Malkajgiri: మిగిలేది మూడే! | Municipalities to disappear in Medchal Malkajgiri district | Sakshi
Sakshi News home page

మేడ్చల్‌ – మల్కాజ్‌గిరి జిల్లాలో కనుమరుగు కానున్న మున్సిపాలిటీలు 

Jun 5 2025 8:04 PM | Updated on Jun 5 2025 8:04 PM

Municipalities to disappear in Medchal Malkajgiri district

జీహెచ్‌ఎంసీ వైపు 4 కార్పొరేషన్లు, 9 మున్సిపాలిటీలు

7 మున్సిపాలిటీల్లో కనిపించని వార్డుల విభజన

మేడ్చల్‌: హైదరాబాద్‌ మహనగర విస్తరణలో భాగంగా మేడ్చల్‌ జిల్లాలో స్థానిక సంస్థలు కనుమరుగయ్యే స్థితిలో ఉన్నాయి. మేడ్చల్‌ జిల్లా దేశంలోనే విభిన్న జిల్లాగా ఉండేది. ప్రస్తుతం మారుతున్న సమీకరణాలతో జిల్లా స్వరూపం మొత్తంగా మారనుంది. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హైదరాబాద్‌ మహానగర విస్తరణ చేయాలనే ఆలోచనలు చేయడంతో హైదరాబాద్‌కు శివారులో ఉన్న మేడ్చల్‌–మల్కాజ్‌గిరిజిల్లా రూపురేఖలు మారుతున్నాయి.

3 మినహా.. అంతా జీహెచ్‌ఎంసీనే.. 
ప్రభుత్వం మేడ్చల్‌ నియోజకవర్గంలో ఉన్న మూడు నూతన మున్సిపాలిటీలను నూతనంగా ఏర్పాటు చేసి, 61 గ్రామాల్లో మిగిలిన గ్రామాలను సమీప మున్సిపాలిటీలలో విలీనం చేశాయి. తాజాగా ప్రభుత్వం నూతన మున్సిపాలిటీలలో వార్డుల విభజనపై దృష్టి పెట్టగా.. విలీన గ్రామాలపై ఎలాంటి విభజన చేయడం లేదు. మున్సిపాలిటీలలో గ్రామాలు ఇప్పటికే విలీనంకావడంతో వార్డు సంఖ్య మారాల్సి ఉండగా.. కేవలం మూడు చింతలపల్లి, ఎల్లంపేట, అలియాబాద్‌లలో మత్రమే వార్డుల విభజన చేస్తున్నారు. మిగతా 7 మున్సిపాలిటీలలో ఎలాంటి వార్డుల విభజన చేయడం లేదు. నూతన మున్సిపాలిటీల్లో మాత్రమే వార్డు కుదింపు చేస్తూ.. మిగతా మున్సిపాలిటీలలో చేయకపోవడంతో 3 మున్సిపాలిటీలు మినహా అన్ని జీహెచ్‌ఎంసీలో విలీనం అవుతున్నట్లు స్పష్టమౌతుంది.

గతంలో అన్ని పాలనలు.. 
మేడ్చల్‌ జిల్లా పదేళ్ల క్రితం ఏర్పడిన సమయంలో జిల్లాలో 61 గ్రామపంచాయతీలు, 5 మండల పరిషత్‌లు, జిల్లా పరిషత్, 4 మున్సిపల్‌ కార్పొరేషన్లు, 9

మున్సిపాలిటీలు ఉన్నాయి. ప్రస్తుత ప్రభుత్వం గ్రామాలను సమీప మున్సిపాలిటీల్లో విలీనం చేయడం, నూతనంగా 3 మున్సిపాటీలను ఏర్పాటు చేయడంతో గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్‌లు కనుమరుగయ్యాయి. దీంతో మేడ్చల్‌ అర్బన్‌ జిల్లాగా మారిపోయింది.  

12 మున్సిపాలిటీలు, 4 కార్పొరేషన్లు.. 
నియోజకవర్గంలో మేడ్చల్, తూంకుంట, ఘట్‌కేసర్, గుండ్లపోచంపల్లి, దమ్మాయిగూడ, నాగారం, పోచారం, ఎల్లంపేట్, మూడు చింతలపల్లి, అలియాబాద్‌ మున్సిపాలిటీలు జవహర్‌నగర్, బోడుప్పల్, పిర్జాదిగూడ, కార్పొరేషన్లు, కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలో దుండిగల్, కొంపల్లి మున్సిపాలిటీలు, నిజాంపేట్‌ కార్పొరేషన్లు ఉన్నాయి. మొత్తంగా జిల్లాలో 12 మున్సిపాలిటీలు 4 మున్సిపల్‌ కార్పొరేషన్లు ప్రస్తుతానికి ఉన్నాయి.

చ‌ద‌వండి: హైద‌రాబాద్‌ కోర్‌ సిటీలో ఇవి అత్యంత ఇబ్బందిక‌రం..

పట్టణాల స్థాయికి.. 
మేడ్చల్, తూంకుంట, ఘట్‌కేసర్, మున్సిపాలిటీలు మాత్రమే నగరానికి కొద్ది దూరంగా ఉండగా.. మిగతా మున్సిపాలిటీలు రాజధాని నగరంలో అంతర్భాగంగా ఉన్నాయి. పట్టణ వాతావరణంలోనే ఉన్నాయి. పోచారం, కొంపల్లి, దుండిగల్‌ గుండ్లపోచంపల్లి, నాగారం, దమ్మాయిగూడ పూర్తిగా పట్టణాలుగా ఉన్నాయి. బోడుప్పల్, పీర్జాదిగూడ, నిజాంపేట్, జవహర్‌నగర్‌లు నగర స్థాయికి ఎప్పుడో వెళ్లిపోయాయి. భవిష్యత్తులో మేడ్చల్‌ కేవలం అర్బన్‌ జిల్లాగానే ఉండిపోనుంది. కేవలం రెవెన్యూ మండలాలకే పరిమితం కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement