తాండూరు రూరల్: దేవుడి దయతో బతికిపోయాం అని చేవెళ్ల బస్సు ప్రమాద ఘటనలో ప్రాణాలతో బయటపడిన తల్లి పుష్పలత, కూతురు క్రిస్టినా పేర్కొన్నారు. పెద్దేముల్ మండలం కందనెల్లి గ్రామానికి చెందిన పుష్పలత కొన్నేళ్లుగా కుటుంబ సభ్యులతో కలిసి తాండూరులో నివాసం ఉంటోంది. పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో టీచర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. పుష్పలతకు ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స కోసం కూతురు క్రిస్టినాతో కలిసి సోమవారం ఆర్టీసీ బస్సులో బయలుదేరింది. అఖరి సీట్లు ఇద్దరూ కూర్చున్నారు.
ఒక్కసారిగా భారీ శబ్దంతో బస్సు అదుపుతప్పింది. నేను కిందపడ్డాను. కంకర పొగ వల్ల నా కూతురు కనిపించలేదు. నడుములోతు కంకర ఉంది. మమ్మీ, మమ్మీ అంటూ క్రిస్టినా ఏడుపు వినిపించింది. వెంటనే కూతురి కాళ్ల కింద ఉన్న కంకరను తొలగించా. ఆ తర్వాత ఎడమవైపు కిటికీలోంచి బ్యాగులు బయటకు విసిరేసి దూకేశాం. లిఫ్ట్ అడిగి వికారాబాద్‌కు వచ్చాం. అక్కడి నుంచి ఆటోలో తాండూరుకు చేరుకున్నాం. నా భర్త పదేళ్ల నుంచి పక్షవాతంతో మంచానికే పరిమితమయ్యాడు. ప్రస్తుతం నా ఫ్యామిలీకి నేను ముఖ్యం. నేను బతకాలి. భగవంతుడే నన్ను, నా కూతుర్ని కాపాడాడు. క్రిస్టినాకు మూగ దెబ్బలు తగలడంతో పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నానని తల్లి పుష్పలత తెలిపారు.


