దిగుమతి చేసుకునే ఔషధాలకు కొత్త నిబంధనలు
సాక్షి, హైదరాబాద్: విదేశాల నుంచి భారత్‌కు దిగుమతి అయ్యే ఔషధాలపై నిబంధనల్లో కేంద్రం కీలక మార్పులు చేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న దిగుమతి నిబంధనలను సరళీకృతం చేస్తూ, దేశంలోకి వచ్చే సమయంలో కనీసం ఒక సంవత్సరం షెల్ఫ్ లైఫ్ (ఎక్స్‌పైరీ గడువు) మిగిలి ఉంటే దిగుమతికి అనుమతి ఇచ్చేలా కొత్త నిబంధనలను ప్రతిపాదించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈనెల 22న ముసాయిదా గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
ఇందులో డ్రగ్స్ రూల్స్–1945లోని రూల్ 31ను సవరించి, దిగుమతి అయ్యే ఔషధాలకు ప్రస్తుతం అమల్లో ఉన్న ’మొత్తం షెల్ఫ్ లైఫ్‌లో 60 శాతం మిగిలి ఉండాలి’ అనే నిబంధనను సవరించింది. దీని స్థానంలో దేశంలోకి దిగుమతి చేసే సమయంలో కనీసం 12 నెలల గడువు ఉంటే సరిపోతుందనే ప్రతిపాదనను తీసుకొచ్చింది. ప్రజలు, ఔషధ పరిశ్రమలు, వైద్య నిపుణుల నుంచి అభిప్రాయాలు స్వీకరించిన అనంతరం తుది నిబంధనలు అమల్లోకి రానున్నాయి.
భారత్‌కు దిగుమతి అయ్యే అనేక ప్రత్యేక ఔషధాలు, అరుదైన వ్యాధుల మందులు, బయోలాజికల్ ఉత్పత్తులు విదేశాల్లోనే తయారవుతాయి. ప్రస్తుతం వాటి దిగుమతిపై అమల్లో ఉన్న నిబంధనలు చాలా కఠినంగా ఉన్నాయని ఔషధ పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. తయారీ, రవాణా, కస్టమ్స్ క్లియరెన్స్, నిల్వ వంటి ప్రక్రియల్లో సమయం ఎక్కువ పట్టడంతో కొన్నిసార్లు ఔషధాల వినియోగ గడువు గణనీయంగా తగ్గిపోతుంది. దీంతో ఆస్పత్రులు, దిగుమతిదారులు నష్టపోవడంతోపాటు కొన్ని మందులు వృథా అవుతున్నాయి. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం మార్పులు ప్రతిపాదించింది.
రోగులకు ఎలా ఉపయోగం అంటే...
ఈ మార్పు అమల్లోకి వస్తే విదేశాల నుంచి వచ్చే ప్రాణాధార ఔషధాల సరఫరా మరింత సులభమవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అరుదైన వ్యాధుల చికిత్సకు అవసరమైన మందులు, కేన్సర్, జన్యుపరమైన వ్యాధులకు సంబంధించిన ఔషధాలు, అధునాతన బయోలాజికల్ ఔషధాలు, ఇమ్యూనోథెరపీ మందులు, ప్రత్యేక టీకాల సరఫరా వేగవంతం కావొచ్చు.
దీంతో రోగులకు ఔషధాల లభ్యత మెరుగుపడటంతోపాటు కొరత పరిస్థితులు తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు. సాధారణంగా ఔషధాల తయారీ నుంచి వినియోగదారుల చేతికి చేరే వరకు అనేక దశలు ఉంటాయి. ముఖ్యంగా దిగుమతి ఔషధాల విషయంలో సముద్ర, విమాన రవాణా, కస్టమ్స్ తనిఖీలు, నాణ్యత పరీక్షలు వంటి కారణాలతో సమయం ఎక్కువ పడుతుంది. ఫలితంగా ఎక్స్‌పైరీ గడువు తక్కువగా మిగిలిన మందులను మార్కెట్లోకి విడుదల చేయడం కష్టమవుతోంది.
కొత్త నిబంధనల వల్ల ఈ సమస్య కొంతవరకు పరిష్కారమై, ఔషధాల వృథా తగ్గుతుందని కేంద్రం అంచనా వేస్తోంది. ఔషధాల నాణ్యత, భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. కొత్త నిబంధనలతో దిగుమతిదారులపై భారం తగ్గడంతోపాటు రోగులకు అవసరమైన మందులు మరింత వేగంగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఔషధ రంగ నిపుణులు భావిస్తున్నారు.


