తెలుగు రాష్ట్రాల వందేభారత్‌: నేటి నుంచి బుకింగ్స్‌.. ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చేది మాత్రం అప్పుడే!

PM Modi likely To Flag Off Vande Bharat Train Secunderabad To Vizag - Sakshi

సికింద్రాబాద్‌ నుంచి వైజాగ్‌కు 8.30 గంటల్లోనే వందేభారత్‌

ఇప్పటి వరకు మిగతా సూపర్‌ఫాస్ట్‌ రైళ్లు తీసుకుంటున్న సగటు సమయం 12 గంటలు

వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి స్టేషన్లలోనే హాల్ట్‌

సంక్రాంతి రోజు ఉదయం 10 గంటలకు ప్రారంభించనున్న ప్రధాని 

సాక్షి, హైదరాబాద్‌: క్షణాల్లో వేగం అందుకుంటుంది. గంటకు 90–100 కి.మీ. వేగంతో పట్టాలపై పరుగులు తీస్తుంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ అత్యాధునిక వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రేపటి నుంచి తెలుగు రాష్ట్రాలకు అందుబాటులోకి రానుంది. దేశంలో ఇప్పటి వరకున్న అన్ని రైళ్ల కంటే అత్యధిక వేగంతో పరుగులు తీసే ఈ రైలు ఎలాంటి కుదుపులు లేని, సౌకర్యవంతమైన విమాన ప్రయాణ అనుభూతిని కలిగిస్తుంది.

ఈ రైలు సికింద్రాబాద్‌ నుంచి విశాఖపట్నానికి కేవలం ఎనిమిదిన్నర గంటల్లో చేరుకుంటుంది. సికింద్రాబాద్‌ నుంచి 697 కి.మీ. (రైలు మార్గం) దూరంలో ఉన్న విశాఖకు చేరుకునేందుకు ప్రస్తుతం మిగతా సూపర్‌ఫాస్ట్‌ రైళ్లలో సగటున 12 గంటలు పడుతోంది. కానీ వందేభారత్‌ వాటి కంటే మూడున్నర గంటల నుంచి నాలుగు గంటల ముందే చేరుకునేలా పరుగుపెట్టనుంది.

సంక్రాంతి శుభవేళ ఆదివారం ఉదయం 10 గంటలకు సికింద్రాబాద్‌ స్టేషన్‌ నుంచి తొలి పరుగు ప్రారంభించనుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఈ రైలుకు పచ్చజెండా ఊపి ప్రారంభించనుండగా, సికింద్రా­బాద్‌ స్టేషన్‌లో రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి జెండా ఊపనున్నారు. 

నాలుగే స్టేషన్లు..
ఈ రైలు సికింద్రాబాద్‌లో బయలుదేరి విశాఖ చేరుకునేలోపు కేవలం నాలుగు స్టేషన్లలో మాత్రమే ఆగుతుంది. సోమవారం నుంచి రెగ్యులర్‌ ప్రయాణాన్ని ప్రారంభించనున్న వందేభారత్‌ రైలు, సికింద్రాబాద్‌ స్టేషన్‌లో మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరుతుంది. ఆ తర్వాత వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి స్టేషన్లలోనే ఆగనుంది. గమ్యస్థాన­మైన విశాఖకు రాత్రి 11.30కు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు విశాఖలో ఉదయం 5.45 గంటలకు బయలుదేరుతుంది. అవే నాలుగు స్టేషన్‌లలో నిర్దేశిత సమయాల్లో ఆగుతూ మధ్యాహ్నం 2.15 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది.

గుర్తుకొచ్చేది వేగమే... 
వందేభారత్‌ అనగానే ముందుగా గుర్తుకొచ్చేది దాని వేగమే. గంటకు 160 కి.మీ. వేగంతో ప్రయాణించే సామర్థ్యం దీని సొంతం. అయితే, దాని వేగం అధికంగానే ఉన్నా, అంత వేగాన్ని తట్టుకునే ట్రాక్‌ సామర్థ్యం మనకు లేదు. ఈ మార్గంలో రైళ్ల గరిష్టవేగ పరిమితి 130 కి.మీ. మాత్రమే ఉంది. కానీ గరిష్ట పరిమితితో కాకుండా వందేభారత్‌ రైలు సగటున 90–100 కి.మీ. వేగంతోనే పరుగుపెట్టనుంది. ప్రస్తుతం ఇతర సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ల సగటు గరిష్ట వేగం గంటకు 60 కి.మీ. మాత్రమే ఉంది.

21 స్టేషన్లలో హాల్ట్‌, కానీ..
జనవరి 15న వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ నుంచి బయలుదేరాక తొలిరోజున మాత్రమే 21 స్టేషన్లలో ఆగుతుంది. మార్గమధ్యంలో చర్లపల్లి, భువనగిరి, జనగాం, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, మధిర, కొండపల్లి, విజయవాడ జంక్షన్, నూజివీడు, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, ద్వారపూడి, సామర్లకోట, తుని, అనకాపల్లి, దువ్వాడ స్టేషన్లలో ఆగుతూ విశాఖ చేరుకుంటుంది. ఆ తర్వాత అంటే రెండోరోజు నుంచి వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి స్టేషన్లలో మాత్రమే ఈ రైలు ఆగుతుంది. 

నేటి నుంచి బుకింగ్స్‌
ఈ రైల్లో 16 కోచ్‌లుంటాయి. ఇందులో రెండు కోచ్‌లు ఎగ్జిక్యూటివ్‌ కేటగిరీవి కాగా, మిగతావి ఎకానమీ కోచ్‌లు. ఎగ్జిక్యూటివ్‌ కోచ్‌లో 104 సీట్లుంటాయి. ఎకానమీ క్లాస్‌లో 1,024 ఉంటాయి. మొత్తం సీట్లు 1,128. టికెట్లు శనివారం నుంచి ఇటు ఆన్‌లైన్‌లో, అటు కౌంటర్లలో అందుబాటులో ఉంటాయి. ధరపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే చెన్నై-మైసూర్‌, మైసూర్‌-చెన్నై మార్గంలో వందే భారత్‌ రైలు టికెట్‌ ధర రూ.1,200కు(AC చైర్ కార్ కోసం),  ఎగ్జిక్యూటివ్‌ చైర్‌ కార్‌ కోసం రూ.2,200కి తక్కువగా లేదు. దూరంను బట్టి విశాఖ-సికింద్రాబాద్‌ వందేభారత్‌ టికెట్‌ ధర ఎంతనేది నిర్ధారించనున్నారు.

జత లేని రైలు కేటగిరీ ఇదే..
సాధారణంగా ఒక రైలు సర్వీసు నడవాలంటే రెండు రైళ్లుంటాయి. ఒక రోజుకు మించి ప్రయాణ సమయం పట్టే సర్వీసుల్లో మూడు రైళ్లుంటాయి. కానీ ఇలా జత రైళ్లు లేని సర్వీసు ఇదే కావటం విశేషం. ఉదయం 5.45కు విశాఖ నుంచి బయలుదేరే రైలు మధ్యాహ్నం 2.15 గంటలకు సికింద్రాబాద్‌కు చేరుకుని, కేవలం 45 నిమిషాల వ్యవధిలో తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు విశాఖపట్నానికి బయలుదేరుతుంది.

దీనికి ముందు, వెనక రెండు అంతర్గత (ఇన్‌బిల్ట్‌) ఇంజిన్లుంటాయి. ఒకవైపు ఒక ఇంజిన్‌తో, రెండోవైపు మరో ఇంజిన్‌తో నడుస్తాయి. ఆదివారం సెలవు: ఈ రైలు వారంలో ఆరు రోజులే నడుస్తుంది. జత లేకుండా ఒకే రైలు రోజూ పరుగుపెడుతున్నందున, దాని నిర్వహణ పనుల కోసం ఒకరోజు కేటాయించారు. ఆదివారం రోజు రైలును నిర్వహణ పనుల కోసం షెడ్డుకు తరలిస్తారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top