రేవంతన్నా కామారెడ్డి వైపు సూడన్నా! | People request Development to kamareddy | Sakshi
Sakshi News home page

రేవంతన్నా కామారెడ్డి వైపు సూడన్నా!

May 29 2025 1:14 PM | Updated on May 29 2025 1:14 PM

People request Development to kamareddy

కామారెడ్డి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే  54,916 ఓట్లు వేశాం

ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ మంజూరు చేయండి

22వ ప్యాకేజీపై రివ్యూ చేయాలి

నియోజకవర్గ అభివృద్ధికి  ప్రత్యేక నిధులివ్వాలి 

నియోజకవర్గ ప్రజల డిమాండ్‌

ముఖ్యమంత్రులుగా గెలుపొందిన వారు తమ నియోజకవర్గాలకు కాస్త ఎక్కువగా నిధులు కేటాయించుకోవడం పరిపాటే. ప్రస్తుత సీఎం రేవంత్‌ రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్, కామారెడ్డి నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు. కొడంగల్‌లో గెలిచి కామారెడ్డిలో స్వల్ప తేడాతో ఓడిపోయారు. అప్పటి సీఎం కేసీఆర్‌ను ఓడించి తీరుతా అన్న రేవంత్‌ రెడ్డి శపథం మాత్రం నెరవేరింది. కామారెడ్డిలో ప్రభావిత ఓట్లు ఇచ్చిన ఇక్కడి ప్రజల రుణం తీర్చుకోవాలని స్థానికులు కోరుతున్నారు. కొడంగల్‌ మాదిరిగా కామారెడ్డిని సొంత నియోజకవర్గంగా భావించి నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని అభ్యర్థిస్తున్నారు.

సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : ‘కామారెడ్డి ప్రజల ఆశీర్వాదంతో కేసీఆర్‌ను ఓడించి తీరుత. కేసీఆర్‌ను ఓడించేందుకే ఇక్కడ పోటీ చేస్తున్న’ అని ఎన్నికల ప్రచార సభల్లో ప్రకటించిన ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి తన లక్ష్యాన్ని సాధించారు. తాను గెలవలేకపోయినా, కేసీఆర్‌ను ఓడించడంలో సక్సెస్‌ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి నుంచి పోటీ చేసిన రేవంత్‌రెడ్డికి 54,916 ఓట్లు వచ్చాయి. 

కొడంగల్‌ నుంచి వచ్చిన రేవంత్‌రెడ్డిని ఇక్కడి ఓటర్లు ఆదరించిన నేపథ్యంలో సీఎం హోదాలో కామారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాల్సిన బాధ్యత ఆయనపై ఉందని ఇక్కడి ప్రజలు అంటున్నారు. ఎమ్మెల్యేగా పోటీ చేసిన సమయంలో నియోజకవర్గంలో ఐదారు పర్యాయాలు పర్యటించిన రేవంత్‌రెడ్డికి నియోజకవర్గంలో ప్రధాన సమస్యలపై అవగాహన ఉందని, అలాగే ఇక్కడి వివిధ వర్గాల ప్రముఖులతో పరిచయాలు కూడా ఏర్పడ్డాయని పేర్కొంటున్నారు. 

తన సొంత నియోజకవర్గం కొడంగల్‌కు నిధులిచ్చినట్టే కామారెడ్డిపై కరుణ చూపాలని కోరుతున్నారు. నియోజకవర్గ అభివృద్ధిపై అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో సమీక్ష జరిపి అభివృద్ధికి బాటలు వేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్లను నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఏర్పాటు చేస్తోంది. జిల్లాలోని మిగతా మూడు నియోజకవర్గాలకు వచ్చినా, కామారెడ్డికి మాత్రం ఇప్పటికీ మంజూరు కాలేదు. దీంతో ఇక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇరుకు రోడ్లతో ఇబ్బందులు.. 
జిల్లాకేంద్రంలో ప్రధాన రోడ్లన్నీ ఇరుకుగా మారిపోయాయి. పెరిగిన జనాభాకు అనుగుణంగా రోడ్ల విస్తరణ జరగలేదు. మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం కూడా రోడ్లు లేకపోవడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలో రోడ్లను విస్తరించడం ద్వారా ప్రజల ఇబ్బందులు తొలగించాల్సిన అవస రం ఉంది. పట్టణాన్ని రెండుగా విభజించే రైల్వే లైనుపై వంతెనలు లేక ఇబ్బందులు నెలకొన్నాయి. ఉన్న ఒక్క వంతెన ఇరుకుగా మారింది. అశోక్‌నగర్‌లో రైల్వే గేటు మాటిమాటికీ వేయడం వల్ల ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.

జిల్లాకు మూడు సమీకృత గురుకులాలు
విద్యారంగంలో సమూల మార్పులు తీసుకురావడానికి యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక స్కూల్‌ చొప్పున మంజూరు చేస్తోంది. తొలి విడతలో జుక్కల్‌కు మంజూరవగా.. మద్నూర్‌లో భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. తాజాగా బాన్సువాడ, ఎల్లారెడ్డిలకు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బాన్సువాడకు మంజూరైన పాఠశాలను పొతంగల్‌లో ఏర్పాటు చేయనున్నట్టు స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. అలాగే ఎల్లారెడ్డికి స్కూల్‌ మంజూరైనట్టు ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావ్‌ తెలిపారు. రూ.200 కోట్లు విడుదలయ్యాయని, టెండర్లు మిగిలాయని పేర్కొన్నారు. కానీ కామారెడ్డికి గతంలో మోడల్‌ స్కూల్, ఇప్పుడు ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ మంజూరు చేయకుండా హ్యాండిచ్చారని స్థానిక నేతలు, విద్యార్థులు వాపోతున్నారు.

