
సాక్షి, మెదక్: జిల్లాలోని శివంపేట మండలంలో చేపట్టిన రైతుల ధర్నా ఉద్రిక్తతకు దారితీసింది. ఎమ్మార్వోపై రైతులు డీజిల్ పోయడంతో పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. వివరాలు... స్థానిక తాళ్లపల్లి తండాకు చెందిన మాలోతు బాలు అనే రైతు విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. అయితే, అతడి పేరు మీద భూమి ఉన్నప్పటికీ కొత్త పాస్‌బుక్ రాకపోవడంతో.. రైతు బీమా రాని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో తీవ్ర ఆవేదనకు లోనైన మృతుడి కుటుంబీకులు, తండాకు చెందిన రైతులు ఎమ్మార్వో కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు.
మాలోతు బాలు మృతదేహంతో ధర్నా చేపట్టారు. రెవెన్యూ అధికారుల అలసత్వం కారణంగానే మృతుడి కుటుంబం తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చిందంటూ ఆందోళన చేశారు. ఈ సందర్భంగా కొంతమంది గిరిజనులు డీజిల్ మీద పోసుకుని నిరసన తెలిపారు. ఈ క్రమంలో వారిని కలిసేందుకు అక్కడికి వచ్చిన ఎమ్మార్వోపై కూడా డీజిల్ పోశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు.
చదవండి: ‘మొక్క’వోని దీక్ష.. అంత పెద్ద చెట్టును మళ్లీ నాటాడు!