నీళ్ల ‘మంటలు’  | PowerPoint presentation to MLAs on Krishna projects and water | Sakshi
Sakshi News home page

నీళ్ల ‘మంటలు’ 

Feb 12 2024 4:14 AM | Updated on Feb 12 2024 4:29 PM

PowerPoint presentation to MLAs on Krishna projects and water - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  రాష్ట్రంలో అధికార, విపక్షాల మధ్య నీళ్ల మంటలు మొదలయ్యాయి. కొన్నిరోజులుగా రాష్ట్ర రాజకీయాల్లో కృష్ణాజలాలు, కాళేశ్వరం, ఇతర ప్రాజెక్టుల అంశంపై తీవ్ర చర్చ జరుగుతుండగా.. సోమ, మంగళవారాల్లో జరగనున్న పరిణామాలు మరింత వేడిని పెంచుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, పలు ప్రాజెక్టుల నిర్మాణంపై నిర్లక్ష్యమంటూ బీఆర్‌ఎస్‌ను, ఆ పార్టీ ముఖ్యులను కాంగ్రెస్‌ సర్కారు టార్గెట్‌ చేసింది.

మరోవైపు కాంగ్రెస్‌ సర్కారు వచ్చిన రెండు నెలల్లోనే రాష్ట్ర ప్రాజెక్టులను కేంద్రానికి, కృష్ణాబోర్డుకు అప్పజెప్పి, ప్రజలకు తీవ్ర నష్టం కలిగిస్తోందంటూ బీఆర్‌ఎస్‌ మండిపడుతోంది. ఈ అంశాలపై అసెంబ్లీలో, బయటా ఇరుపార్టీల నేతలు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. మొత్తమ్మీద లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో రాజకీయంగా పైచేయి సాధించేందుకు ఇరు పార్టీలు సై అంటే సై అంటున్నాయి. 

నేడు అసెంబ్లీలో చర్చ? 
ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌పై చర్చించేందుకు అసెంబ్లీ సోమవారం సమావేశం కానుంది. ఈ క్రమంలోనే సాగునీటి ప్రాజెక్టులపై శ్వేతపత్రాన్ని ప్రవేశపెట్టాలని కాంగ్రెస్‌ సర్కారు నిర్ణయించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, కృష్ణా ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించే దిశగా జరిగిన పరిణామాలు, గత పదేళ్లలో సాగునీటి వైఫల్యాలపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చర్చను ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్‌ వర్గాలు చెప్తున్నాయి. 

ప్రజా భవన్‌లో ‘ప్రజెంటేషన్‌’ 
మరోవైపు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సాగునీటి ప్రాజెక్టులు, జలాల అంశంపై ఆదివారం ప్రజాభవన్‌లో అవగాహన కల్పించారు. సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతోపాటు మంత్రులు ఉత్తమ్, శ్రీధర్‌బాబు, తుమ్మల నాగేశ్వరరావు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్‌»ొజ్జా, ఇతర అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

మంత్రి ఉత్తమ్‌ పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా.. కృష్ణా, గోదావరి బేసిన్లలో నీటి లభ్యత, తెలంగాణ వినియోగం, చేపట్టిన ప్రాజెక్టులు, వాటి పురోగతిని వివరించారు. గత పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో అవినీతి, నిర్లక్ష్యం జరిగిందని వివరించారు. ఈ సమావేశం తర్వాత ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్, బీర్ల అయిలయ్య, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్‌ మీడియాతో మాట్లాడారు.

కృష్ణాజలాలపై సోమవారం అసెంబ్లీలో స్పష్టత ఇస్తామని, నల్లగొండలో బీఆర్‌ఎస్‌ సభ మొదలయ్యే లోపే తెలంగాణ ప్రజలకు వాస్తవాలను వివరిస్తామని చెప్పారు. కేసీఆర్‌ చేసిన అన్యాయంతో దక్షిణ తెలంగాణ ఎడారిగా మారే ప్రమాదం నెలకొందని ఆరోపించారు. 

మేడిగడ్డ సందర్శనకు తీసుకెళ్తామంటూ.. 
బీఆర్‌ఎస్‌ నల్లగొండ సభకు కౌంటర్‌గా కాంగ్రెస్‌ సర్కారు ఎమ్మెల్యేల మేడిగడ్డ సందర్శన కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించింది. కాళేశ్వరం అవినీతిపై చర్చను పక్కదోవ పట్టించేందుకే బీఆర్‌ఎస్‌ కృష్ణా ప్రాజెక్టుల అంశాన్ని లేవనెత్తుతోందని ఆరోపిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి.. కాళేశ్వరం అవినీతి అంశంపై క్షేత్రస్థాయిలో చర్చజరిగేలా చూడాలని ఇప్పటికే కాంగ్రెస్‌ శ్రేణులకు పిలుపునిచ్చారు.