సాగునీరే పెద్ద సమస్య.. 
కామారెడ్డి నియోజక వర్గంలో ఎలాంటి ప్రాజెక్టులు లేకపోవడంతో రైతాంగం భూగర్భజలాలపైనే ఆధారపడి సేద్యం చేస్తుంటారు. దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రాణహిత–చేవెళ్ల పథకానికి సంబంధించి 22వ ప్యాకేజీ పనుల కోసం కామారెడ్డిలో శంకుస్థాపన చేశారు. ఆయన మరణంతో పనులు ఆగిపోయాయి. 22వ ప్యాకేజీ పనులకు సంబంధించి భూసేకరణకు ఇటీవల కేవలం రూ.23 కోట్లు మంజూరయ్యాయి. అవి ఏమాత్రం సరిపోవు. దాదాపు మూడు వేల ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. భూసేకరణకు మరో రూ.200 కోట్లు అవసరమవుతాయి. అలాగే ప్రాజెక్టు పనులు చేపట్టి పూర్తి చేయాలంటే రూ.2 వేల కోట్లు అవసరమవుతాయని అధికారులు అంటున్నారు. 22వ ప్యాకేజీ పనులపై సీఎం రివ్యూ చేసి అవసరమైన నిధులు కేటాయిస్తేగానీ పనులు ముందుకు కదిలే పరిస్థితి లేదు.

విద్యారంగంలో వెనకడుగే.. 
నాలుగైదు జిల్లాలకు కూడలిగా ఉన్న కామారెడ్డి పట్టణంలో ఐదు దశాబ్దాల కిందటే డిగ్రీ కాలేజీ ఏర్పాటైంది. రాష్ట్రంలో ఎక్కడాలేని బీటె క్‌ డెయిరీ, బీఎస్సీ ఫిషరీ బీఎస్సీ ఫారెస్ట్రీ వంటి కోర్సులు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ చదివిన విద్యార్థులు దేశ, విదేశాల్లో ఉన్నత స్థానా ల్లో ఉన్నారు. అయితే మారిన పరిస్థితులకు అ నుగుణంగా ఉన్నత విద్య అవకాశాలు మెరుగపడలేదు. ము ఖ్యంగా డెయిరీ కోర్సుకు సంబంధించి పీజీ కో ర్సులు రాష్ట్రంలో కూడా ఎక్క డా లేవు. ఇక్కడ ఎంటెక్‌ డెయిరీ కోర్సులు ప్రా రంభించడానికి కావల్సిన సౌకర్యాలన్నీ ఉన్నా యి. పీజీ కోర్సులు తీసుకురావలసిన అవసరముంది. గత ప్రభుత్వం మెడికల్‌ కాలేజీ మంజూరు చేసింది. ఇక్కడ ఇంజనీరింగ్, పాలిటెక్నిక్‌ కాలేజీలతో పాటు మహిళా డిగ్రీ కాలేజీ, నర్సింగ్‌ కాలేజీ, ఫుడ్‌ టెక్నాలజీ వంటి కాలేజీలు ఏర్పాటు చేయాల్సిన అవసరముంది. భిక్కనూరు సౌత్‌ క్యాంపస్‌లో మరిన్ని కోర్సు లు ప్రవేశపెట్టి అభివృద్ధి చేయాల్సి ఉంది.  

ఆదరించిన ప్రజలకు మేలు చేయాలి 
అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్‌ నుంచి వచ్చి పోటీ చేస్తే ఇక్కడి ప్రజలు ఎంతో ఆదరించారు. తక్కువ సమయంలో కూడా మంచి ఓట్లు వచ్చాయి. నియోజకవర్గ ప్రజలకు మేలు చేయాల్సిన బాధ్యత సీఎంపై ఉంది. ఇక్కడి డిగ్రీ కాలేజీకి వందల ఎకరాల స్థలం ఉంది. యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి. ఈ నియోజకవర్గం నాలుగైదు జిల్లాలకు కూడలి.  
– క్యాతం సిద్దరాములు, న్యాయవాది, కామారెడ్డి

యూనివర్సిటీ కావాలి 
కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి కావలసినంత భూమి ఉంది. అన్ని సౌకర్యాలున్నాయి. ఇక్కడ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి. అప్పటి సీఎం కేసీఆర్‌ ఎడ్యుకేషన్‌ హబ్‌ చేస్తాననన్నారు. పాలిటెక్నిక్, ఇంజనీరింగ్, లా, ఉమెన్స్‌ డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేయాలి. సీఎం రేవంత్‌రెడ్డి కామారెడ్డి గురించి ఆలోచించాలి. నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇవ్వాలి.  
–ఎల్‌ఎన్‌ ఆజాద్, బీడీఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement