
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి హరీశ్‌రావు ఏఐజీ ఆస్పత్రికి వెళ్లి వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.
48 గంటల పాటు అబ్జర్వేషన్‌లో ఉంచి డాక్టర్లు బులెటిన్ విడుదల చేస్తారని హరీశ్‌రావు చెప్పారు. అభిమానులు, బీఆర్‌ఎస్ కార్యకర్తలు ఆందోళన చెందవద్దని గోపీనాథ్ క్షేమంగా బయటకు వస్తారన్నారు. బోరబండకు చెందిన తన అనుచరుడు సర్దార్ ఆత్మహత్యతో గోపీనాథ్ ఒత్తిడికి లోనయ్యారని కుటుంబ సభ్యులు చెప్పినట్లు ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ వెల్లడించారు.
కుడి భుజంగా ఉన్న వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం, కారణమైన వ్యక్తిపై పోలీసులు చర్యలు తీసుకోకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై అస్వస్థతకు లోనైనట్లు కుంటుంబ సభ్యులు తెలిపారన్నారు. గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, తిరిగి క్షేమంగా వస్తారని చెప్పారు. ఏఐజీ ఆస్పత్రి కి ఎమ్మెల్యే కృష్ణారావు, వివేకానంద, ముఠాగోపాల్, గూడెం మహిపాల్‌రెడ్డి, నామా నాగేశ్వర్‌రావు, మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డి తదితరులు వెళ్లారు.