
బన్సీలాల్‌పేట్: దేశ ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రధాని మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం గత 8 ఏళ్లుగా సమర్థంగా పనిచేస్తోందని కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి తెలిపారు. ఆదివారం సనత్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని ఐడీహెచ్ కాలనీలో ఆయన మీడియాతో మాట్లాడారు. అవినీతి, అక్రమాలు, కుంభకోణాలు, బంధుప్రీతి, అరాచకాలు, తీవ్రవాదం వంటి వాటికి తావులేకుండా తాము పాలన సాగిస్తున్నామని చెప్పారు.
గతంలో దేశంలో ఎక్కడో ఓ చోట బాంబు పేలుళ్లు ఉండేవని... కానీ తమ పాలనలో దేశ భద్రత పదిలంగా ఉందన్నారు. మోదీ సర్కారు అధికారం చేపట్టి 8 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో సోమవారం నుంచి జూన్ 14 వరకు దేశవ్యాప్తంగా ప్రచార, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జి.కిషన్‌రెడ్డి వివరించారు. కరోనా కష్టకాలంలో పేదలను ఆదుకోవడానికి వీలుగా దేశంలోని 80 కోట్ల మంది పేదలకు ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. రైతులకు ఏటా రూ. 6 వేల ఆర్థిక సాయం అందజేస్తున్నామని వివరించారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 3.50 కోట్ల ఇళ్లను పంపిణీ చేశామని చెప్పారు.