మరో ఇద్దరు హెచ్‌ఎంలకు తీవ్ర గాయాలు
బడికి కారులో వెళ్తుండగా ప్రమాదం
అర్వపల్లి, నల్లగొండ: సంక్రాంతి సెలవులు ముగిసి శనివారం పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో ఉపాధ్యాయులు పాఠశాలలకు వెళ్తుండగా వారు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఇద్దరు టీచర్లు మృతిచెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ) ప్రత్యేక అధికారిణి మామిడాల కల్పన (43), తుంగతుర్తి మండలం రావులపల్లి జెడ్పీహెచ్‌ఎస్ ప్రధానోపాధ్యాయురాలు పోరెడ్డి గీత (48)తోపాటు తుంగతుర్తి జెడ్పీహెచ్‌ఎస్ ప్రధానోపాధ్యాయుడు అలువాల ప్రవీణ్‌కుమార్, తుంగతుర్తి మండలం అన్నారం జెడ్పీహెచ్‌ఎస్ ప్రధానోపాధ్యాయుడు అలువాల సునీతారాణి శనివారం ఉదయం గీతకు చెందిన కారులో నల్లగొండ నుంచి పాఠశాలలకు బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న కారు అర్వపల్లి శివారులోని ముదిరాజ్‌కాలనీ వద్దకు రాగానే అదుపుతప్పి.. రోడ్డు పక్కన ఇంటి నిర్మాణం కోసం పోసిన ఇసుక కుప్పపై నుంచి వెళ్లి పల్టీలు కొడుతూ పొలాల్లోకి దూసుకెళ్లింది. అదే సమయంలో కారు ముందుభాగం ఎడమవైపు టైరు పేలింది. కారు పల్టీ కొట్టడంతోనే కల్పన రోడ్డుపై పడి తీవ్రంగా గాయపడింది.
ఆ తర్వాత సునీతారాణి, గీత ఎగిరి కిందపడ్డారు. ప్రవీణ్‌కుమార్ కారులో ఇరుక్కుపోగా స్థానికులు బయటకు తీశారు. కారు డ్రైవర్ నదిపల్లి గిరి స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. వారిని సూర్యాపేట జనరల్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే కల్పన మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. గీతను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. సునీతారాణి, ప్రవీణ్‌కుమార్ పరిస్థితి విషమంగా ఉండగా హైదరాబాద్‌కు తరలించారు. వీరిద్దరు అన్నాచెల్లెళ్లు. ఈ ప్రమాదం కారు డ్రైవర్ అతివేగం, అజాగ్రత్త వల్లే జరిగిందని పోలీసులు కేసు నమోదు చేశారు.
నల్లగొండలోని లక్ష్మీనగర్ కాలనీలో నివాసముంటున్న గీత.. సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలం రావులపల్లి ప్రభుత్వ పాఠశాలలో గెజిటెడ్ హెచ్‌ఎంగా పనిచేస్తున్నారు. ఈమె కుమారుడు సాయినితన్‌రెడ్డి ఎంఎస్ కోసం అమెరికా వెళ్లాడు. కూతురు సౌమికకు పెళ్లి అయి భర్తతో కలిసి అమెరికాలో ఉంటోంది. వచ్చే నెలలో కుమారుడికి కాన్వొకేషన్ ఉంది. దీంతో గీత ఫిబ్రవరిలో పిల్లల వద్దకు వెళ్లేందుకు టికెట్లు బుక్ చేసుకున్నారు. కానీ, శనివారం పాఠశాలకు వెళ్తూ గీత రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు.
తల్లి మృతి విషయం తెలుసుకున్న కూతురు, కుమారుడు.. భారత్‌కు బయల్దేరారు. కాగా.. నల్లగొండలోని హనుమాన్‌నగర్‌లో నివాసం ఉండే లింగంపల్లి కల్పన తుంగతుర్తి కేజీబీవీలో ప్రత్యేకాధికారి(ఎస్‌ఓ)గా కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్నారు. సాయంత్రం త్వరగా వస్తానని చెప్పి.. రోజూ వచ్చే సమయం కంటే ముందుగానే శవమై వచ్చిందని ఆమె భర్త, పిల్లలు విలపించారు. గీత, కల్పన మృతదేహాలకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నివాళులర్పించి మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చారు.


