breaking news
navaneetha
-
పిల్లల్ని నాతోనే తీసుకెళ్తున్నా..
కుల్కచర్ల: ఆ తల్లికి ఎంత కష్టమొచ్చిందో తెలియదు కానీ పేగు తెంచుకు పుట్టిన ఇద్దరు పిల్లలను కడతేర్చి, తానూ ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండలం అడవి వెంకటాపూర్‌లో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు... గ్రామానికి చెందిన నవనీత (28) శనివారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో కొడుకు విఘ్నేశ్ (7), కూతురు మధుప్రియ(5)కు ఉరి వేసింది. వారు చనిపోయారని నిర్ధారించుకున్న తర్వాత తానూ ఉరేసుకుని తనువు చాలించింది. కుటుంబ కలహాలే ఈ దారుణానికి కారణమని తెలుస్తోంది. ‘నా చావుకు ఎవరూ కారణం కాదు.. నేను చనిపోతే పిల్లలు అనాథలుగా మారుతారు. అందుకే నా పిల్లల్ని నాతోనే తీసుకెళ్తున్నా.. నన్ను ఎవరూ ఏమనలేదు. నాభర్తను ఏమనొద్దు’అని నవనీత రాసిపెట్టిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. భర్త జంబుల మల్లేశ్‌తోపాటు అతని కుటుంబ సభ్యుల కారణంగానే తమ బిడ్డ ఇంతటి దారుణమైన నిర్ణయం తీసుకుందని మృతురాలి పుట్టింటి తరఫు బంధువులు ఆందోళన వ్యక్తంచేశారు. భార్యాపిల్లలు మృతిచెందినా రాత్రి పది గంటల వరకూ మల్లేశ్ ఇంటికి రాకపోవడం గమనార్హం. బతుకంతా కష్టాలే..: నవనీత జీవితమంతా కష్టాల్లోనే సాగింది. కుల్కచర్ల మండలం ముజాహిద్పూర్కు చెందిన ఆమె చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయింది. అప్పట్లో వీరు కూడా ఉరేసుకుని చనిపోయారు. దీంతో పెద్దనాన్న, బాబాయిలే నవనీతను పెంచారు. ఎనిమిదేళ్ల క్రితం మల్లేశంకు ఇచ్చి పెళ్లి చేయగా, కొన్నాళ్లపాటు సాఫీగానే సాగిన సంసారంలో నాలుగేళ్లుగా కలహాలు మొదలయ్యాయి. దీంతో తీవ్ర మానసిక వేదనకు గురైన ఆమె చావే శరణ్యమని భావించినట్లు తెలుస్తోంది. -
‘నాన్న.. అమ్మను కొట్టకు బాగా చూసుకో.. నేనింక బ్రతకను..’
తన భవిష్యత్తు కలలను విధి చిదిమేసింది. తన జీవితంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న చిన్నారిని ఛాతినొప్పి రూపంలో మృత్యువు వెంటాడింది. దీంతో, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అకాల మరణం పొందింది. ఈ విషాద ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. అయితే, చివరి నిమిషాల్లో ఆమె మాటలు అందరినీ కన్నీరుపెట్టిస్తున్నాయి. వివరాల ప్రకారం.. జిల్లేడుగూడెం మండలం గుర్రంపల్లి గ్రామానికి చెందిన గడ్డ మీది కృష్ణయ్య, నీలమ్మ దంపతుల కుమార్తె నవనీత(13). ఆమె ప్రస్తుతం ఎనిమదో తరగతి చదువుతోంది. నవనీత పేరెంట్స్ మేస్త్రి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే, స్కూల్‌కు వెళ్లిన నవనీత.. ఒక్కసారిగా అస్వస్థతకు గురైంది. క్లాస్‌లో ఉన్న సమయంలోనే ఛాతిలో నొప్పి వస్తోందంటూ ఇంటికి తిరిగి వచ్చేసింది. ఈ విషయంలో తల్లిదండ్రులకు చెప్పడంతో.. ఆమెను వెంటనే షాద్‌నగర్‌లోని ఓ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఈ సందర్బంగా ఆసుపత్రిలోని డాక్టర్లు నవనీతకు ప్రాథమిక వైద్యం అందించారు. చికిత్స సందర్భంగా చిన్నారి గుండెకు సంబంధించిన సమస్య ఉందని.. వెంటనే ఆమెను హైదరాబాద్‌లోని మరో ఆసుపత్రికి తీసుకువెళ్లాలని సూచించారు. వైద్యుల సూచనల మేరకు తమ కుమార్తెను నిలోఫర్ ఆస్పత్రిలో చేర్పించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ నవనీత శనివారం రాత్రి చనిపోయింది. దీంతో, ఆమె పేరెంట్స్ కన్నీటిపర్యంతమయ్యారు. తమ బిడ్డను కాపాడుకోలేకపోయామని ఆవేదనకు గురయ్యారు. ఇదిలా ఉండగా.. నీలోఫర్‌లో నవనీత చికిత్స పొందుతున్న సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆవేదనకు గురిచేశాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో నవనీత మాట్లాడుతూ..‘నాన్న అమ్మని బాగా చూసుకో.. అమ్మను కొట్టకు.. తిట్టకు. నేనింక బ్రతకను.. చనిపోతున్నాను. నా గురించి మర్చిపోండి’ అని కన్నీరుపెట్టుకుంది. ఆమె మాటలకు తండ్రి ధైర్యం చెబుతూ.. నీకేం కాదమ్మా.. అలా అనొద్దు అని చెబుతూనే కన్నీరు పెట్టుకున్నారు. ఇది చూసి అక్కడున్న వారంతా ఒక్కసారిగా కన్నీటిపర్యంతమయ్యారు. -
పూడ్చేసిన శవాన్ని మళ్లీ బైటకి తీసి..
అత్తాపూర్: కూతురు మృతిపై తండ్రి అనుమానం వ్యక్తం చేయడంతో ఖననం చేసిన వుృతదేహాన్ని మళ్లీ బైటకి తీసి పోస్ట్‌మార్టం నిర్వహించిన సంఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్ స్పెక్టర్ వి.ఉమేందర్ కథనం ప్రకారం.. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని బుద్వేల్ ఇంద్రనగర్ కాలనీకి చెందిన నవనీత(25), థామస్ భార్యాభర్తలు. నవనీత స్వీపర్‌గా విధులు నిర్వర్తించేది. అయితే ఈ నెల 15న నవనీత ఇంట్లో నిద్రలోనే మృతి చెందింది. సహజ మరణంగానే భావించిన కుటుంబసభ్యులు అంత్యక్రియలు పూర్తి చేశారు. కాగా నవనీత తండ్రి నర్సింహ తన కూతురు మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మంగళవారం మృతదేహాన్ని బయటకు తీసి పోస్ట్‌మార్టం నిర్వహించారు. కేసు దర్యాప్తులో ఉంది.


