ఉత్తమ సేవలకు పోలీస్‌ పతకాలు | Police medals for best services | Sakshi
Sakshi News home page

ఉత్తమ సేవలకు పోలీస్‌ పతకాలు

Jun 2 2025 12:20 AM | Updated on Jun 2 2025 12:20 AM

Police medals for best services

రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రకటించిన ప్రభుత్వం

పోలీసు శాఖకు మొత్తం 625, ఏసీబీకి 22, అగ్నిమాపక శాఖకు 20, టీజీఎస్పీఎఫ్‌కు 19 అవార్డులు 

సాక్షి, హైదరాబాద్‌: అత్యుత్తమ సేవలందిస్తున్న పోలీస్, అగ్ని మాపక శాఖ సిబ్బందికి ప్రభుత్వం రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా పోలీసు సేవా పతకాలు ప్రకటించింది. పోలీసు శాఖలోని వివిధ విభాగాల్లో కలిపి 625 మందికి, ఏసీబీలో 22 మందికి, అగ్నిమాపక శాఖలో 20 మందికి, టీజీఎస్పీఎఫ్‌లో 19 మందికి, విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌లో ఆరుగురికి పతకాలు అందించనుంది. 

పతక విజేతల పేర్లు, ఆయా విభాగాలవారీగా ఇస్తున్న పతకాల వివరాలతో హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. మహోన్నత సేవా పతకం సాధించిన వారికి రూ. 40 వేల నగదు పురస్కారం, ఉత్తమ సేవా పతకం పొందిన వారికి రూ. 30 వేల నగదు పురస్కారం, కఠిన సేవా పతకం సాధించిన వారికి రూ. 20 వేల నగదు పురస్కారం, తెలంగాణ సేవా పతకం పొందిన వారికి రూ. 20 వేల నగదు పురస్కారం, తెలంగాణ శౌర్య పతకం పొందిన వారికి రూ. 10 వేల నగదు పురస్కారంతోపాటు ప్రతినెలా రూ. 500 అందించనున్నారు. 

రాష్ట్రస్థాయిలో ప్రతిష్టాత్మక పోలీస్‌ పతకం అయిన తెలంగాణ పోలీస్‌ శౌర్య పతకం 9 మంది గ్రేహౌండ్స్‌ సిబ్బంది (ఆర్‌ఎస్సైలు సి.హెచ్‌. మహేశ్, జి. శోభన్, ఎ. రాకేశ్‌కుమార్, కానిస్టేబుళ్లు జి. వెంకటేశ్, కె. రమేశ్, ఎం. పాపియా నాయక్, ఎం. రవీందర్‌ సంజయ్, జె. నరేశ్, టి. వెంకటేశ్‌)కి లభించింది. అలాగే అగ్నిమాపక శాఖలోని హైదరాబాద్‌ డిస్ట్రిక్ట్‌ ఫైర్‌ ఆఫీసర్‌ టి. వెంకన్న, సాలార్జంగ్‌ మ్యూజియం ఫైర్‌ స్టేషన్‌ లీడింగ్‌ ఫైర్‌మన్‌ మిరాజ్‌ కరమతుల్లా బేగ్‌కు శౌర్య పతకాలు లభించాయి. ఫైర్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ డిస్ట్రిక్ట్‌ ఫైర్‌ ఆఫీసర్‌ టి. మహేందర్‌రెడ్డికి మహోన్నత సేవా పతకం లభించింది. అలాగే ఉత్తమ సేవా పతకానికి ముగ్గురు, సేవా పతకానికి 14 మంది ఎంపికయ్యారు.  

Advertisement
 
Advertisement
Advertisement