ఈ క్రమంలోనే మేడిగడ్డ పర్యటన ఏర్పాటుచేసి.. బ్యారేజీ సందర్శనకు రావాల్సిందిగా అసెంబ్లీలోని అన్ని రాజకీయ పార్టీలను ఆహా్వనించారు. మంగళవారం (13న) ఉదయం అసెంబ్లీ నుంచే ప్రత్యేక బస్సుల్లో ఎమ్మెల్యేలను మేడిగడ్డకు తీసుకెళతామని చెప్పారు. ఈ సందర్శనకు వచ్చే విషయంలో కాంగ్రెస్, సీపీఐ మినహా ఇతర పార్టీలు బీఆర్‌ఎస్, బీజేపీ, ఎంఐఎం తమ నిర్ణయాన్ని వెల్లడించలేదు.
 
తప్పు కప్పిపుచ్చుకునే డ్రామాలు 
తెలంగాణకు అన్యాయం చేసిన మాజీ సీఎం కేసీఆర్‌.. తన తప్పును కప్పిపుచ్చుకొనేందుకు సభలంటూ డ్రామాలు ఆడుతున్నారని టీపీసీసీ కిసాన్‌సెల్‌ మండిపడింది. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా కేసీఆర్‌ దిష్టిబొమ్మల దహనానికి పిలుపునిచ్చింది. 

నల్లగొండ బీఆర్‌ఎస్‌ సభకు చురుగ్గా ఏర్పాట్లు 
కృష్ణా ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించడాన్ని నిరసిస్తూ.. మంగళవారం నల్లగొండ పట్టణ శివార్లలోని మర్రిగూడ బైపాస్‌రోడ్డు వద్ద సభ నిర్వహించాలని బీఆర్‌ఎస్‌ నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనికి చురుగ్గా ఏర్పాట్లు సాగుతున్నాయి.

బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఈ సభకు హాజరవుతుండటంతో పెద్ద ఎత్తున జన సమీకరణ కోసం గులాబీదళం ప్రయత్నిస్తోంది. నల్లగొండతోపాటు మహబూబ్‌నగర్, ఖమ్మం, గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధి నుంచి జనాన్ని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత కేసీఆర్‌ తొలిసారి సభలో ప్రసంగించనుండటంతో.. ఆయన ఏం మాట్లాడతారన్నది ఆసక్తిగా మారింది. 

కేసీఆర్‌ క్షమాపణలు చెప్పాకే నల్లగొండకు రావాలి 
గత పదేళ్లలో జిల్లాలోని ప్రాజెక్టులేవీ పూర్తిచేయలేదు: కోమటిరెడ్డి బ్రదర్స్‌ 
నల్లగొండ/ చండూరు: కేసీఆర్‌ పదేళ్ల పాలనలో నల్లగొండ జిల్లాలోని ప్రాజెక్టులను పూర్తి చేయకుండా మోసం చేశారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆయన సోదరుడు, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మండిపడ్డారు. మొదట కేసీఆర్‌ నల్లగొండ జిల్లా ప్రజలకు క్షమాపణలు చెప్పాకే నల్లగొండకు రావాలని వ్యాఖ్యానించారు. నల్లగొండలోకి క్యాంపు కార్యాలయంలో వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడా రు.

కుర్చీ వేసుకుని కూర్చుని ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టును పూర్తి చేస్తానని కేసీఆర్‌ మాట ఇచ్చి తప్పారని.. అది పూర్తయి ఉంటే నల్లగొండ జిల్లాకు ఇలాంటి కరు వు పరిస్థితులు వచ్చేవి కావని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ సభ నిర్వహించే రో జే నల్లగొండ పట్టణంలోని గడి యారం సెంటర్‌లో కుర్చీ వేసి, దానిమీద గులాబీ కండువా కప్పి, కేసీఆర్‌ చిత్రం పెట్టి నిరసన తెలుపుతామన్నారు. 

బీఆర్‌ఎస్‌ సభను బహిష్కరించండి: రాజగోపాల్‌రెడ్డి 
ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికే కేసీఆర్‌ నల్లగొండలో సభ పెడుతున్నారని.. ఆ సభను పార్టీలకు అతీతంగా బహిష్కరించాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పిలుపునిచ్చారు. నల్లగొండ జిల్లా చండూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్‌కు నైతిక విలువలేమైనా ఉంటే రాజకీయాల నుంచి తప్పుకోవాలన్నారు. కాగా.. కాంగ్రెస్‌ ముఖ్యుల పిలుపు మేరకు బీఆర్‌ఎస్‌ సభకు నిరసనగా జిల్లా కాంగ్రెస్‌ శ్రేణులు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement