ప్రచారం ముగియడంతో తెరచాటు వ్యవహారాలపై దృష్టి
ఓటర్లను ఆకర్షించేందుకు యత్నాలు
హైదరాబాద్: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రచారానికి తెరపడగా, పంపకాల పర్వానికి ప్రధాన పార్టీలు తెరతీశాయి. ఉప ఎన్నికలో గెలుపు కోసం మూడు ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. గెలవడం వాటికి ప్రతిష్టాత్మకంగా మారింది. గత మూడు రోజుల నుంచి బస్తీలు, కాలనీలు, అపార్ట్‌మెంట్లు అనే తేడా లేకుండా అంతటా యథేచ్ఛగా ‘ఓటుకు నోటు’ బేరం సాగుతోంది. ఓటర్లకు ఏ పార్టీ ఎంత పంపిణీ చేస్తోందన్న విషయాన్ని ఒకదానికొకటి ఆరా తీస్తున్నాయి. తామే ఎక్కువ డబ్బులను పంచాలనే ప్రణాళికలు రూపొందించుకుని గడపగడపనూ టచ్ చేస్తున్నాయి.
కొన్ని పార్టీలైతే అపార్ట్‌మెంట్‌లో రూ.2,500, బస్తీల్లో రూ.3,000 చొప్పున పంచుతున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో ఏ పార్టీవారైనా ఓటర్లకు డబ్బులు, చీరలు, కుక్కర్లు పంపిణీ చేస్తే.. ప్రత్యర్థి పార్టీ వారు పోలీసులకు, ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేసేవారు. ఇప్పుడు ఎవరూ ఫిర్యాదులు చేయడం లేదు. ‘డబ్బులు తీసుకోండి.. ఓటు మాత్రం మాకు వేయండి..’ అంటూ బహిరంగంగానే ఓటర్లకు పిలుపు ఇస్తున్నారు. తాము ఫలానా పార్టీవాళ్లమని కొందరు ఓటర్లు చెప్పినా ‘ఫర్వాలేదు. ఉంచుకోండి’ అంటూ బొట్టుపెట్టి అప్పగింతలు చేసినట్లే చెప్పేస్తున్నారు. ఆయా బస్తీల్లో మహిళా నేతలకు ఈ పంపిణీ బాధ్యతలు అప్పగిస్తున్నారు.
మధ్యవర్తులకు పండుగే పండుగ..
గత కొద్దిరోజుల నుంచి వివిధ పార్టీల ప్రచారాలకు జనాన్ని తీసుకువెళ్లడంలో కొందరు మధ్యవర్తులు కీలకపాత్ర పోషిస్తున్నారు. ప్రచారానికి వచ్చిన జనాలకు ఒక్కొక్కరికి రూ.500 చొప్పున రోజువారీగా ఇస్తున్నారు. అయితే కొందరు మధ్యవర్తులు రూ.300 నొక్కేసి రూ.200 చొప్పున మాత్రమే ఇస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. తాజాగా పారామౌంట్ కాలనీలో తమకు రూ.500 ఇవ్వాల్సిందేనంటూ ప్రచారానికి హాజరైన మహిళలు మధ్యవర్తి ముందు బైఠాయించారు. ‘రూ.200 ఇస్తాను తీసుకోండి.. లేదంటే వెళ్లండి’ అంటూ సదరు మధ్యవర్తి తెగేసి చెప్పడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న ఉద్దేశంతో ఇటు మధ్యవర్తులు, అటు కిందిస్థాయి నేతలు అందినంత జేబులో వేసుకోవడానికే ప్రయత్నిస్తున్నారు. మొత్తానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక చాలా కాస్ట్‌లీగా మారింది. ఉప ఎన్నిక సందర్భంగా అడుగు తీసి అడుగు వేస్తే పరిస్థితి డబ్బులు మయమైపోయిందని నేతలు వాపోతున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో డబ్బుల ప్రవాహానికి అంతులేకుండా పోయిందని గత మూడు దశాబ్దాలుగా ఇక్కడ ఎన్నికల తీరును చూస్తున్న కొందరు ఓటర్లు పెదవి విరుస్తున్నారు.
మూగబోయిన మైకులు
బంజారాహిల్స్: గడిచిన 18 రోజులుగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పర్వంలో హోరెత్తిన ప్రచారానికి ఆదివారం సాయంత్రం 6 గంటలతో తెరపడింది. ప్రచార రథాలకు ఏర్పాటుచేసిన మైక్‌లను సరిగ్గా 6 గంటల సమయంలో నిర్వాహకులు తొలగించడంతో ప్రచారంలో మైకులు మూగబోయాయి. గల్లీ గల్లీలో 58 మంది అభ్యర్ధులు తమ ప్రచార రథాలకు మైకులు ఏర్పాటుచేసుకుని వారి సందేశాలు వినిపించారు. స్వతంత్ర అభ్యర్ధులు కూడా తమ స్థాయికి తగ్గ ప్రచార రథాన్ని తయారుచేసుకుని ఒక మైక్ తగిలించి గెలిస్తే తాము ఏమి చేస్తామో పాటల రూపంలో, ప్రసంగం రూపంలో వివరించి ప్రజలను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా మూడు ప్రధాన పారీ్టలు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ప్రచార రథాలు గల్లీగల్లీలో కదం తొక్కాయి.
పాటలు, ప్రసంగాలు తమ పార్టీ మేనిఫెస్టోను తెలియజేస్తూ మైక్‌ల్లో ఊదరగొట్టారు. ప్రచార రథాలకు ఉన్న మైకులు తొలగిపోవడంతో ప్రచారం కాస్తా ఆకర్షణ కోల్పోయిందనే చెప్పారు. రథానికి మైక్ ఉంటేనే ఉర్రూతలూగించి పార్టీ పాటలతో వచ్చిన జనం ఎక్కువ సేపు ఉండేవారు. కాగా ప్రచార పర్వం ముగియడంతో ఆయా పారీ్టల అభ్యర్థులు పోలింగ్‌పై దృష్టిపెట్టారు. మంగళవారం ఎన్నికల పోలింగ్ రోజున అనుసరించాల్సిన వ్యూహాలపై తమ అనుచరులు, ఇతర నేతలతో మంతనాలు జరుపుతున్నారు. మనీ, మద్యం పంపకాలపైనా తెరచాటు వ్యవహారాలు ప్రారంభించినట్లు గుసగుసలు విని్పస్తున్నాయి. ఎలాగైనా గెలిచి తీరాలనే తలంపుతో ప్రధాన పారీ్టల నేతలంతా ముమ్మర కసరత్తు చేస్తున్నారు. చివరికి విజయం ఎవరిని వరిస్తుందో ఈ నెల 14న ఫలితాల వెల్లడి రోజు తెలియనుంది.


