
ఆసియా దేశాల్లో దీని గురించి ఎవరూ పట్టించుకోవట్లేదు
నచ్చిన రంగంలో రాణించడమే మహిళా సాధికారత
బంగ్లా స్టూడెంట్ రెవల్యూషన్ నాకు స్ఫూర్తి.
‘సాక్షి’తో అభిప్రాయాలు పంచుకున్న మిస్ బంగ్లాదేశ్ అక్లిమా అతికాకొనికా
సాక్షి, హైదరాబాద్: ‘ఈ తరం యువతపైన అత్యంత సున్నితమైన సామాజిక బాధ్యతలున్నాయి. వీటిని నెరవేర్చడానికి వారిలో మానసిక పరిపక్వత కీలక అంశం’అని మిస్ బంగ్లాదేశ్ అక్లిమా అతికాకొనికా(Aklima Atika Konika) అన్నారు. ప్రస్తుతమున్న పలు సామాజిక సమస్యలకు పరిష్కారాలన్నీ యూత్ మెంటల్‌హెల్త్ పైనే ఆధారపడి ఉన్నాయని ఆమె అభిప్రాయపడ్డారు. మిస్‌వర్డల్ పోటీల్లో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు వచ్చిన అతికా ‘సాక్షి’తో మాట్లాడారు. పూర్తి వివరాలు ఆమె మాటల్లోనే..
ఏ సహజత్వమే సౌందర్యం
కొన్ని సంవత్సరాల క్రితం వరకూ నాకు ఫ్యాషన్ అంటేనే సరిగ్గా తెలియదు. కంఫర్ట్‌గా అనిపించే దుస్తులు వేసుకోవడం, ఎవరైనా పలకరించినా స్పందించలేని మొహమాటం ఉండేది. ఎలాంటి ఫ్యాషన్ సెన్స్ లేదు. అలాంటిది అనుకోకుండా మోడలింగ్ రంగంలోకి వచ్చి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. నా దృష్టిలో బ్యూటీ అంటే సహజత్వం. ప్రతి ఒక్కరికీ ఒక ప్రత్యేకత ఉంటుంది. అదే వారి సౌందర్యానికి మెరుగులద్దుతుంది. అత్యంత సహజత్వమే సౌందర్యంగా కనిపిస్తుందని నేను నమ్ముతా.
ఏ భారత్‌లో సాంస్కృతిక వైవిధ్యం
భారత్ ఒక అద్భుత సాంస్కృతిక సమ్మేళనం. ఢిల్లీ వెళితే ఒకలా, చెన్నై, లడక్ వెళితే మరోలా.. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో సాంస్కృతిక వైవిధ్యం. భారత్ మొత్తం తిరిగితే చాలు ప్రపంచం తిరిగినట్టే. కోల్‌కతా (బెంగాల్) వెళితే మా దేశ మూలాలు ఆత్మీయంగా పలకరిస్తాయి. హైదరాబాద్ (Hyderabad) అయితే మినీ ఇండియా. దేశంలోని ప్రత్యేకతలన్నీ ఇక్కడే ఆతిథ్యమిస్తాయి. నాకు మరో ఇల్లులా అనిపిస్తుంది హైదరాబాద్. తెలంగాణ ప్రజల ఆతీ్మయత నా మనసు దోచుకుంది. నేను మంచి భోజన ప్రియురాలిని. నాకు నచి్చనట్టు ఇక్కడ స్పైసీ ఫుడ్ లభిస్తుంది. ఇక్కడి వారసత్వ వంటకాలు చాలా బాగున్నాయి.
ఏ యంగ్ మైండ్ మ్యాటర్స్
మానసిక ఆరోగ్యం.. మానసిక పరిపక్వత ఈ తరం సామాజిక బాధ్యతగా భావిస్తాను. ఇందులో భాగంగానే యువత మెంటల్ హెల్త్‌పై అవగాహన కల్పించడానికి ప్రత్యేకంగా ‘యంగ్ మైండ్ మ్యాటర్స్’ అనే ప్రాజెక్ట్ చేపట్టా. భారత్‌లో పరిస్థితులు చెప్పలేను కానీ.. ఆసియా దేశాల్లో యువత మానసిక అస్థిరత, మెంటల్ హెల్త్ గురించి ఎవరూ అంతగా ప్రస్తావించట్లేదు. దీనితో ముడిపడి ఎన్నో సామాజిక సమస్యలున్నాయి. తమపైన తమకు విశ్వాసం ఉన్నప్పుడే మిగతా సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయి. నేను ప్రపంచ సుందరి విజేతగా నిలిస్తే.. నా గుర్తింపు, ప్రశస్తిని అంతర్జాతీయంగా యూత్ మెంటల్ హెల్త్‌పై అవగాహన కల్పించడానికి, దానితో ముడిపడి ఉన్న అంశాల కార్యాచరణకు వినియోగిస్తాను.
ఏ అపురూప స్నేహం భారత్–బంగ్లా
మా దేశ యువతలో నైపుణ్యాలకు కొదువ లేదు. ఎన్నో విషయాలను బయటికొచ్చి నేర్చుకుంటున్నాం. గతేడాది మా దేశ యువత చేపట్టిన స్టూడెంట్ రెవల్యూషన్ నాకు స్ఫూర్తి. ఒక బంగ్లా అమ్మాయిగా మా యువత తరఫున ప్రపంచానికి మా ప్రశస్తిని చూపించే బాధ్యత నాపై ఉంది. ఆ ఆశయంతోనే మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొంటున్నాను. వినయం లేకుండా విజయం ఉండదని గట్టిగా నమ్ముతాను. భారత్–బంగ్లాదేశ్‌లది స్నేహపూర్వక సంబంధం. రాజకీయంగా, ఆర్థిక పరమైన అంశాల్లో అనుబంధంతో ముందుకు సాగుతున్నాం. ఇక్కడి ప్రజల ప్రేమ నాకెప్పుడూ గుర్తుండిపోతుంది.
ఏ ఎన్నో దాటుకొని వచ్చాను
నేనూ ఒక మనిషినే. అందరిలానే విభిన్న అనుభవాలు, బాధాకరమైన సందర్భాలను దాటుకొని వచ్చాను. నన్ను నేను సముదాయించుకోవడానికి, ఒత్తిడి పోగొట్టుకోవడానికి ధ్యానం చేస్తాను. ప్రకృతి ప్రేమికురాలిని. ప్రకృతికి మన మానసిక అనిశి్చతి, అస్థిరత్వాన్ని తొలగించే శక్తి ఉంది. నాకు ఏ మాత్రం బాగాలేకున్నా ప్రకృతిలోకి వెళతాను. నాకు నేను సమయం ఇచ్చుకుంటా. సాధారణంగా మాట్లాడటమే నాకున్న పెద్ద చాలెంజ్. అలాంటిది ఇప్పుడు మిస్‌వరల్డ్ వేదికపైన మాట్లాడగలుగుతున్నానంటే అది నా పరిణామ క్రమమే. మహిళలు బయటికెళ్లి ఉద్యోగం, వ్యాపారం ఇంకేదైనా చేయడమే సాధికారత అని అనుకోను. ఒక మహిళ తనకు నచి్చన రంగంలో తన అభిరుచులకు అనుగుణంగా రాణించడమే సాధికారత అని నమ్ముతాను.