మహాద్భుతం.. బుద్ధవనం | Miss World contestants to visit Buddhavanam on May 12 | Sakshi
Sakshi News home page

Buddhavanam: మహాద్భుతం.. బుద్ధవనం

May 12 2025 1:22 AM | Updated on May 12 2025 12:28 PM

Miss World contestants to visit Buddhavanam on May 12

బుద్ధవనంలోని మహాస్థూపం ఏరియల్‌ వ్యూ

అభినవ బుద్ధ ఆచార్య నాగార్జునుడి నేల 

రెండువేల ఏళ్ల క్రితమే ప్రఖ్యాత విశ్వవిద్యాలయం 

తెలుగు నేలపై బౌద్ధ చరిత్రకు గొప్ప సాక్ష్యం 

నేడు బుద్ధవనం సందర్శనకు ప్రపంచ సుందరీమణులు

రెండు వేల సంవత్సరాల క్రితం ఆచార్య నాగార్జునుడు స్థాపించిన విజయపురి విశ్వవిద్యాలయం, ఇక్కడ విలసిల్లిన బౌద్ధమత ప్రాచుర్యం ఆధారంగా కృష్ణా తీరంలో (నాగార్జునసాగర్‌ తీరంలో) బుద్ధిస్టు హెరిటేజ్‌ థీం పార్కును బుద్ధవనం (Buddhavanam) ప్రాజెక్టుగా మహాద్భుతంగా తీర్చిదిద్దారు. అభినవ బుద్ధుడు ఆచార్య నాగార్జునుడు నడయాడిన నేల ఇది. ఆ చరిత్ర ఆధారంగానే సాగర్‌ తీరంలో 274 ఎకరాల్లో బుద్ధవనం (శ్రీపర్వతారామం), 30 ఎకరాల్లో విపశ్యన కేంద్రం నిర్మించారు. అష్టాంగ విభాగాలుగా దీని నిర్మాణం చేశారు. ఆసియా ఖండంలోనే సిమెంట్‌తో నిర్మించిన అతిపెద్ద మహాసూ్థపం బుద్ధవనం.

ఈ నెల 12వ తేదీన బుద్ధపూర్ణిమ సందర్భంగా ప్రపంచ సుందరి పోటీల్లో పాల్గొంటున్న సుందరీమణులు ఈ చారిత్రక ప్రదేశాన్ని సందర్శించనున్నారు. హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక బస్సులో బయలు దేరి వెల్లంకిలో కొంతసేపు సేద దీరి, నాగార్జునసాగర్‌కు చేరుకుంటారు. విజయవిహార్‌ అతిథిగృహంలో వారికి స్వాగత ఏర్పాట్లు చేశారు. విజయవిహార్‌ ముందు ఏర్పాటు చేసిన ఫొటో సెషన్‌లో పాల్గొంటారు. అనంతరం విజయవిహార్‌ వెనుకభాగంలో, సాగర్‌ తీరాన పచ్చిక బయళ్లలో వారు ప్రత్యేకంగా ఫొటోలు దిగుతారు. 

ఆ తరువాత బుద్ధవనం చేరుకుంటారు. బుద్ధుని పాదుకల వద్ద 25 మంది బౌద్ధ సన్యాసులు నిర్వహించే బౌలికుప్ప మహాబోధి పూజల్లో పాల్గొంటారు. అక్కడినుంచి మహాసూ్థపం వద్దకు చేరుకొని, వెనుక భాగాన ఉన్న మెట్ల ద్వారా పైకి ఎక్కుతారు. దానికి వంద అడుగుల దూరంలో ఏర్పాటు చేసిన గిరిజన సంప్రదాయ నృత్యాన్ని తిలకిస్తారు. అనంతరం మహాస్థూపం అంతర్భాగంలో అష్టబుద్ధుల వద్దకు చేరుకొని అక్కడ కొవ్వొత్తులు వెలిగించి పూజలు చేస్తారు. 

ఈ సందర్భంగా బౌద్ధమత గురువు నిర్వహించే 5 నిమిషాల ప్రార్థనలో పాల్గొంటారు. అనంతరం రెండు నిమిషాల పాటు «ధ్యానం చేస్తారు. అక్కడి నుంచి మహాస్థూపం చూట్టూ ఉన్న 2,500 విగ్రహాల గురించి పర్యాటక శాఖ ప్రతినిధి శివనాగిరెడ్డి వివరిస్తారు. అనంతరం జాతకవనంలోకి వెళతారు. అక్కడ వారికి బుద్ధవనం, తెలంగాణలో బౌద్ధ చరిత్ర ప్రాధాన్యత గురించి పర్యాటక శాఖ ప్రతినిధి వివరిస్తారు. బుద్ధుని పుట్టుక నుంచి నిర్యాణం వరకు ప్రత్యేక డ్రామాను ప్రదర్శిస్తారు.  – సాక్షి ప్రతినిధి, నల్లగొండ

బుద్ధుని జీవిత విశేషాలు 
తెలంగాణ టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ 2003లో దీనిని ప్రారంభించింది. సిద్ధార్థ గౌతముని జీవితంలోని ప్రధాన ఘట్టాలను వర్ణించే అనేక నేపథ్య విభాగాలతో కూడినదే బుద్ధవనం. ఆయన పూర్వ జన్మ కథలను చిత్రీకరించిన జాతక పార్క్, సూక్ష్మ స్థూపాలతో కూడిన స్థూపపార్క్, మహాసూ్థపం, బౌద్ధ హెరిటేజ్‌ మ్యూజియం, మహాసూ్థపం గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఆచార్య నాగార్జున విగ్రహం, 27 అడుగుల బుద్ధ విగ్రహం ఇందులో ఏర్పాటు చేశారు. ధమ్మ గంటను శ్రీలంక ప్రభుత్వం విరాళంగా ఇచ్చింది. దేశంలోనే ఇది మొదటిది.

ప్రవేశ వేదిక  
ప్రవేశ వేదిక అష్టమంగళ (ఎనిమిది శుభ) చిహ్నలు, ఐకానిక్‌ రూపంలో బుద్ధుడు, జంతువులు, పక్షులు, బోధి వృక్షం, మిథునాలు (రసిక జంటలు), బుద్ధపాదాలు వంటివి ఇక్కడ ఉంటాయి. ప్రధాన ఇతివత్తాలు, సిద్ధార్థుని కిరీటం (జుట్టు) మోస్తున్న అగ్ని స్తంభం, నాగముచిలింద, పవిత్ర అవశేషాల ఆరాధన, మధ్యలో అశోక ధర్మ చక్రం స్తంభంతో శక్తివంతమైన విల్లును మోస్తున్న సిద్ధార్థుడు వంటి శిల్పాలు ఉంటాయి. 

బుద్ధ చరిత్రవనం  
సిద్ధార్థ గౌతమ జీవితంలో ఐదు ప్రధాన సంఘటనలు ఉన్నాయి. అవి జననం, నాలుగు సమావేశాలు, మహా నిష్క్రమణ, జ్ఞానోదయం. బుద్ధుని మొదటి ఉపన్యాసం, మహాపరినిర్వాణం వంటి అంశాలపై చిత్రాలను కాంస్యంతో చేశారు. పల్నాడు సున్నపు రాయిలో చెక్కబడిన బుద్ధపాద స్లాబ్‌ అష్టమంగళ (ఎనిమిది శుభ) చిహ్నాలు ఉద్యానవన ప్రవేశ ద్వారం వద్ద ప్రధాన ఆకర్షణలుగా ఉంటాయి. 

జాతక వనం (బోధిసత్వ పార్క్‌) 
బోధిసత్వుడు బుద్ధుడిగా మారటానికి ముందు పది పరిపూర్ణతలను ఆచరిస్తూ జీవితాన్ని గడుపుతాడు. వాటినే దశపారమిత అంటారు. అవి దాన (ఉదారత), శీల (ధర్మం), శాంతి (సహనం), వీర్య (ధైర్యం), ధ్యాన (ఏకాగ్రత), ప్రజ్ఞ (జ్ఞానం), త్యాగ (త్యజించడం), సత్య (సత్యం), కరుణ (ప్రేమపూర్వక దయ), సమత (సమానత్వం). 547 జాతక కథలలో 40 జాతక కథలు అమరావతి, ఫణిగిరి, నాగర్జునకొండ, గోలి, జగ్గయ్యపేట, చందవరం బౌద్ధ క్షేత్రాలలోని అసలు శిల్పకళా ఫలకాల ఆధారంగా పల్నాడు లైమ్‌ స్టోన్‌లో చిత్రీకరించారు. 

ధ్యానవనం (మెడిటేషన్‌ పార్క్‌) 
27 అడుగుల అవుకాన బుద్ధను ధ్యానవనంలో ఏర్పా టు చేశారు. దీనిని శ్రీలంక ప్రభుత్వం అందజేసింది. 

స్తూపవనం (మినియేచర్‌ స్తూప పార్క్‌) 
కర్లా, అజంతా (మహారాష్ట్ర), సాంచి (మధ్యప్రదేశ్‌), సారనాథ్‌ (ఉత్తరప్రదేశ్‌), మంకియాలా, (పంజాబ్‌– పాకిస్తాన్‌), అనురాధపుర, శ్రీలంక, కహు–జో–దారో, మిర్పూర్‌ ఖాస్, పాకిస్తాన్, బౌధానాత్, మహాత్రాస్తాన్, నేపాల్‌లోని స్థూపాల ప్రతిరూపాలు ఇక్కడ ఏర్పాటు చేశారు. థాయ్‌లాండ్, పార్డో కాలింగ్‌ చోర్టెన్‌ టిబెట్, శ్వేసాండావ్‌– మయన్మార్, గ్యాంగ్జు, దక్షిణ కొరియా, భారతదేశం, ఆగ్నేయాసియాలోని బౌద్ధ స్థూప నిర్మాణాల రూపాలను ఇక్కడ ఏర్పాటు చేశారు. 

