Telangana Government To Merge TSRTC With Government - Sakshi
Sakshi News home page

TSRTC: నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి ప్రభుత్వంలో విలీనంతో ఊపిరి 

Published Tue, Aug 1 2023 9:08 AM

Merge With TS Government: Boost To TSRTC In Losses - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తీవ్ర ఆర్థిక కష్టనష్టాలతో దివాలా దిశలో ఉన్న రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు.. ప్రభుత్వంలో విలీనం ద్వారా ఊపరిలూదినట్టయింది. రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న తాజా నిర్ణయంతో సంస్థ మనుగడకు భరోసా, అందులోని 43,373 సిబ్బందికి ఉద్యోగ భద్రత లభించనుంది. పింఛన్‌ సదుపాయం సైతం లభించనుంది. ప్రస్తుతం ఆర్టీసీ ఉద్యోగులుగా ఉన్న సిబ్బంది మొత్తం రాష్ట్ర ప్రజా రవాణా శాఖ ఉద్యోగులుగా మారనున్నారు. అయితే ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనమైనప్పటికీ, తెలంగాణ ఆర్టీసీ మాత్రం మనుగడలోనే ఉండనుంది.

అందులో కేంద్ర ప్రభుత్వ ఈక్విటీ ఉన్నందున, కార్పొరేషన్‌ను రద్దు చేయటం అంత సులభమైన ప్రక్రియ కాదు. అందువల్ల ప్రస్తుతానికి కార్పొరేషన్‌గా కొనసాగుతూనే.. ఉద్యోగులు మాత్రం ప్రభుత్వ సిబ్బందిగా చెలామణి కానున్నారు. విలీన ప్రక్రియకు సంబంధించి ప్రభుత్వం నియమించిన ఉన్నతస్థాయి అధికారుల కమిటీ ఇచ్చే నివేదిక అధారంగా విధివిధానాలు ఖరారు కానున్నాయి. 2020లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అక్కడి ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసిన విష యం తెలిసిందే. ఫలితంగా అక్కడి ప్రజా రవాణా సంస్థ బలపడింది. ఉద్యోగుల ఆర్థిక స్థితిగతుల్లో మెరుగుదలతో వారిలో సంతృప్తి వ్యక్తమవుతోంది.  

తీరనున్న అప్పులు! 
ఈ విలీన ప్రక్రియతో ఆరీ్టసీపై జీతాల భారం పూర్తిగా తొలగనుంది. ప్రస్తుతం సంస్థ ప్రతి నెలా రూ.200 కోట్ల మేర జీతాల రూపంలో భరిస్తోంది. విలీనం తర్వాత జీతాలను ప్రభుత్వమే ట్రెజరీ ద్వారా చెల్లించనున్నందున, తద్వారా మిగిలే రూ.200 కోట్లను సంస్థ అప్పులు, బకాయిలు తీర్చేందుకు వినియోగించే అవకాశం ఏర్పడింది. ప్రస్తుతం తెలంగాణ ఆరీ్టసీకి రూ.2,400 కోట్ల బ్యాంకు అప్పులున్నాయి. ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు, భవిష్యనిధి, ఆర్టీసీ సహకార పరపతి సంఘం (సీసీఎస్‌) బకాయిలు మరో రూ.3,600 కోట్లు ఉన్నాయి.  

ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పే స్కేల్‌ 
ప్రభుత్వంలో విలీనం నేపథ్యంలో ఆర్టీసీలోని శ్రామిక్, అటెండర్, డ్రైవర్, కండక్టర్‌ మొదలుకుని రీజినల్‌ మేనేజర్, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌.. ఇలా సంస్థలోని అన్ని పోస్టులను ప్రభుత్వంలోని తత్సమాన పోస్టుల్లోకి మారుస్తారు. ఆయా పోస్టులకు వచ్చే వేతన స్కేల్‌ను వర్తింపజేస్తారు. ఇక విలీనంతో ఆర్టీసీ ఉద్యోగులకు పింఛన్‌ సదుపాయం లభించనుంది. సిబ్బంది ఆర్టీసీలో చేరిన సంవత్సరం ఆధారంగా పింఛన్‌ విధానాన్ని ఖరారు చేస్తారు. 

ఐదేళ్లకోసారి పీఆర్సీ: ప్రస్తుతం ఆర్టీసీ ఉద్యోగులకు 2017, 2021 పే స్కేల్‌ పెండింగులో ఉంది. దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం వెల్లడించలేదు. విలీనంతో ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ ప్రకారం స్కేల్‌ను వర్తింపజేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆరీ్టసీలో ప్రతి నాలుగేళ్లకు పే రివిజన్‌ జరుగుతుండగా, విలీనం ద్వారా ప్రభుత్వ ఉద్యోగులతో సమంగా ప్రతి ఐదేళ్లకోసారి పీఆర్సీ ద్వారా జీతాల పెంపు ఉంటుంది. ఆర్టీసీకి 1,500 ఎకరాల సొంత భూములు న్నాయి. ఇప్పుడు ప్రభుత్వంలో విలీనం నేపథ్యంలో, ఈ భూములను ప్రభుత్వం తన పరిధిలోకి తీసుకుంటుందా? కార్పొరేషన్‌ అధీనంలోనే ఉంచుతుందా? అన్నది చూడాల్సి ఉంది.

కార్మిక సంఘాల హర్షం 
‘తెలంగాణ వచ్చినప్పటి నుంచి చేస్తున్న డిమాండ్‌ ఇప్పుడు నెరవేరినందుకు సంతోషంగా ఉంది. అయితే విలీన విధివిధానాలు ఖరారు చేసే కమిటీలో ఆర్టీసీ కారి్మక సంఘాలకు కూడా చోటు కల్పించాలి..’అని ఎంప్లాయీస్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి విజ్ఞప్తి చేశారు. ‘ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయటంలో ఎన్‌ఎంయూ పాత్ర ఉంది. తెలంగాణలోనూ చాలాకాలంగా డిమాండ్‌ చేస్తున్నాం. ఇప్పటికి అది నెరవేరింది. కారి్మకులకు అధిక లబ్ధి కలిగేలా విలీన విధివిధానాలు రూపొందించాలి..’అని ఎన్‌ఎంయూ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ నరేందర్‌ అన్నారు.

ఉద్యోగుల కుటుంబాల్లో వెలుగు నింపారు:  బాజిరెడ్డి గోవర్దన్‌
సీఎం కేసీఆర్‌ది ఎంతో గొప్ప మనసని, ఎప్పట్నుంచో కష్టాల్లో ఉన్న ఆర్టీసీ ఉద్యోగులకు గొప్ప వరం అందించి, వారి కష్టాలన్నీ ఏకకాలంలో పోగొట్టారని టీఎస్‌ ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌ అన్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై ఆయన మీడియాతో మాట్లాడారు. ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ కూడా సంస్థ విలీనంపై హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.   

Advertisement
 
Advertisement
 
Advertisement