సంజయ్‌వి క్షుద్ర రాజకీయాలు 

Minister Harish Rao Shocking Comments On MP Bandi Sanjay  - Sakshi

రాష్ట్ర ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వొద్దని లేఖ ఇస్తారా?

ఇంతకంటే దౌర్భాగ్యం ఏమైనా ఉంటుందా?

చేతనైతే రాష్ట్రానికి ప్రాజెక్టులు తెండి..

అసెంబ్లీలో బండి సంజయ్‌పై హరీశ్‌రావు మండిపాటు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రయోజనాల కోసం తాము చర్యలు తీసుకుంటుంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ క్షుద్ర, స్వార్థ రాజకీయాలు చేస్తున్నారని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. పదవుల కోసం రాష్ట్ర హక్కులు, ప్రయోజనాలు దెబ్బతీసేలా చేయడం దారుణమని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రాజెక్టులకు కేంద్ర జలశక్తి శాఖ అన్ని అనుమతులు ఇచ్చేవరకు పర్యావరణ, అటవీ అనుమతులు ఇవ్వొద్దని, ఇందుకు ఓ ప్రత్యేక చట్టాన్ని తెలంగాణ కోసం తీసుకురావాలని కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌కు బండి సంజయ్‌ లేఖ ఇచ్చారని పేర్కొన్నారు. 

గురువారం అసెంబ్లీలో జలవనరుల శాఖ పద్దుపై చర్చకు సమాధానమిస్తూ.. బండి సంజయ్‌ రాసిన లేఖను సభలో చూపించారు. జల శక్తి శాఖ మంత్రి షెకావత్‌కు కూడా మరో లేఖ ఇచ్చారని తెలిపారు. ఏ రాష్ట్రానికి లేని నిబంధనను, అవసరమైతే చట్టాన్నే తెలంగాణ కోసం తీసుకురావాలని అడిగితే రాష్ట్ర ప్రాజెక్టులు ఎలా ముందుకు సాగుతాయని ప్రశ్నించారు. పక్క రాష్ట్రాలు ప్రాజెక్టులను వేగంగా కట్టుకోవా అని అడిగారు. తన స్వార్థం కోసం రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీయడమేంటని మండిపడ్డారు.

రాష్ట్రంపై ప్రేమ ఉంటే, చేతనైతే జాతీయ ప్రాజెక్టులు తీసుకురావాలని లేదా జాతీయ హోదా తేవాలని సవాల్‌ విసిరారు. ఎవరైనా రాష్ట్ర ప్రాజెక్టులకు తొందరగా అనుమతులు ఇవ్వాలని అడగాలే తప్ప ఇలాంటివి చేయడమేంటని ప్రశ్నించారు. ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకొకటి ఉంటుందా అని ఆవేదన వ్యక్తం చేశారు. చేతనైతే సాయం చేయాలి కానీ.. రాష్ట్ర రైతుల నోట్లో మట్టి కొట్టడమేంటని దుయ్యబట్టారు. బీజేపీ నేతల స్వరాష్ట్ర భక్తి ఎక్కడికి పోయిందంటూ ఎద్దేవా చేశారు. వారికి రాజకీయ భుక్తిపైనే దృష్టి తప్ప రాష్ట్ర భక్తి లేదని మండిపడ్డారు. డీపీఆర్‌ ఇవ్వకుండా సెంట్రల్‌ వాటర్‌ కమిషన్, పర్యావరణ శాఖ, 18 డైరెక్టరేట్ల టెక్నికల్‌ అడ్వైజరీ కమిటీ ఎలా అనుమతులు ఇస్తాయని ప్రశ్నించారు.

ఏపీ ప్రాజెక్టులపై ఫిర్యాదు చేశాం..
ఏపీ సర్కారు కడుతున్న ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వం న్యాయపోరాటం కొనసాగిస్తోందని హరీశ్‌రావు వెల్లడించారు. వివిధ పద్దులపై చర్చ అనంతరం సీఎం తరఫున సాగునీటి పద్దులపై హరీశ్‌రావు సమాధానం ఇచ్చారు. ఏపీ ప్రభుత్వ ప్రాజెక్టుల విషయంలో స్వయంగా సీఎం అపెక్స్‌ కౌన్సిల్‌ దృష్టికి తీసుకెళ్లారని, కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేశారని, కేంద్రం దృష్టికి తీసుకెళ్లారని, సుప్రీంకోర్టులో కేసు వేశారని గుర్తుచేశారు.

గ్రీన్‌ ట్రిబ్యునల్‌లో కేసు వేసి ఉత్తర్వులు తెచ్చామని, అయినా ఏపీ ప్రాజెక్టు ఆపకపోతే ధిక్కరణ కేసు వేశామని, దానిపై గ్రీన్‌ ట్రిబ్యునల్‌ కమిషన్‌ వేసినట్లు చెప్పారు. 2007లో ప్రాణహిత చేవెళ్లకు రూ.17,875 కోట్లతో జీవో ఇస్తే 19 నెలల తర్వాత రూ.38,500 కోట్లకు చేరిందని, 2010లో రూ.40,300 కోట్లతో కేంద్రానికి డీపీఆర్‌ పంపినట్లు చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో 1 లక్ష ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని, వీలైతే ఎక్కువే ఇవ్వాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.

పదేళ్ల కాంగ్రెస్‌ పాలనలో ఆయకట్టు 6.64 లక్షల ఎకరాలు ఉంటే రాష్ట్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి, రీడిజైన్‌ చేసుకొని, కొత్తవి చేపట్టి 44.37 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణను సాధించామన్నారు. ఐఏఎస్‌లకు శిక్షణలో పాఠ్యాంశంగా రాష్ట్ర ప్రాజెక్టులు మారాయంటే అంతకంటే గౌరవం ఏముంటుందని పేర్కొన్నారు. కాగా, టీఎస్‌పీఎస్సీ ద్వారా చేపట్టే ఉద్యోగాల భర్తీకి నిర్వహించే పరీక్షల్లో ఉర్దూలో రాసే అవకాశాన్ని కల్పిస్తామన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top