
మద్యం మత్తులో హోటల్ నిర్వాహకులపై దాడి
పోలీసుల అదుపులో ఆరుగురు యువకులు
వికారాబాద్: నూడుల్స్‌లో నూనె తక్కువగా వేశారంటూ హోటల్ నిర్వాహకులపై దాడికి పాల్పడిన ఘటన నాగారంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన భార్యాభర్తలు నీరటి భారతమ్మ, అంజి స్థానికంగా హోటల్ నడుపుతున్నారు. యాలాల మండలం రాస్నం గ్రామానికి చెందిన పది మంది యువకులు బుధవారం సాయంత్రం ఫుల్‌గా మద్యం తాగి కారులో హోటల్ వద్దకు వచ్చారు.
తినేందుకు నూడుల్స్ ఆర్డర్ చేశారు. ఈక్రమంలో నూనె తక్కువగా వేశారంటూ గొడవపడి భార్యాభర్తలపై మారణాయుధాలతో దాడి చేశారు. అడ్డు వచ్చిన అమర్‌నాథ్‌రెడ్డితో పాటు మరో ఇద్దరిపైనా దాడికి దిగారు. ఈ విషయమై గ్రామస్తులు ఫోన్ చేయడంతో ఎస్‌ఐ రాఘవేందర్, సిబ్బందితో కలిసి అక్కడకు చేరుకున్నారు. పారిపోతున్న వారిలో ఆరుగురిని అదుపులోకి తీసుకోగా మరో నలుగురు తప్పించుకున్నారు. క్షతగాత్రులను వికారాబాద్ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.