సిసోడియా అరెస్టు అప్రజాస్వామికం: కేటీఆర్‌ 

Minister KTR Comments On Sisodias Arrest - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  ఢిల్లీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా అరెస్టును బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారకరామారావు ఖండించారు. మనీష్‌ సిసోడియా అరెస్టు అప్రజాస్వామికమని, బీజేపీ ప్రతిపక్ష పార్టీలపై వ్యవహరిస్తున్న తీరు దుర్మార్గపూరితమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తన పరిధిలోని ఏజెన్సీలను ప్రతిపక్షాలపై ఉసిగొలిపి దొంగచాటు రాజకీయాలకు  పాల్పడుతోందని ఆరోపించారు.

ప్రజాబలం లేక అధికారంలోకి రాలేని రాష్ట్రాల్లో అక్కడి పార్టీలను బలహీనపరిచే కుట్రలో భాగమే సిసోడియా అరెస్ట్‌ అని కేటీఆర్‌ స్పష్టం చేశారు. ఢిల్లీ మేయర్‌ ఎన్నికల్లో సుప్రీంకోర్టుతో చీవాట్లు తిన్నాక ఎదురైన పరాజయాన్ని తట్టుకోలేక సిసోడియాను ఇప్పుడు అరెస్ట్‌ చేశారని ఆరోపించారు, అసమర్థ విధానాలను, అవినీతిని ప్రశ్నిస్తున్న బలమైన పార్టీల నాయకులను ఎదుర్కోలేక బీజేపీ పిరికి రాజకీయాలు చేస్తోందని విమర్శించారు.

బీజేపీ తన పార్టీలోని అవినీతి నాయకులను సత్యహరిశ్చంద్రుని సహోదరులుగా చూపించి, ప్రతిపక్ష నేతలను అవినీతిపరులుగా చిత్రీకరించేందుకు కుటిల ప్రయత్నాలను చేస్తోందని ఎద్దేవా చేశారు. నీతిలేని దుర్మార్గపు రాజకీయాలను దేశం గమనిస్తోందని, బీజేపీ కుట్రపూరిత రాజకీయాలను ప్రజలు కచ్చితంగా తిప్పి కొడతారని పేర్కొన్నారు. భవిష్యత్తులో బీజేపీ నాయకులకు ఇదే గతి పడుతుందని కేటీఆర్‌ హెచ్చరించారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top