మృతురాలి కడుపులో కత్తెర! | New angle in the Gundala hospital incident | Sakshi
Sakshi News home page

మృతురాలి కడుపులో కత్తెర!

Jun 19 2026 4:04 AM | Updated on Jun 19 2026 4:04 AM

New angle in the Gundala hospital incident

అంత్యక్రియలు పూర్తయ్యాక బూడిదలో గుర్తింపు

గుండాల ఆస్పత్రి ఘటనలో కొత్త కోణం  

గుండాల: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవం కోసం వచ్చిన గర్భిణి సహా ఆమెకు పుట్టిన శిశువు మృతి చెందిన ఘటనలో కొత్త కోణం వెలుగుచూసింది. మండలంలోని శంభునిగూడెంకు చెందిన దాట్ల వనజను గత ఆదివారం ప్రసవం కోసం తీసుకురాగా, వైద్యుడు లేకపోవడంతో నర్సు సాధారణ ప్రసవం చేసింది. ఆతర్వాత ఆడశిశువుకు చలనం లేకపోవడంతో ఇల్లెందు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. ఇక వనజకు తీవ్ర రక్తస్రావం అవుతుండటంతో ఖమ్మం తరలించి చికిత్స చేయిస్తుండగా ఆమె కూడా మృతి చెందింది. 

ఈ మేరకు బంధువులు వనజ మృతదేహాన్ని సోమవారం సాయంత్రం దహనం చేశారు. గురువారం ఉదయం అక్కడకు కుటుంబ సభ్యులు, గ్రామస్తులు వెళ్లేసరికి బూడిదలో కత్తెర కనిపించింది. మృతురాలికి సాధారణ ప్రసవమే అయిందని, రక్తస్రావం మాత్రమే జరిగిందని వైద్యులు చెబుతుండగా కత్తెర ఎలా వచ్చిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రక్తస్రావాన్ని ఆపేందుకు కత్తెర సాయంతో దూది పెట్టారా.. లేక కడుపులో పొర(మాయ) తొలగించే క్రమాన కత్తెర మర్చిపోయారా అనే సందేహాలు నెలకొన్నాయి. ఈ క్రమాన వనజ మృతికి ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బందే కారణమని, పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని కుటుంబ సభ్యులు డిమాండ్‌ చేశారు. 

వైద్యాధికారిపై సస్పెన్షన్‌ వేటు 
తల్లి, పుట్టిన శిశువు మృతి ఘటనలో గుండాల వైద్యాధికారి సుదీప్‌ను సస్పెండ్‌ చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే, గర్భిణి దాట్ల వనజను తీసుకొచ్చిన సమయాన ఆయన తూరుబాక వైద్యశిబిరంలో ఉండటంతో నర్సు డెలివరీ చేసిందని ఇప్పటికే వెల్లడించారు. తల్లీబిడ్డ మృతిపై కుటుంబీకులు డీఎంహెచ్‌ఓకు ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టి నివేదిక ఆధారంగా సుదీప్‌ను సస్పెండ్‌ చేసినట్లు తెలుస్తోంది. 

అయితే, ఆస్పత్రిలో ఒకే వైద్యాధికారి ఉండడం, ఆయన ఆ సమయానికి శిబిరానికి వెళ్లినందున అందుబాటులో లేరంటూనే సస్పెండ్‌ చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, ఆయనను సస్పెండ్‌ చేసిన అధికారులు మరో వైద్యుడిని నియమించకపోవడంతో గుండాల ఆస్పత్రిలో వైద్య సేవలు ఎవరు అందిస్తారనే ప్రశ్నలు తలెత్తు్తతున్నాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement