చేవెళ్ల: మీర్జాగూడ ప్రమాద ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న బాధితులు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఈనెల 3న ఆర్టీసీ బస్సు, కంకర టిప్పర్ ఢీకొన్న ప్రమాదంలో 19 మంది దుర్మరణం చెందగా 27 మందికిపైగా గాయపడిన విషయం తెలిసిందే. క్షతగాత్రుల్లో కొందరిని హుటాహుటిన వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రి, చేవెళ్లలోని పీఎంఆర్ ఆస్పత్రికి మరికొందరిని ఉస్మానియా, నిమ్స్, ప్రైవేటు ఆస్పత్రులకు తరలించారు. ప్రమాదం జరిగిన తర్వాత రెండు మూడు రోజులు నాయకులు, అధికారులు పరామర్శల పేరుతో హడావుడి చేశారు. మృతుల కుటుంబాలతోపాటు గాయపడ్డవారికి అండగా ఉంటామని భరోసా కల్పించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మృతుల కుటుంబాలకు రూ.9లక్షలు ప్రకటించాయి. క్షతగాత్రులకు రూ.2.5 లక్షల పరిహారం అందిస్తామని చెప్పాయి. 15 రోజులు కావస్తున్నా పట్టించుకునేవారు కరువయ్యారు.
వెంటాడుతున్న ఆర్థికభారం..
ప్రమాదంలో గాయపడిన వారిలో ఎక్కువ మందిని ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే చేర్పించి వైద్యం చేయించారు. కొందరు ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకొని బిల్లులు చెల్లించారు. క్షతగాత్రుల్లో చాలా వరకు రోజు కూలీ చేసుకునే నిరుపేదలు, ప్రైవేటు పనులు చేసుకునే చిరుద్యోగులే ఉన్నారు. ఇంటికి పెద్దదిక్కయిన వారు గాయాలతో ఆస్పత్రుల్లో చేరడంతో వారి కుటుంబాలను ఆర్థిక భారం వెంటాడుతోంది. ప్రభుత్వం ప్రకటించిన పరిహారంలో పైసా కూడా ఇప్పటివరకు ఎవరికీ అందలేదు. చేస్తామన్న సాయం చేస్తే కుటుంబాలకు ఆసరా అవుతుందని బాధితులు వాపోతున్నారు. గాయపడిన వారి వివరాలు ఉన్నతాధికారులకు నివేదించినట్లు స్థానిక రెవెన్యూ, వైద్యాధికారులు చెబుతున్నారు.
కుటుంబం ఆగమైంది
బస్సు ప్రమాదంలో గాయపడి ఉస్మానియా ఆస్పత్రిలో 11 రోజులు చికిత్స పొంది శుక్రవారం డిశ్చార్జి అయ్యాను. రోజు కూలీ చేసుకొని జీవించే నా చేయి విరిగింది. ఆపరేషన్ చేసి 36 కుట్లు వేశారు. ఇప్పట్లో పనిచేసే పరిస్థితి లేదు. నా భార్య కాలికి గాయంతో ఇంట్లోనే ఉండడంతో పిల్లల పోషణ, కుటుంబ జీవనం భారంగా మారింది. ప్రభుత్వం ఆదుకోవాలి.
– సయ్యద్ అబ్దుల్లా, అత్తాపూర్
ఎలా ఉందని అడిగేవారే లేరు
ఆస్పత్రిలో ఉన్న రోజుల్లో నాయకులు వచ్చి పరామర్శించారు. డిశ్చార్జి అయి ఇళ్లకు వచ్చిన తర్వాత మళ్లీ ఎలా ఉందని అడిగిన వారే లేరు. రోజుకూలీగా పనిచేస్తాను. ప్రమాదంలో మోకాలికి బలమైన గాయం కావడంతో నడవలేకపోతున్నాను. వైద్యం చేయించి వివరాలు తీసుకుని పంపించారు. పరిహారం విషయం ఎవరూ ఏమీ చెప్పడం లేదు.
– నర్సింహులు, అంతారం
పైసా కూడా రాలేదు
బస్సు ప్రమాదంలో ముఖానికి బలమైన గాయం కావడంతో నగరంలోని సిటిజన్ ఆస్పత్రిలో ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాను. రూ.3 లక్షలకు వరకు ఖర్చయింది. ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటూ జీవిస్తున్నాను. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాను. ప్రభుత్వం ఇస్తామని చెప్పిన పరిహారం పైసా కూడా రాలేదు. అధికారులు వివరాలు అడిగి తీసుకున్నారు.
– రవి, వికారాబాద్


