
షాబాద్, పరిగి(వికారాబాద్ జిల్లా): రంగాపూర్ వద్ద జరిగిన ప్రమాదంలో మృతి చెందిన వారి స్వగ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. షాబాద్ మండలం సీతారాంపూర్ గ్రామానికి చెందిన ముత్యాల మల్లేశ్‌కు భార్య స్వప్న, ఇద్దరు కూతుళ్లు మాన్యశ్రీ, ఆర్యాధ్య, కూమారుడు ప్రనిల్ ఉన్నారు. మల్లేశ్ మండల పరిధిలోని నాగర్‌గూడలో కులవృతి అయిన కటింగ్ షాప్ నడుపుతూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఆయన మృతి చెందడంతో భార్యాపిల్లలు దిక్కులేనివారయ్యారు.
సోలీపేట్‌కు చెందిన మంగలి బాలమ్మకు ముగ్గురు కుమారులు, ఓ కూతురు ఉన్నారు. అందరి వివాహాలయ్యాయి. చేవెళ్ల మండలం రావులపల్లికి చెందిన హేమలత తన ఇద్దరు పిల్లలను తీసుకుని పెళ్లికి వెళ్లింది. రోడ్డు ప్రమాదంలో ఆమె అక్కడిక్కడే మృతి చెందగా, మోక్షిత నీలోఫర్‌లో చికిత్స పొందుతోంది.
అనాథలయ్యామురా..
‘తమ్ముడూ మీ బావ లేడురా.. మనల్ని వదిలి వెళ్లాడురా.. నేను, నా పిల్లలు అనాథలయ్యామురా’.. అంటూ పెళ్లి కుమారుడి (సతీష్) అక్క స్వప్న తన తమ్ముడి పట్టుకుని విలపించింది. తండ్రి రామస్వామి రాగానే నా బతుకు ఆగమయ్యింది నాన్నా అంటూ రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది.
న్యాయం జరిగేలా చూస్తాం..
రంగాపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలను మంగళవారం ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్‌రెడ్డి, సీనియర్ నాయకులు చేవెళ్ల స్వామి, డాక్టర్ రాజు, మాజీ ఎంపీటీసీ అశోక్, మాజీ సర్పంచ్‌లు జనార్దన్‌రెడ్డి, మహేందర్‌గౌడ్, రాజేందర్‌రెడ్డి, నరేందర్, రఫిక్, దయాకర్ తదితరులు పరామర్శించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి సాయం అందేలా చూస్తామని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా కృషిచేస్తామని తెలిపారు.
చదవండి: చిన్నవిందుకు హాజరై వస్తుండగా ప్రమాదం