
రూ.400 కోట్లతో త్వరలో పనులు ప్రారంభం
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వెల్లడి
పునర్నిర్మించిన బేగంపేట రైల్వేస్టేషన్‌ను వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోదీ
సనత్‌నగర్ (హైదరాబాద్): యాదగిరిగుట్టకు ఎంఎంటీఎస్ మంజూరైందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలి పారు. రూ.400 కోట్లతో త్వరలో పనులు ప్రారంభించనున్నామని చెప్పారు. ప్రపంచంలో ఏ దేశంలో లేనివిధంగా భారత్‌లో ఏకకాలంలో 1,300 రైల్వేస్టేషన్లు అభివృద్ధి చేస్తున్నామన్నారు. అమృత్ భారత్ పథకం కింద పునర్నిర్మించిన బేగంపేట రైల్వేస్టేషన్‌లో అంతా మహిళా ఉద్యోగులే సేవలందించనుండడం గర్వకారణమని పేర్కొన్నారు. రూ.26 కోట్లతో పునర్ అభివృద్ధి చేసిన బేగంపేట రైల్వేస్టేషన్‌ను గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా స్టేషన్ ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో కిషన్‌రెడ్డి మాట్లాడారు.
రాష్ట్రంలో 40 రైల్వేస్టేషన్ల అభివృద్ధి
రాజమాత అహల్యా బాయి 300వ జయంతి రోజున మహి ళా ఉద్యోగులకు అంకితం చేస్తున్న బేగంపేట రైల్వేస్టేషన్‌ను ప్రారంభించడం గర్వకారణమని కేంద్రమంత్రి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా రైల్వే వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. తెలంగాణలో ఒకే సమయంలో 40 రైల్వేస్టేషన్ల అభివృద్ధి జరుగుతోందని చెప్పారు. 2026 నాటికి ఈ స్టేషన్లను స్థానిక సంస్కృతి, వారసత్వాన్ని ప్రతింబింబించేలా తీర్చిదిద్ది ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను రూ.720 కోట్లతో, నాంపల్లి (హైదరాబాద్) రైల్వేస్టేషన్‌ను రూ.350 కోట్లతో అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు.
దసరా నాటికి కొమురవెల్లి స్టేషన్ రెడీ
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి వెళ్లే భక్తులకు రైలు సౌకర్యం కలి్పంచాలని ప్రధానిని కోరానని, ఆయన వెంటనే రైల్వేస్టేషన్‌ను మంజూరు చేశారని కిషన్‌రెడ్డి తెలిపారు. ఈ ఏడాది దసరా నాటికి పనులు పూర్తి చేసుకుని కొమురవెల్లి మలన్న భక్తులకు ఈ స్టేషన్‌ను అంకితం చేస్తామని చెప్పారు.
మాజీ మంత్రి నిజాలు గ్రహించాలి..
కేంద్రం అభివృద్ధి పనులను తక్కువ చేస్తూ ట్విట్టర్‌లో విమర్శలు చేసే మాజీ మంత్రి నిజాలను గ్రహించాలని కేటీఆర్‌ను ఉద్దేశించి కిషన్‌రెడ్డి పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. కాజీపేటలో రూ.580 కోట్లతో రైల్వే మాన్యుఫాక్చరింగ్ యూనిట్ నిర్మాణానికి మోదీ భూమి పూజ చేశారని గుర్తు చేశారు. అవసరమైతే జరిగిన అభివృద్ధిపై సదరు మాజీ మంత్రికి లేఖ పంపుతానని అన్నారు.
యాదగిరిగుట్ట ప్రాజెక్టు వెంటనే చేపట్టాలి: మంత్రి కోమటిరెడ్డి
యాదగిరిగుట్ట ఎంఎంటీఎస్ ప్రాజెక్టు వెంటనే చేపట్టాలని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కోరారు. ఘట్‌కేసర్ నుంచి యాదరిగిగుట్టకు రోజుకు 50 వేల నుంచి లక్ష మంది వరకు వెళ్తుంటారని, వారి ప్రయాణ సౌలభ్యం కోసం ఎంఎంటీఎస్‌ను అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. రైల్వే ప్రాజెక్టులకు అవసరమైన స్థల సేకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్ యాదవ్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య తదితరులు పాల్గొన్నారు.