కరెంట్‌ పోతే ఐఏఎస్‌ల సస్పెన్షన్‌ | No tolerance for power supply interruptions says Revanth Reddy | Sakshi
Sakshi News home page

కరెంట్‌ పోతే ఐఏఎస్‌ల సస్పెన్షన్‌

Oct 15 2026 1:44 AM | Updated on Oct 15 2026 1:44 AM

 No tolerance for power supply interruptions says Revanth Reddy

అధికారులతో సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం 

పంటలకు వచ్చే 20 రోజులు అత్యంత కీలకం 

విద్యుత్‌ సరఫరాలో అంతరాయాలను సహించేది లేదు 

వచ్చే జూన్‌ వరకు పకడ్బందీ యాక్షన్‌ ప్లాన్‌  

తాగునీరు, పశుగ్రాసానికి కొరత రావద్దు 

ప్రతి మండలానికి గ్రూప్‌–1, 2 అధికారులతో ప్రత్యేక పర్యవేక్షణ..

సాక్షి, హైదరాబాద్‌: వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతుల పంటలు ఎండిపోకుండా రేయింబవళ్లు విద్యుత్‌ సరఫరా చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. పంటలు చేతికొచ్చే వరకు విద్యుత్‌ కోతలు లేకుండా చూడాలని స్పష్టం చేశారు. వచ్చే 20 రోజులు పంటలకు అత్యంత కీలకమని, ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యుత్‌ కొరత కారణంగా రైతులు పంట నష్టపోకూడదని హెచ్చరించారు. వ్యవసాయానికి విద్యుత్‌ అవసరం ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి అందుకు అను గుణంగా సరఫరా పెంచాలని సూచించారు. వర్షాభావ పరిస్థి తులు, ఎల్‌నినో ప్రభావం, విద్యుత్, తాగునీటి సరఫరాపై బుధ వారం రేవంత్‌ ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీలో ఉన్నతాధికారులతో సమీక్షించారు. 

జిల్లాల వారీగా పరిస్థితులను అధికారులు సీఎంకు వివరించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో విద్యుత్‌ అంతరాయాలపై ముఖ్యమంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్‌ సరఫరా సాఫీగా జరిగేలా చూడాలని పలుమార్లు ఆదేశించినా పరిస్థితిలో మార్పు ఎందుకు రావడం లేదని నిలదీశారు. రాబోయే రోజుల్లో విద్యుత్‌ కొరత ఏర్పడే ప్రమాదం ఉన్నప్పటికీ ఉత్పత్తిని పెంచేందుకు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. నైనీ, మహానది నుంచి బొగ్గు సరఫరాకు లింకేజీ ఏర్పాట్లు చేసినా యాదాద్రి విద్యుత్‌ ప్లాంట్‌లో పూర్తి సామర్థ్యం మేరకు ఉత్పత్తి ఎందుకు జరగడం లేదని ఆరా తీశారు.

‘ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సింది నేను. రైతుల పంటలను కాపాడేందుకు అవసరమైన విద్యుత్‌ సరఫరా చేయాలని ఎన్నిసార్లు చెప్పినా పరిస్థితి మారలేదు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే చర్యలను సహించేది లేదు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదు’ అని ముఖ్యమంత్రి తీవ్రంగా హెచ్చరించారు. అవసరమైతే ఇంధన శాఖ స్పెషల్‌ సీఎస్‌ (నవీన్‌ మిట్టల్‌), జెన్‌కో సీఎండీ (ఎస్‌.హరీష్‌)తోపాటు విద్యుత్‌ సంస్థల సీఎండీలుగా వ్యవహరిస్తున్న ఐఏఎస్‌లను సస్పెండ్‌ చేస్తానన్నారు. విద్యుత్‌ అంతరాయాలకు రోజుకో కారణం చెప్పవద్దని హెచ్చరించారు.

కోవిడ్‌ లాంటి విపత్తు
ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను కోవిడ్‌ తరహా విపత్తుగా పరిగణించి అన్ని ప్రభుత్వ శాఖలు అప్రమత్తంగా వ్యవహరించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ‘ఈ పరిస్థితి ఎప్పటివరకు ఉంటుందో ఎవరికీ తెలియదు. ఇప్పుడు సమస్యగా కనిపిస్తోంది. అప్రమత్తం కాకపోతే సంక్షోభంగా మారుతుంది. అన్ని శాఖల అధికారులు తమ పరిధిలో ఎల్‌నినో ప్రభావాన్ని లోతుగా అంచనా వేయాలి. పరిష్కార మార్గాలను గుర్తించి చర్యలు చేపట్టాలి’ అని స్పష్టం చేశారు. వచ్చే జూన్‌ వరకు ప్రతి శాఖ పకడ్బందీ యాక్షన్‌ ప్లాన్‌ రూపొందించాలని ఆదేశించారు. రాబోయే సంక్షోభాన్ని ముందుగానే అంచనా వేసి అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

గ్రామసభలు, కళాజాతలతో ప్రజల్లో అవగాహన..
ఎల్‌నినో ఒక విపత్తని, దీని ప్రభావం, రాబోయే సంక్షోభ పరిస్థితులపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని సీఎం రేవంత్‌ సూచించారు. దసరా తర్వాత దీపావళి వరకు రాష్ట్రవ్యాప్తంగా గ్రామసభలు నిర్వహించేలా చర్యలు తీసుకోవా­లని ఆదేశించారు. కళాజాతల ద్వారా ప్రజలకు ఎల్‌నినో ప్రభావాన్ని వివరించాలని.. నీరు, విద్యుత్‌ పొదుపుతోపాటు రాబోయే పరిస్థితులను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలన్నారు. ఎల్‌నినో ప్రభావం, రాష్ట్రంలో పరిస్థితులపై రేవంత్‌ గురువారం సాయంత్రం సచివాలయంలో మంత్రులతో సమావేశమై చర్చించనున్నారు.  

తాగునీరు, పశుగ్రాసానికి ఇబ్బందులు రావద్దు..
ప్రజలకు తాగునీటి సమస్య తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్‌ ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా తాగునీటి సరఫరా సజావుగా సాగేందుకు ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో నిర్మాణ రంగంతోపాటు ఇతర అవసరాలకు మురుగునీటి శుద్ధి కేంద్రాల్లో (ఎస్టీపీలు) శుద్ధి చేసిన నీటిని వినియోగించేలా చర్యలు చేపట్టాలన్నారు. 

ఎల్‌నినో ప్రభావంతో పశువులు ఇబ్బంది పడకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని, పశుగ్రాసం కొరత రాకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎల్‌నినో ప్రభావాన్ని క్షేత్రస్థాయిలో పర్యవేక్షించేందుకు ప్రతి మండలానికి గ్రూప్‌–1, 2 స్థాయి అధికారులను నియమించాలని ఆదేశించారు. సంబంధిత మండలాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌)కి నివేదించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement