
కొట్టి చంపిన భార్యాభర్తలు
మేడ్చల్‌రూరల్: భార్యాభర్తలు ఓ వ్యక్తిని కొట్టి చంపిన సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నిజామాబాద్ చెందిన ఎదునూరి నరసింహ అలియాస్ చిన్న, తన భార్య అనితతో కలిసి మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని చెక్‌పోస్ట్‌లో ఉంటూ రోడ్డు పక్కన కాగితాలు, ప్లాస్టిక్ వస్తువులను సేకరించి, అమ్ముకుని జీవనం సాగిస్తున్నారు.
మెదక్ జిల్లా, తిమ్మాపూర్ గ్రామానికి చెందిన నర్సింలు (37) శనివారం మధ్యాహ్నం మేడ్చల్ చెక్‌పోస్ట్‌లోని వెంటకరమణ లిక్కర్ ల్యాండ్ వద్ద మద్యం తాగుతుండగా చిన్న, అతడి భార్య అనితతో స్క్రాప్ విషయమై గొడవ జరిగింది. దీంతో వారిద్దరూ కలిసి నర్సింహులును కర్రలతో కొట్టడంతో తీవ్రంగా గాయపడిన అతను అక్కడికక్కడే మృతి చెందాడు.
రాత్రి దీనిని గుర్తించిన వైన్ షాప్ నిర్వాహుకుడు మహేష్ మేడ్చల్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.