నిమ్స్‌ డాక్టర్లు, వైద్య సిబ్బందికి ఆరోగ్యశ్రీ ఇన్‌సెంటివ్‌ | Minister Damodar Rajanarsimha approves recruitment of over 800 medical staff in Telangana | Sakshi
Sakshi News home page

నిమ్స్‌ డాక్టర్లు, వైద్య సిబ్బందికి ఆరోగ్యశ్రీ ఇన్‌సెంటివ్‌

May 10 2025 4:34 AM | Updated on May 10 2025 4:34 AM

Minister Damodar Rajanarsimha approves recruitment of over 800 medical staff in Telangana

నెరవేరిన పదేళ్ల ఆకాంక్ష 

800లకుపైగా సిబ్బంది భర్తీకి మంత్రి దామోదర అనుమతి

నిమ్స్‌ 2024–25 ప్రగతి నివేదికను మంత్రికి అందజేసిన డైరెక్టర్‌ బీరప్ప

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని ప్రముఖ ప్రభుత్వ ఆసుపత్రి నిమ్స్‌లో ఆరోగ్యశ్రీ పేషెంట్లకు చికిత్స అందించినందుకు, ఆరోగ్యశ్రీ ట్రస్టు నుంచి వచ్చే రీయింబర్స్‌మెంట్‌ నుంచి 35 శాతం ఇకనుంచి డాక్టర్లు, వైద్య సిబ్బందికి అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలకు శుక్రవారం సచివాలయంలో జరిగిన నిమ్స్‌ ఎగ్జిక్యూటివ్‌ బోర్డు సమావేశంలో ఆరో గ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆమోదం తెలిపారు. తద్వారా డాక్టర్లు, సిబ్బంది పదేళ్ల ఆకాంక్ష నెరవేరినట్లయింది. ఈ మేరకు మంత్రికి నిమ్స్‌ డైరెక్టర్‌ బీరప్ప, ఇతర వైద్యాధికారులు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా 2024–25 లో నిమ్స్‌ పేషెంట్లకు అందించిన సేవల వివరాలతో కూడిన నివేదికను డైరెక్టర్‌ బీరప్ప మంత్రికి అందజేశారు. 2023 కంటే 2024 లో అవుట్‌ పేషెంట్ల సంఖ్య 12.6 శాతం పెరిగిందని, ఆరోగ్యశ్రీ కింద అడ్మిట్‌ అయిన పేషెంట్ల సంఖ్య 22.4 శాతం పెరిగిందని బీరప్ప తెలిపారు. నిమ్స్‌లో చికిత్స కోసం 2024లో 11 వేల మంది పేదలకు ప్రభుత్వం ఇచి్చన ఎల్‌వోసీల ద్వారా చికి త్స అందించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా నిమ్స్‌లో పెరిగిన రోగుల సంఖ్యకు అనుగుణంగా డాక్టర్లు, నర్స్, స్టాఫ్‌ను రిక్రూట్‌ చేసుకునేందుకు అనుమతించాలని మంత్రిని కోరగా, సుమారు 800లకు పైగా పోస్టుల భర్తీకి మంత్రి అనుమతి ఇచ్చారు. 

వైద్యం విషయంలో రాజీ పడొద్దు 
ఈ సందర్భంగా మంత్రి దామోదర మాట్లాడుతూ వైద్యం విషయంలో ఏమాత్రం రాజీ పడవద్దని వైద్యాధికారులకు సూచించారు. నిమ్స్‌పై ప్రజలకు ఎంతో నమ్మకం ఉన్నదని, సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి చికిత్స కోసం వస్తుంటారన్నారు. నిమ్స్‌ నూతన భవనాల నిర్మాణంలో కూడా నాణ్యతలో లోపం లేకుండా, వీలైనంత వేగంగా పనులు పూర్తి చేయాలన్నారు. నిర్మాణ పనులపై త్వరలోనే పూర్తి స్థాయిలో సమీక్షిస్తానని, అన్ని వివరాలతో రావాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా చొంగ్తూ, నిమ్స్‌ డైరెక్టర్‌ బీరప్ప, ఆర్థిక శాఖ డిప్యూటీ సెక్రటరీ శైలజ తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement