టుపక్కల 518.9
ఓఆర్‌ఆర్ లోపల 762
ఓఆర్‌ఆర్ వెలుపల 603
(ప్రతిపాదనలో)
ఓఆర్‌ఆర్‌కు అటూ ఇటూ
ఓఆర్‌ఆర్ పరిధిలోని కొన్ని మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు ఓఆర్‌ఆర్ లోపల, వెలుపల ఉన్నాయి. శంషాబాద్, నార్సింగి, తుక్కుగూడ, పెద్దఅంబర్‌పేట, మేడ్చల్, దమ్మాయిగూడ, నాగారం, పోచారం, ఘట్‌కేసర్, గుండ్లపోచంపల్లి, తూంకుంట, తెల్లాపూర్, అమీన్‌పూర్ మున్సిపాలిటీల పరిధి ఓఆర్‌ఆర్ అటూ ఇటూ విస్తరించి ఉంది. మహా విస్తరణతో ఓఆర్‌ఆర్ వెలుపల ఉన్న ప్రాంతాలు కూడా జలమండలి పరిధిలోకి రానున్నాయి.
మహా జలమండలికి గ్రీన్ సిగ్నల్


