పిల్లల్ని నాతోనే తీసుకెళ్తున్నా.. | Mother hangs herself after killing two children | Sakshi
Sakshi News home page

పిల్లల్ని నాతోనే తీసుకెళ్తున్నా..

Jun 14 2026 4:56 AM | Updated on Jun 14 2026 4:56 AM

Mother hangs herself after killing two children

ఇద్దరు పిల్లలను చంపి ఉరేసుకున్న తల్లి 

వికారాబాద్‌ జిల్లాలో విషాదం  

కుల్కచర్ల: ఆ తల్లికి ఎంత కష్టమొచ్చిందో తెలియదు కానీ పేగు తెంచుకు పుట్టిన ఇద్దరు పిల్లలను కడతేర్చి, తానూ ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన వికారాబాద్‌ జిల్లా చౌడాపూర్‌ మండలం అడవి వెంకటాపూర్‌లో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు... గ్రామానికి చెందిన నవనీత (28) శనివారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో కొడుకు విఘ్నేశ్‌ (7), కూతురు మధుప్రియ(5)కు ఉరి వేసింది. వారు చనిపోయారని నిర్ధారించుకున్న తర్వాత తానూ ఉరేసుకుని తనువు చాలించింది. కుటుంబ కలహాలే ఈ దారుణానికి కారణమని తెలుస్తోంది. 

‘నా చావుకు ఎవరూ కారణం కాదు.. నేను చనిపోతే పిల్లలు అనాథలుగా మారుతారు. అందుకే నా పిల్లల్ని నాతోనే తీసుకెళ్తున్నా.. నన్ను ఎవరూ ఏమనలేదు. నాభర్తను ఏమనొద్దు’అని నవనీత రాసిపెట్టిన సూసైడ్‌ నోట్‌ను పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. భర్త జంబుల మల్లేశ్‌తోపాటు అతని కుటుంబ సభ్యుల కారణంగానే తమ బిడ్డ ఇంతటి దారుణమైన నిర్ణయం తీసుకుందని మృతురాలి పుట్టింటి తరఫు బంధువులు ఆందోళన వ్యక్తంచేశారు. భార్యాపిల్లలు మృతిచెందినా రాత్రి పది గంటల వరకూ మల్లేశ్‌ ఇంటికి రాకపోవడం గమనార్హం.  

బతుకంతా కష్టాలే..: నవనీత జీవితమంతా కష్టాల్లోనే సాగింది. కుల్కచర్ల మండలం ముజాహిద్‌పూర్‌కు చెందిన ఆమె చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయింది. అప్పట్లో వీరు కూడా ఉరేసుకుని చనిపోయారు. దీంతో పెద్దనాన్న, బాబాయిలే నవనీతను పెంచారు. ఎనిమిదేళ్ల క్రితం మల్లేశంకు ఇచ్చి పెళ్లి చేయగా, కొన్నాళ్లపాటు సాఫీగానే సాగిన సంసారంలో నాలుగేళ్లుగా కలహాలు మొదలయ్యాయి. దీంతో తీవ్ర మానసిక వేదనకు గురైన ఆమె చావే శరణ్యమని భావించినట్లు తెలుస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement