కరెంటు కోతలపై రైతన్నల కన్నెర్ర
శివ్వంపేట, న్యూస్‌లైన్: వ్యవసాయానికి విద్యుత్ సక్రమంగా సరఫరా కాకపోవడాన్ని నిరసిస్తూ శుక్రవారం రైతులు ఆందోళన బాట పట్టారు. మండల పరిధిలోని పిల్లుట్ల, రత్నాపూర్, అల్లిపూర్, కొత్తపేట గ్రామాల రైతులు కొత్తపేట విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. సమయపాలన పాటించకుండా విద్యుత్‌ను సరఫరా చేయడం, అది మూడు గంటలకు మించి సరఫరా చేయడం లేదంటూ సబ్‌స్టేషన్ ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా విద్యుత్ సిబ్బందికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న ఏఈ నాగరాజు పోలీసులతో సబ్‌స్టేషన్‌కు వచ్చారు. ఇకనుంచి విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూస్తానని నచ్చజెప్పడంతో రైతులు ఆందోళన విరమించారు.
న్యాల్కల్,న్యూస్‌లైన్: విద్యుత్ సమస్యలపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పం దించని ట్రాన్స్‌కో సిబ్బందిపై రేజింతల్ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం బకాయిల వసూలు కోసం గ్రామానికి వచ్చిన ట్రాన్స్‌కో జూనియర్ ఇంజనీర్, లైన్మన్లను పంచాయతీ కార్యాలయంలో నిర్బంధించారు. సమస్యను పరిష్కరించే వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. విద్యుత్ సక్రమంగా సరఫరా కాకపోవడంతో తాగునీటికి కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామనీ, పంటలన్నీ ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సమయంలోనే నిర్బంధంలో ఉన్న ట్రాన్స్‌కో సిబ్బంది విషయాన్ని ఫోన్ ద్వారా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. వారి సూచన మేరకు ఇకనుంచి విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో శాంతించిన గ్రామస్తులు ట్రాన్స్‌కో సిబ్బందిని విడుదల చేశారు.