
సాక్షి, హైదరాబాద్: నాంపల్లి కోర్టు ఆదేశాలపై మంత్రి కొండా సురేఖ స్పందించారు. తన కేసుకు సంబంధించి కోర్టు కాగ్నిజెన్స్ తీసుకొని ముందుకు వెళ్ళాలని స్పష్టం చేసిందని.. ఈ దేశ న్యాయ వ్యవస్థపై అపారమైన గౌరవం ఉందని ఆమె పేర్కొన్నారు. ‘‘ఈ కేసులు, కొట్లాటలు కొత్త కాదు నాకు. నా జీవితమే ఒక పోరాటం’’ అంటూ చెప్పుకొచ్చిన కొండా సురేఖ.. ఏ కేసులోనైనా కోర్టు కాగ్నిజెన్స్ తీసుకోమని చెప్పడం సర్వసాధారణమన్నారు.
మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. నటి సమంత విడాకుల వ్యవహారంలో కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వేసిన పరువు నష్టం దావా కేసులో కొండా సురేఖపై క్రిమినల్ కేసుకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేటీఆర్ వాదనలతో ఏకీభవించిన నాంపల్లి కోర్టు.. ఈ నెల 21 లోపు క్రిమినల్ కేసు నమోదు చేసి నోటీసులు ఇవ్వాలని ఆదేశించింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా కేటీఆర్‌పై కొండా సురేఖ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.