Medaram Jatara: Priests Objection On Removing Jaggery At Sammakka Gadde, Details In Telugu - Sakshi
Sakshi News home page

Meadaram Jatara: సమ్మక్మ-సారలమ్మ గద్దెల వద్ద బంగారం తొలగింపు సబబేనా..?

Feb 19 2022 8:18 AM | Updated on Feb 19 2022 12:47 PM

Medaram Jatara: Priests Objection On Removing Jaggery At Sammakka Gadde - Sakshi

పున్నమి వెలుగున గద్దెనెక్కిన వనదేవతలు.. భక్త‘కోటి’ ఆరాధ్య దైవాలు.. ఇంటి ఇలవేల్పులు. వరాలిచ్చే దేవరలు.. చెంతకొచ్చినా.. మదిలో తలచినా నిండు మనసుతో ఆశీర్వచనాలిచ్చే కల్పవల్లులు. రెండేళ్లకోసారి దర్శనభాగ్యం కల్పించేందుకు కళ్లెదుటే సాక్షాత్కరించగా.. జై సమ్మక్క.. జై సారలమ్మ తల్లీ అంటూ మొక్కుల చెల్లింపునకు అశేష భక్తజనం పోటెత్తింది. ఎత్తు బెల్లం(బంగారం), పసుపు, కుంకుమ, చీర సారె సమర్పిస్తూ తల్లుల సేవలో తరించారు. చల్లని చూపులను ప్రసాదిస్తూ.. కోరిన కోర్కెలు తీర్చేందుకు అభయమిచ్చితిరి ఆ అమ్మలు. 

సాక్షి, మేడారం(ఎస్‌ఎస్‌తాడ్వాయి/ఏటూరునాగారం): తల్లుల గద్దెలపై ఆచార వ్యవహారాలకు విరుద్ధంగా చేపట్టిన చర్యలను పూజారులు తప్పుబడుతున్నారు. మేడారం సమ్మక్క–సారలమ్మ కొలువుదీరిన గద్దెలపై బెల్లం(బంగారం), ఒడిబియ్యం, కొబ్బరి కుడుకలు, పోక, ఖర్జూర, చీర సారె భక్తులు సమర్పించడం పూర్వం నుంచి వస్తున్న ఆచారం. ఇవన్నీ చుట్టూరా ఉంటేనే అమ్మవార్లు అక్కడ ఉన్నట్లు భావిస్తారు. అయితే.. జాతర పూర్తి కాకముందే ఎప్పటికప్పుడు కానుకలు తొలగించడం సంప్రదాయానికి విరుద్ధమని పలువురు పూజారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పూజారిని అడగగా.. బంగారం తొలగించడాన్ని తాము తప్పుబడుతున్నామని, అమ్మవార్లు గద్దెలపై కొలువుదీరిన నాటి నుంచి వనప్రవేశం చేసే వరకు రాశిగా ఉంటేనే ఆనందంగా ఉంటుందని చెప్పుకొచ్చారు.
చదవండి: మేడారం జాతర: గట్టి మంత్రి.. ‘పంచాయితీ’ పెట్టే మంత్రిని కాను..

కాగా.. వనప్రవేశం ముందు ఆచారంగా ఆదివాసీలు, మేడారం ఆడబిడ్డలు, స్థానికులు గద్దెలపై ఉన్న బెల్లం, చీర సారెలను ప్రసాదంగా ఇంటికి తీసుకెళ్తారు. ఇప్పుడంతా తొలగించడంతో ఈసారి ప్రసాదం స్థానిక ఆదివాసీలకు అందే పరిస్థితి లేకుండా పోయిందని పూజారులు వాపోయారు. జాతరకు ముందు జరిగిన సమీక్షలో సైతం గద్దెలపై కేవలం ప్లాస్టిక్‌ కవర్లు మాత్రమే తొలగించాలని పూజారులు సూచించారు. దీనిపై డీపీఓ వెంకయ్యను వివరణ కోరగా.. భక్తులకు ఇబ్బంది కలగకుండా ప్రతి జాతరలో ఇలానే తొలగిస్తామని, ఈసారి కూడా తొలగించినట్లు పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement