వికారాబాదు జిల్లా: బేటీకో సాసురాల్ కనే చోడ్కే షామ్ తక్ ఆవూంగా అంటూ ఇంట్లో నుంచి చెప్పి వెళ్లన నా భర్త ఇలా సాయంత్రం వరకు శవమై వస్తాడని అనుకోలేదని.. ఇప్పుడు నా గతి... నా పిల్లల గతి ఏంకాను అని మృతుడు షేక్ ఖాలీద్ భార్య రెహానాబేగం కన్నీరుమున్నీరైంది. మీర్జాగూడా వద్ద జరిగిన ప్రమాదంలో ఇందిరమ్మ కాలనీలో నివసిస్తున్న షేక్ ఖాలీద్‌తో పాటు కూతురు సాలేహ, మనుమరాలు రెండు నెలల ఫాతిమా సంఘటనా స్థలంలోనే మృతి చెందిన విషయం తెలిసిందే.
వీరి మృతితో మంగళవారం కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడి భార్య రెహానాను ‘సాక్షి’ పలకరించింది. ఆమె మాటల్లోనే.. ‘20 ఏళ్లుగా తాండూరు పట్టణంలోని ఇందిరానగర్ కాలనీలో ఇల్లు అద్దెకు తీసుకొని ఉన్నాం. కొన్నాళ్ల క్రితం ఇందిరమ్మ కాలనీలో ఇంటిని అద్దెకు తీసుకొని పిల్లలతో కలిసి ఉంటున్నాం. భర్త వెల్డర్‌గా పని చేస్తాడు. నేను బీడీలు చుట్టి కుటుంబాన్ని పోషించుకుంటున్నాం. మాకు నలుగురు సంతానం. పెద్ద కూతురు సాలేహా బేగంను పదో తరగతి వరకు చదివించి గతేడాది సెప్టెంబర్ 26న పెళ్లి చేశాం.
ఇద్దరు కవలలు సమీర్, జమీర్ ప్రస్తుతం నంబర్ 2 ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నారు. మరో కూతురు సాదియా బేగం తొమ్మిదో తరగతి చదువుతోంది. కూతురు సాలేహాకు ప్రసవం తర్వాత హైదరాబాద్ నుంచి తాండూరుకు తీసుకొచ్చాం. మనవరాలికి 40 రోజుల తర్వాత చేసే కార్యక్రమానికి పంపించాలని అత్తింటి వాళ్లు ఫోన్ చేయడంతో సోమవారం బస్సు ఎక్కారు. బిడ్డను విడిచి సాయంత్రం వరకు వస్తా అన్న మనిషి ఇలా ప్రాణం లేకుండా వస్తాడని అనుకోలేదు’ అంటూ కన్నీటిపర్యంతమైంది.