మహాస్తూపం 
బుద్ధవనం ప్రాజెక్ట్‌ ప్రధాన ఆకర్షణ మహాస్తూపం. అమరావతిలోని అసలు స్థూపం కొలతలు, వాస్తుశిల్పం ప్రకారం దీనిని నిర్మించారు. దాని పైభాగంలో వేదిక (డ్రమ్‌), గోపురం (అండ), హారి్మక ఉన్నాయి. 42 మీటర్ల వెడల్పు, 21 మీటర్ల ఎత్తుతో దాని డ్రమ్, గోపురం భాగాలపై బౌద్ధ ఇతివృత్తాల శిల్ప ఫలకాలతో ఏర్పాటు చేశారు. మహాస్తూపం చుట్టూ గోడపై బుద్ధుని జీవితంలోని ముఖ్యమైన రాజులు, ధర్మ పోషకుల దశ్యాలు ఉంటాయి. గోపుర భాగంపై వజ్రాసన, బోధి వక్షం, అగ్ని స్తంభం, జాతక కథలు, బుద్ధుని జీవితంలోని సంఘటనలు వంటి బౌద్ధ చిహ్నలను వర్ణించే శిల్పాలు చెక్కారు. స్థూపం గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఆచార్య నాగార్జున విగ్రహం ఉంటుంది. 

మహాస్థూపం లోపల వర్చువల్‌ ఆకాశ దృశ్యం 
మహాసూ్థపం లోపల 25 అడుగుల ఎత్తులో పంచధ్యాన బుద్ధులను ఏర్పాటు చేశారు. మహాస్తూపం పైకప్పు ఆకాశాన్ని తలిపిస్తూ తామరపువ్వు రేకుల ఆకారంలో ఉంటుంది. పైకప్పు లోపలి భాగం చిల్లులు గల ట్రాపెజోయిడల్‌ ప్యానెల్‌లతో ఆకాశాన్ని ప్రతిబింబిస్తుంది. ప్రతి ఒక్కటి మరొకదానికి భిన్నంగా 2.5 మీటర్ల పరిమాణంలో, కాంతి థర్మోడైనమిక్స్, ప్రత్యేక ప్రకాశాన్ని జోడించేలా ఉంటాయి. ఇందులో లోటస్‌ రేకులు (960), స్కై ప్యానెల్‌లు (528) ఉంటాయి. ప్రపంచంలోనే తొలిసారిగా ఉపయోగించిన జర్మన్‌ టెక్నాలజీతో వీటిని ఏర్పాటు చేశారు. 

బుద్ధవనానికి అవార్డులు 
విశిష్ట ఆకర్షణలతో కూడిన ఈ ప్రాజెక్టుకు అనేక అవార్డులు లభించాయి. పర్యాటకులకు ఉత్తమ పౌర సౌకర్యాలు, మౌలిక సదుపాయాలను అందించినందుకు తెలంగాణ పర్యాటక శాఖ 2022లో అవార్డును అందజేసింది. దీనిపై నిర్మించిన డాక్యుమెంటరీకి ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రం అవార్డును అందుకుంది. 2022లో కోల్‌కతాలో బౌద్ధ టూర్‌ ఆపరేటర్ల సంఘం ‘భూటాన్‌ బంగ్లాదేశ్‌ ఇండియా అండ్‌ నేపాల్‌ టూరిజం మిత్ర అవార్డు’ను కూడా అందుకుంది.  

బౌద్ధ వారసత్వ ప్రాంగణం బుద్ధవనం 
తెలంగాణలో బౌద్ధమతం ఆగమనం బుద్ధుని జీవితకాలం నాటిది. సుత్తనిపాత పారాయణవగ్గ ప్రకారం ‘కవిట్టవనమిష్టి గోదావరి రివేరిన్‌’అనే బ్రాహ్మణ ఋషి బుద్ధుని బోధనలను వినడానికి తన 16 మంది శిష్యులను మగధకు పంపాడు. బుద్ధుని అనుచరులుగా మారిన పింగియా.. బుద్ధుని బోధనలను తీసుకువచ్చారు. అప్పటినుంచి నుంచి తెలంగాణలో థేరవాద, మహాయాన, వజ్రయాన బౌద్ధ శాఖలు విస్తరించాయి. అస్సీఘాట్, కోటిలింగాల, కంబాలపల్లి, పాశిగావ్, ధూళికట్ట, ఫణిగిరి, తిరుమలగిరి, వర్ధమానుకోట, గాజులబండ, నేలకొండపల్లి, శ్రీపర్వతం ప్రాంతాల్లో (నాగార్జునసాగర్‌ ప్రాంతం) బౌద్ధమతం మూడు దశల్లో పరిఢవిల్లింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement